చెరువుల పునరుద్ధరణతో గ్రామాలు సస్యశ్యామలం
మంత్రి మహేందర్‌రెడ్డి
షాబాద్: మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణతో గ్రామీణ ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని హైతాబాద్‌లో, లక్ష్మరావుగూడ సంగయ్య కుంటలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటి వ్యవసాయం కుంటుపడుతున్న ప్రస్తుత తరుణంలో చెరువులను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోని చెరువులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. చెరువులను అభివృద్ధి చేస్తే వ్యవసాయ భూములు సారవంతమవుతాయని, భూగర్భజలాలు పెరిగి సాగు, తాగునీటి సమస్య తీరుతుందని చెప్పారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పట్నం అవినాష్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు జడల లక్ష్మి, ఎంపీపీ పట్నంశెట్టి జ్యోతి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.