రూ. 289 కోట్ల నష్టాల్లో గ్రేటర్ ఆర్టీసీ
పనితీరు మెరుగుపరచుకోవాలని అధికారులకు ఆదేశం
సమీక్షా సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి
సిటీబ్యూరో: ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గతేడాది జనవరి నాటికి రూ.144 కోట్లుగా ఉన్న నష్టాలు ప్రస్తుతం రూ.289 కోట్లకు చేరుకున్నాయి. సంస్థాగత లోపాలు, 44 శాతం ఫిట్‌మెంట్‌తో పెరిగిన జీతభత్యాల భారం, ఆదాయ మార్గాల పెంపుపై దూర దృష్టి లేకపోవడం తదితర కారణాలు గ్రేటర్ ఆర్టీసీని దారుణంగా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం గ్రేటర్ ఆర్టీసీపై రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపోల వారీగా లాభనష్టాలను బేరీజు వేసిన ఆయన గతేడాది నుంచి ఒక్క రూపాయి కూడా లాభం లేకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 3 నెలల్లో లాభాల దిశగా కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. 3804 బస్సుల పై ప్రతి రోజు రూ.3.68 కోట్ల ఆదాయం వస్తుండగా, రోజుకు రూ.4.65 కోట్ల చొప్పున ఖర్చులు ఉన్నట్లు అధికారులు వివరించారు. దీంతో రోజుకు రూ.97 లక్షల చొప్పున నష్టాలు వాటిల్లుతున్నట్లు సమీక్షలో తేలింది. నగరంలోని 28 డిపోలూ నష్టాల బాటలోనే నడుస్తున్నట్లు గుర్తించి న ఆయన డిపో మేనేజర్లు పనితీరును మెరుగుపర్చుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హకీంపేట్‌లోని ఆర్టీసీ అకాడెమీలో జరిగిన ఈ సమీక్షలో రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ, ఆర్టీసీ జేఎండీ రమణారావు, ఈడీ పురుషోత్తమ్‌నాయక్, రీజనల్ మేనేజర్లు, డీవీఎంలు తదితరులు పాల్గొన్నారు.
జీతభత్యాల భారం రూ. 210 కోట్లు
గ్రేటర్ ఆర్టీసీలోని 28 డిపోల్లో 22,114 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ప్రభుత్వం 44 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం వల్ల పెరిగిన జీతాలు, కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ వల్ల ప్రతి నెలా రూ.21 కోట్ల చొప్పున రూ.210 కోట్లు అదనపు భారం పడిందని అధికారులు తెలిపారు. మంత్రి జోక్యం చేసుకుంటూ జీతభత్యాల వల్ల భారం పెరిగినా కార్మికులు ‘బస్సు మనది-సంస్థ మనది’ అనే స్ఫూర్తితో పని చేస్తున్నారని అధికారుల్లో నే ఆ స్ఫూర్తి కొరవడిందని ఆగ్రహం వ్య క్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తుందని, నష్టాల నుంచి గట్టెక్కే మార్గాలపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు.
బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయింపు...
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో కొత్త బస్సుల కొనుగోలు కోసం ఆర్టీసీకి రూ.50 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. నగరంలో నష్టాలను అధిగమించేందుకు సిటీ శివార్లలోని డిపోల నుంచి విజయవాడ, విశాఖ,బెంగళూర్, ముంబయి, చైన్నై వంటి దూరప్రాంతాలకు బస్సులు నడపాలని అధికారులకు సూచించారు. రవాణా సదుపాయాలను మెరుగుపర్చేందుకు మరో రెండు డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.