మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదు. సంఘర్షణకు ప్రతిరూపం.సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వర్తమానం అలాంటి పురోగామి స్వభావాన్నిఅందిపుచ్చుకుంది. మారిన పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు మనసు పెట్టి చదివి తల్లిదండ్రుల స్వప్నాన్ని సాకారం చేయాలి.
- కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు, యువత ప్రాణం పెట్టి చదివి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నడుస్తున్న ఉద్యోగపర్వాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రుల ఆశలు, తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ‘మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదు. సంఘర్షణకు ప్రతిరూపం. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ వర్తమానం అలాంటి పురోగామి స్వభావాన్ని అందిపుచ్చుకుంది..’ అని చెప్పారు.
మారిన పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు మనసు పెట్టి చదివి తల్లిదండ్రులు, నమ్ముకున్న ఆత్మీయుల స్వప్నాన్ని సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలకు సిద్ధమవుతున్న తెలంగాణ యువతకు ఆదివారం మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ రాశారు. కేసీఆర్ నేతృత్వంలో మారిన రాష్ట్ర పరిస్థితిని, తెలంగాణ ఆకాంక్షల సాధనకు జరుగుతున్న కృషిని వివరిస్తూ మార్గ నిర్దేశం చేశారు. కేటీఆర్ ఏమన్నారంటే..
తొమ్మిదేళ్లలో 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ
► వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షలను నిజం చేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్నాం. తొమ్మిదేళ్ల పాలనలో సుమారు 2.25 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా నిలవబోతున్నాం.
తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీకి అనుగుణంగా 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. రెండోసారి అధికారంలోకి వచ్చాక 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిబద్ధతతో వేగంగా చేపట్టాం. ఇప్పటికే సుమారు 32 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిష¯న్‌తో పాటు ఇతర శాఖల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చాం.
గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను అతి త్వరలో విడుదల చేయబోతున్నాం. మొత్తంగా అతితక్కువ సమయంలో 2.25 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలవబోతుంది.
95 శాతం స్థానికులకే..
► ఉద్యోగాల భర్తీలో స్థానికులకే ప్రాధాన్యత లభించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారు. అడ్డంకిగా ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించిన తరువాత ఆఫీస్ సబార్డినేట్ నుంచి ఆర్డీవో వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకే దక్కుతున్నాయి. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త జోనల్ వ్యవస్థతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఫలించింది. విద్యార్థులు, యువకుల కోరిక మేరకు ప్రభుత్వం ఉద్యోగ వమోపరిమితిని కూడా సడలించింది. తద్వారా మరింత మందికి అవకాశం దక్కింది.
క్రమబద్ధీకరణ..పారద్శకత
► ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే.. ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులను క్రమబద్ధీకరించాం. త్వరలోనే మరో 10 వేల మంది ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించబోతున్నాం. తెలంగాణ ఏర్పడక ముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసిన ఉద్యోగ నియామక ప్రక్రియపై ఎన్నో ఆరోపణలు, వివాదాలు నడిచాయి.
రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఆదేశాల మేరకు ప్రతి ఉద్యోగాన్నీ అత్యంత పారదర్శకంగా భర్తీ చేశాం. ఎలాంటి వివక్షకు తావు ఉండకూడదన్న ఉద్దేశంతో గ్రూపు–1 ఉద్యోగాల్లోనూ ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి పలికాం. ప్రభుత్వ ఉద్యోగాలే గాక, ప్రైవేట్ రంగంలోనూ భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం మెరుగుపరిచింది.
ఇప్పటిదాకా సుమారు 17 లక్షల మందికిపైగా ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించిన ఘనత తెలంగాణాదే. దేశంలో ఎక్కడాలేని విధంగా స్టార్టప్ ఎకో సిస్టంను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వినూత్నంగా ఆలోచించే యువతకు అండగా ఉండేందుకు టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్, టీఎస్‌ఐసీ వంటి వేదికలను ఏర్పాటు చేసింది.
నియోజకవర్గాల్లో కోచింగ్ సెంటర్లు
► ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు యువత కోసం కోచింగ్ సెంటర్లతో పాటు ఇతర వసతులను ఏర్పాటు చేశారు. నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడే లైబ్రరీల బలోపేతానికి సైతం ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఇప్పటి దాకా ఒకెత్తు... ఇప్పుడు ఒకెత్తు
► ఇప్పటిదాకా ఒకెత్తు... ఇప్పుడు ఒకెత్తు. సీఎం ఆశయానికి అనుగుణంగా ఉద్యోగ నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ప్రాణం పెట్టి చదవండి. తెలంగాణ యువతకు ఆకాశమే హద్దని చాటండి. పనికిమాలిన ప్రచారాలను పట్టించుకోవద్దు. అవకాశవాద, అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా లక్ష్యం మీదనే గురి పెట్టాలి. సానుకూల ధృక్పథంతో సాధన చేసి, స్వప్నాన్ని సాకారం చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment