Mission Kakatiya scheme
-
మిషన్ కాకతీయకు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇండోనేసియాలోని బాలిలో జరగనున్న అంతర్జాతీయ సదస్సులో ఈ పథకంపై ప్రజెంటేషన్ ఇచ్చేందుకు రావాల్సిందిగా థర్డ్ వరల్డ్ ఇరిగేషన్ ఫోరం (డబ్ల్యూఐఎఫ్3) ప్రతినిధి విజయ్. కె.లబ్సెత్వార్ నుంచి ఇరిగేషన్ శాఖకు లేఖ అందింది. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ సంస్థ (ఐసీఐడీ) ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. మిషన్ కాకతీయపై సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, చిన్న నీటివనరుల ఎస్ఈ కె.శ్యాంసుందర్‌లు రాసిన సాంకేతిక పత్రం ఈ సదస్సులో సమర్పించేందుకు ఆమోదం పొందింది. అలాగే ఆన్ ఆఫ్ పద్ధతి ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో నీటి నిర్వహణ అభివృద్ధి గురించి, ఎస్సారెస్పీలో నీటి సమర్థ వినియోగం గురించి రాసిన సాంకేతిక పత్రాలు కూడా సదస్సు ఆమోదం పొందాయి. ఈ మేరకు ఈ మూడు అంశాలపై ఇరిగేషన్ అధికారులు సదస్సుకు హాజరై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మూడు సాంకేతిక పత్రాలు రాసిన అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్, అడ్మిన్ ఈఎన్సీ బి.నాగేందర్‌రావులు అభినందించారు. -
వడివడిగా ప్రాజెక్టులు
ఈ ఏడాది సాగులోకి మరో 12 లక్షల ఎకరాలు.. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రం హక్కుగా కలిగిన నికర, మిగులు జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తేవడం లక్ష్యంగా చేపట్టిన ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం తొలి నుంచీ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఐదేళ్ల కాలంలో 10 ప్రాజెక్టులను పూర్తి చేయగా మరో 13 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణగా మారుస్తామన్న ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని 1.25 కోట్ల ఎకరాల మాగాణంగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భారీ, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టులు, పథకాల కింద 70.64 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. 2004లో మొదలైన జలయజ్ఞం ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలతో ప్రభుత్వం ఇప్పటివరకు 16.65 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చింది. ఇందులో రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఏకంగా 12.78 లక్షల ఎకరాలను సాగులోకి తేవడం విశేషం. ప్రధానంగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, దేవాదుల, సింగూరు వంటి భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కిందే 10.94 లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో 54.05 లక్షల ఎకరాలను వృధ్ధిలోకి తేవాల్సి ఉంది. ఇందులో ఈ ఏడాది ఖరీఫ్ నాటికి కనిష్టంగా దాదాపు 12 లక్షల ఎకరాలకైనా కొత్తగా సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐదేళ్లలో రూ. 81 వేల కోట్లు... రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ. 80వేల కోట్ల మేర సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ. 23 వేల కోట్ల మేర నిధులు ఖర్చు చేయగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో మునుపెన్నడూ లేనివిధంగా రూ. 30,588 కోట్లు ఖర్చు చేసింది. 2017–18లో కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే రూ. 18 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. ఇక దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వలకు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయగా వాటి ద్వారా మరో రూ. 5 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. మొత్తంగా కార్పొరేషన్ రుణాల ద్వారా ఇంతవరకు రూ. 33,664 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కాళేశ్వరం కార్పొరేషన్ కిందే మొత్తంగా రూ. 28,661 కోట్ల మేర ఖర్చు జరిగింది. మొదలుకానున్న కాళేశ్వర శకం... రాష్ట్ర సాగునీటి రంగంలో కొత్త అధ్యాయం ఆవిష్కృతం కానుంది. ఈ ఏడాది జూలై నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల శకం మొదలు కానుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అతితక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి నీటిని పంట పొలాలకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ ఏడాది జూలై చివరి నుంచి కాళేశ్వరం ద్వారా కనీసం 150 టీఎంసీల నుంచి గరిష్టంగా 200 టీఎంసీల నీటిని తరలించేలా పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు పూర్తవగా పంప్‌హౌస్‌లలో ఈ నెల మొదటి లేదా రెండో వారం నుంచి డ్రై రన్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6లో ఇప్పటికే 4 మోటార్ల డ్రై రన్ పూర్తయింది. ప్యాకేజీ–7లో టన్నెల్ పనులు పూర్తయ్యాయి. ప్యాకేజీ–8లో మోటార్లన్నీ సిద్ధమయ్యాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు జరగకున్నా ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఫీడర్ చానల్ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టును స్థిరీకరించే పనులు చివరికొచ్చాయి. మొత్తంగా ఈ ఖరీఫ్‌లోనే 10 లక్షల ఎకరాల స్థిరీకరణ, మరో 90 వేల ఎకరాల మేర కొత్త ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు చేస్తున్నారు. చెరువుల పునరుద్ధరణ సక్సెస్.. ఇక చెక్‌డ్యామ్‌లపై దృష్టి తెలంగాణ తొలి ప్రభుత్వం చిన్న నీటివనరుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ పథకం చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. నాలుగు విడతల్లో 26,926 చెరువులను పునరుద్ధరించింది. ఇందుకోసం రూ. 3,979.53 కోట్లు ఖర్చు చేసింది. ఈ పనులతో 8.53 టీఎంసీల నీటి నిల్వ పెరగడంతోపాటు 13.57 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఇక ఇప్పుడు ఎక్కడి నీటిని అక్కడే కట్టడి చేసేలా గొలుసుకట్టు చెరువుల వద్ద చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి సర్కారు సిద్ధమైంది. మొత్తంగా 1,200 చెక్‌డ్యామ్‌లు, 3 వేల తూముల నిర్మాణం చేయాలని భావిస్తోంది. తూముల నిర్మాణం ద్వారా 8,350 చెరువులను నింపేలా పనులు మొదలుపెట్టింది. ఇందుకోసం రూ. 4,200 కోట్లు ఖర్చు చేయనుంది. ఇప్పటికే తూముల టెండర్ల పనులు మొదలవగా చెక్‌డ్యామ్‌లకు ఇప్పుడిప్పుడే అనుమతిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేక నిర్జీవంగా మారిన భూములన్నీ ఇప్పుడు నిండు సత్తువను సంతరించుకుంటున్నాయి. నీటి జాడ లేక వట్టిపోయిన చెరువులన్నీ నేడు నీటితో కళకళలాడుతున్నాయి. పడావు భూములు కాస్తా పచ్చని పంట పొలాలుగా మారుతున్నాయి. అరవై ఏళ్లుగా సాగునీటి కోసం పడ్డ అరిగోస.. ఐదేళ్ల కాలంలోనే కోటి ఎకరాల మాగాణం దిశగా వడివడిగా పరుగులు పెడుతోంది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 1.25 కోట్ల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంలో ఇప్పటికే 71 లక్షల ఎకరాల మార్కును దాటింది. తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్న ఐదేళ్ల కాలంలోనే ఏకంగా కొత్తగా 12.77 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రాగా మరో 14.78 లక్షల ఎకరాల స్థిరీకరణ పూర్తయింది. ప్రాజెక్టులపై మొత్తంగా 2004 నుంచి ఇప్పటివరకు రూ. 1.11 లక్షల కోట్ల మేర ఖర్చవగా గత ఐదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా రూ. 81 వేల కోట్లు ఖర్చు చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. నాలుగేళ్లలో మరో రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి కోటి ఎకరాల మాగాణ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది. – సాక్షి, హైదరాబాద్ -
‘సాక్షి’కి మిషన్ కాకతీయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకంపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధించి బుధవారం అవార్డులను ప్రకటించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగాల్లో ఇద్దరు ‘సాక్షి’ జర్నలిస్టులకు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ప్రింట్ మీడియా విభాగంలో సంగారెడ్డి జిల్లా ప్రతినిధి కల్వల మల్లికార్జున్‌రెడ్డి రాసిన ‘పడావు భూముల్లో సిరుల పంట’అందోల్ పెద్ద చెరువు విజయగాథ కథనానికి రాష్ట్ర స్థాయిలో మూడో బహుమతి లభించింది. చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలకు నెలవుగా ఉన్న అందోల్ పెద్ద చెరువు 30 ఏళ్లుగా పడావులో ఉన్న వైనాన్ని వివరిస్తూ.. రెండేళ్లుగా పుట్ల కొద్దీ ధాన్యంతో రైతులు పులకిస్తున్న తీరుకు ఈ కథనం అద్దం పట్టింది. ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో ‘సాక్షి’టీవీ ప్రతినిధి కొత్తకాపు విక్రమ్‌రెడ్డి ‘జలకళ’ పేరిట మిషన్ కాకతీయ ఫలితాలతో సాగు విస్తీర్ణం పెరిగిన తీరుపై ఇచ్చిన ప్రత్యేక కథనానికి రాష్ట్ర స్థాయిలో మూడో బహుమతి లభించింది. అవార్డుకు ఎంపికైన సాక్షి పాత్రికేయులు అవార్డుతో పాటు రూ.50 వేల నగదును త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించే అవార్డుల ప్రదానోత్సవంలో అందుకోనున్నారు. -
మిషన్ కాకతీయతో విప్లవాత్మక మార్పు: గోయల్
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకం నీటి వనరుల ఉపయోగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్ వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులకు రీఓరియెంటేషన్, కెపాసిటీ బిల్డింగ్ అనే అంశంపై శుక్రవారం హెచ్ఆర్డీలో ఏర్పాటు చేసిన ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల అవసరాలకు తగిన శిక్షణ కార్యక్రమాలు, అందుకు సంబంధించిన క్యాలెండర్‌ను రూపొందిస్తామని ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య వెల్లడించారు. స్వచ్ఛ హైదరాబాద్ ద్వారా నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి వివరించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో హైదరాబాద్ కీలక పాత్ర వహించేలా ఉద్యోగులు తమ బాధ్యతలు నిర్వర్తించాలని, శిక్షణ తరగతులు అందుకు ఉపకరిస్తాయని జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని పరిణామాలకు అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడాలని ఆకాంక్షించారు. -
వైభవం గతమే..!
దుర్గం చెరువుకు పూర్వవైభవం ఎప్పుడో...! గుర్రపు డెక్కతో కుంచించుకుపోతున్న చెరువు మంత్రి కేటీఆర్ ఆదేశించినా పట్టించుకోని అధికారులు సాక్షి, సిటీబ్యూరో: చుట్టూ కొండల మధ్యలో సుందరంగా కొలవుదీరిన దుర్గం చెరువు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో నగరవాసులకు పర్యాటక కేంద్రంగా విలసిల్లిన ఈ ప్రాంతం ప్రాభవాన్ని కోల్పోతోంది. చెరువులో గుర్రపు డెక్క పరచుకుపోవడంతో చెరువు ఉన్నట్లుగానే కనిపించ డం లేదు. నగరం విస్తరించ ముందుకు దుర్గం చెరువు గురించి అతి కొద్ది మందికి మాత్రమే అతికొద్దిమందికి మాత్రమే తెలిసేది. ‘సీక్రేట్ లేక్’ గా గుర్తింపు పొందిన ఈ చెరువు గతంలో గోల్కొండ కోటకు తాగునీటి వనరుగా ఉండేది. ‘సైబరాబాద్’ అభివృద్ధితో ఈ చెరువుకు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ దీని బాధ్యతలను పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించింది. ఈ నేపథ్యంలో చెరువుకు ఓ వైపు సమ్థింగ్పిషీ పేరిట బార్ అండ్ రెస్టారెంట్ చేశారు. మరోవైపు రెస్టారెంట్లు నిర్మించారు. బోటు షికారుకు చర్యలు తీసుకున్నారు. గుర్రపు డెక్కతోనే సమస్య అయితే నగర విస్తరణతో చెరువు మురికి కూపంగా మారుతోంది. సమీప కాలనీల నుంచి మురుగునీరు చెరువులోకి చేరడం, చెరువు గర్భంలోనే అపార్టుమెంట్లు వెలియడంతో ఆనవాళ్లు కోల్పోతోంది. దీనికితోడు జలాశయంలో గుర్రపు డెక్క విస్తరించడంతో బోటు షికారుకు అంతరాయం ఏర్పడింది. రెండు ఏళ్లుగా బోటింగ్‌ను నిలిపివేశారు. అమలుకు నోచని మంత్రి ఆదేశాలు.. గ్రేటర్ బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్న మంత్రి కేటార్ ఏడాది క్రితం అధికారులతో కలిసి చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా చెరువు అభివృద్ధికి పనులు వేగవంతం చేయాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అయితే అప్పటినుంచి నేటి వరకు పనుల్లో కొంచెమైనా పురోగతి కనిపించలేదు. రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు అభివృద్ధి చేస్తున్న మంత్రి హరీష్ రావుకు దుర్గం చెరువుకు ఎందుకు కనపడలేదని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. -
చెరువే.. చేవ!
రాష్ట్రంలో చెరువుల కింద భారీగా పెరిగిన సాగు ఈ రబీలో ఏకంగా 7.5 లక్షల ఎకరాల్లో పంటలు పదేళ్లలో ఎన్నడూ 2.5 లక్షల ఎకరాలకు దాటని వైనం ‘మిషన్ కాకతీయ’తో నీటి లభ్యత పెరగడం వల్లే భారీ సాగు ప్రభుత్వానికి అధికారుల నివేదిక హైదరాబాద్: రాష్ట్రంలో చిన్న నీటి వనరులుగా ఉన్న చెరువుల కింద పంటల సాగు భారీగా పెరిగింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ రబీలో రికార్డు స్థాయిలో పంటలు వేశారు. నీటి పారుదల శాఖ గణాంకాల ప్రకారమే చెరువుల కింద సాగు 7.5 లక్షల ఎకరాలు దాటింది. ‘మిషన్ కాకతీయ’పథకం కింద చేపట్టిన పునరుద్ధరణ పనులతో చెరువుల్లో నీటి లభ్యత పెరగడం, భారీ ప్రాజెక్టుల నీటితో చెరువులను నింపడమే సాగు పెరిగేందుకు దోహద పడింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో చెరువుల పునరుద్ధరణ జరిగితే రాష్ట్రంలోని మొత్తం చెరువుల కింద ఉన్న 24 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం పెద్ద కష్టమేమీ కాదని చిన్న నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. పదేళ్లలో అత్యధికం 2.4 లక్షల ఎకరాలే రాష్ట్రంలో మొత్తంగా 46,531 చెరువులు ఉండగా.. వాటి కింద 24,39,515 ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా, గోదావరి నదుల్లో కలిపి 255 టీఎంసీల మేర కేటాయింపులు న్నాయి. అయినా పూర్తి స్థాయిలో నీటి వినియోగం జరగకపోవడంతో గరిష్టంగా 10 లక్షల ఎకరాలకు మించి నీరందించిన సందర్భాలు లేవు. 2008–09 నుంచి ఇప్పటి వరకు ఖరీఫ్, రబీ సీజన్ల వారీగా చూస్తే... గరిష్టంగా 2013–14 ఖరీఫ్‌లో 9,04,752 ఎకరాల్లో సాగు జరిగింది. అంతకుముందు 2012–13 ఖరీఫ్‌లో 6.43 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. 2008 నుంచి రబీ సాగును పరిశీలిస్తే... ఎప్పుడూ 2.4 లక్షల ఎకరాలు దాటలేదు. 2008–09లో గరిష్టంగా 2.38 లక్షల ఎకరాల్లో సాగు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. అత్యంత కనిష్టంగా గతేడాది (2015–16లో) కేవలం 55 వేల ఎకరాలకే సాగు పరిమితమైంది. పునరుద్ధరణతో.. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడం, ఆ సమయానికే పెద్ద సంఖ్యలో చెరువుల పునరుద్ధరణ జరగడం ఈసారి రబీ సాగుకు ఊపిరి పోసింది. తొలి విడతలో 8,059 చెరువుల పునరుద్ధరణ పూర్తి చేయడం.. రెండో విడతలో 8,806 చెరువుల పనులు చేపట్టి, 1,536 చెరువులను పూర్తిగా, మిగతా వాటిని 50శాతానికిపైగా పూర్తి చేయడంతో అవన్నీ జలకళను సంతరించుకున్నాయి. మొత్తంగా 46 వేల చెరువులకుగాను 30 వేల వరకు చెరువులు నిండటం, మరో 10 వేల చెరువుల్లోనూ 75 శాతందాకా నీరు చేరడంతో పంటల సాగు పెరిగింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో దాదాపు పూర్తి స్థాయి లక్ష్యాలకు దగ్గరగా సాగు నమోదు కావడం గమనార్హం. ప్రాజెక్టుల నీటితోనూ.. గత సెప్టెంబర్‌లో కురిసిన కుండపోత వర్షాలకు భారీ ప్రాజెక్టులన్నీ నిండ టంతో.. ప్రభుత్వం చెరువులను నింపేందుకు ప్రత్యేక కార్యాచరణ రూ పొందించింది. ఎస్సారెస్పీ కాకతీయ కాల్వ, వరద కాల్వ, దేవాదుల పంపింగ్ ద్వారా గోదావరి వరద నీటిని తరలించి కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో 800 చెరువులను నింపారు. మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ల ద్వారా మరో 250 చెరువు లను నింపారు. పదేళ్ల తర్వాత ఎస్సారెస్పీ రెండో దశ ద్వారా చెరువులను నింపి సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు నీరందించారు. ఇలా చెరువులను నింపడం రబీలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగేందుకు దోహదపడింది. ఇక గతంలో సాగైన భూమి విషయంలో వ్యవసాయ, రెవెన్యూ, సాగునీటి శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో కచ్చిత మైన లెక్కలు వచ్చేవి కావని, ఈ ఏడాది మూడు శాఖల సమన్వయంతో చెరువుల కింద సాగు లెక్కలు తేల్చారని చెబుతున్నారు. -
మిషన్‌కాకతీయ.. అంతా మాయ
చెరువులను వదిలి కుంటలకు ప్రాధాన్యం ఆయకట్టు లేకున్నా చెరువుల పునరుద్ధరణ లక్ష్యాలపైనే గురి.. పట్టింపులేని రైతుల ప్రయోజనాలు మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణలో నిర్దేశిత లక్ష్యాలపైనే దృష్టి సారించిన అధికారులు రైతుల ప్రయోజనాలను విస్మరించారు. ఐదు నుంచి 20 ఎకరాలు మాత్రమే ఆయకట్టు ఉన్న చెరువులను, అసలు అయకట్టు లేని, తూములు, అలుగు నిర్మాణాలు లేని కుంటలను ఎంపిక చేశారు. పట్టుమని పదెకరాలు లేని కుంటల కింద 50 ఎకరాలపైన ఆయకట్టు ఉన్నట్లు చూపడంతో కాంట్రాక్టర్లకు కాసుల పంట పండింది. అధికారుల జేబులు నిండాయి. ఈ చిత్రంలో కట్టకు రెండు వైపులా నీళ్లు కనిపిస్తున్న చెరువు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన నందిపేట మండలంలోని గంగగడ్డ నడ్కుడ గ్రామానికి చెందినది. ఎకరం ఆయకట్టు కూడా లేని ఈ చెరువును మిషన్ కాకతీయ–2 కింద చేర్చి రూ. 7.85 లక్షలు కేటాయించారు. కాంట్రాక్టరు కట్టపై కొంత మొరం పోసి పనులు మమ అనిపించాడు. మంజూరైన నిధులను మింగేశాడు. అధికారులకు భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్ : సాగుభూములకు జీవనాడులుగా ఉన్న చెరువులు, కుంటలకు జలకళతో పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం లక్ష్యం అధికారుల ఇష్టారాజ్యంతో నీరుగారుతోంది. ఎక్కువ ఆయకట్టు ఉన్న చెరువులను వదిలి తక్కువ ఆయకట్టు ఉన్న కుంటలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆసలు ఆయకట్టు లేని కుంటలను, ఐదు నుంచి 20 ఎకరాల లోపు ఆయకట్టు గల కుంటలను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించేందుకు ఎంపిక చేశారు. పలు మండలాల్లో అసలు తూములు, ఆలుగు నిర్మాణాలు లేని కుంటలను ఎంపిక చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపునకు గురైన చెరువులు, కుంటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం విడ్డూరంగా ఉందంటున్నారు. నందిపేట, ఆర్మూర్, బాల్కొండ, నవీపేట మండలాల్లో ఇలాంటి చెరువులనే ఎంపిక చేసారు. ఇప్పటికే జిల్లాలో అత్యధిక కుంటల్లో ఉపాధిహామీ పథకం కింద పూడికతీత పనులు, కట్టబలోపేతం పనులు చేయించారు. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద ఖర్చుపెట్టిన రూ. 233.80 కోట్లలో సింహభాగం చెరువు పనులకే కేటాయించారు. దీంతో గుత్తెదారులు పూడికతీత కట్ట బలోపేతం పనులు వదిలి మిగతా పనులు చేస్తున్నారు. నామమాత్రంగా తూములు నిర్మించడం, మత్తడికి పై పూతలు పూసి మమ అనిపించేస్తున్నారు. పనులకు మంజూరైన నిధుల్లో పాతిక శాతం కూడా ఖర్చు చేయడం లేదు. నిధులను కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కలిసి పంచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. పెద్ద చెరువులను వదిలేశారు.. జిల్లాలో ఆయకట్టు లేని కుంటలకు ప్రాధాన్యత ఇచ్చిన ఇంజనీర్లు వందల ఆయకట్టు ఉన్న చెరువులను వదిలేసారు.పెద్ద చెరువులను మిషన్ కాకతీయ కింద తీసుకుంటూ లక్ష్యం నెరవేర్చడంలో విఫలం కావడం, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ రాకపోవడం వంటి కారణాలతో ఇంజనీర్లు చిన్నకుంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నా ఆరోపణలు ఉన్నాయి. ఇలా జిల్లాలో వదిలేసిన పెద్ద చెరువులు 40 వరకు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
'మిషన్ కాకతీయపై శ్వేతపత్రం విడుదల చేయాలి'
హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముందుచూపు వల్లే రాష్ట్రంలో ప్రాజెక్టులు నెలకొన్నాయని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...కేసీఆర్ సర్కార్ చేస్తోంది కేవలం ప్రచార ఆర్భాటమేనన్నారు. నకిలీ విత్తనాలతో లక్షల ఎకరాల్లో రైతులు నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దశల వారీగా కాకుండా ఒకేసారి రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో చేపట్టిన మిషన్ కాకతీయ పథకంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. -
వాస్తు దోషాలను సరిదిద్దండి
-
వాస్తు దోషాలను సరిదిద్దండి
- యాదాద్రి అభివృద్ధి పనుల పరిశీలన సందర్భంగా సీఎం ఆదేశం - ఆగ్నేయంలో సంపుల నిర్మాణం వద్దు - టెంపుల్ సిటీలో ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్ - హైదరాబాద్ హౌస్ తరహాలో ప్రెసిడెన్షియల్ సూట్లు సాక్షి, యాదాద్రి: ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తున్న యాదాద్రి దివ్యక్షేత్రం అభివృద్ధి పనుల్లో వాస్తుదోషాలను సరిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. యాదాద్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పరిశీలించారు. ముందుగా ప్రధాన ఆలయానికి చేరుకున్న సీఎంకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం సీఎం కొండపైన జరుగుతున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీ లించారు. గర్భగుడి, ఆంజనేయస్వామి ఆలయాలను కదిలించకుండా అభివృద్ధి పనులను చేయాలని సూచించారు. రిటైనింగ్ వాల్, రాజగోపురాలు ఆలయ విస్తరణ పనులను తిలకించారు. ఈ సందర్భంగా శివాలయం, పుష్కరిణి మధ్యన నిర్మిస్తున్న మంచినీటి సంపు వివరాలను అడిగి తెలుసుకొని అవి వాస్తుకు విరుద్ధంగా ఉండడంతో సవరింపజేశారు. మంచినీటి ట్యాంకును ఎత్తయిన అన్నదాన సత్రంపై నిర్మించాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూనే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. అలాగే మూడంతస్తుల క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి 108 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలాన్ని, వంటశాల, ప్రసాదాల తయా రీ ప్రాంతాలను సీఎం పరిశీలించారు. పుష్కరిణి, మంచినీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ సరఫరా కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌లో యాదాద్రిని సందర్శించే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని... దానికి అనుగుణంగా వసతులు ఉండాలని సూచించారు. సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా పూజలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు జరగాలని సీఎం పేర్కొన్నారు. అనంతరం సమీపంలోని పెద్దగుట్టపై చేపడుతున్న టెంపుల్ సిటీ పనులను సీఎం సందర్శించారు. 250 ఎకరాల్లో 250 కాటేజీలు, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్, క్యాంటీన్లతో కూడిన లే అవుట్‌ను సుమారు గంటసేపు పరిశీలించారు. గుట్ట పైభాగంలో నిర్మించే ప్రతి కాటేజీ వరకు రోడ్డు నిర్మాణం ఉండాలని... టెంపుల్ సిటీని విస్తరించేందుకు మరో 150 ఎకరాల భూసేకరణ చేయాలని ఆదేశించారు. ఇందులో కల్యాణ మండపాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు నిర్మించాలన్నారు. ప్రధాన ఆలయానికి ఈశాన్యం దిశలో సైదాపురం రోడ్డులో ఉన్న 13 ఎకరాల గుట్టపై ప్రెసిడెన్షియల్ సూట్లు నిర్మించాలని ఆదేశించారు. ఢిల్లీలోని హైద రాబాద్ హౌస్ తరహాలో సూట్లు ఉంటాయన్నారు. ఒక్కో సూట్ రూ. 8 నుంచి రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు వివరించారు. ప్రెసిడెన్షియల్ సూట్‌ను రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, గవర్నర్లకు మాత్రమే కేటాయిస్తామని చెప్పారు. వీటి నిర్మాణానికి పెద్ద ఎత్తున దాతలు విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే గుట్టకు దిగువ భాగంలో ఉన్న గోశాల, బస్టాండ్ స్థలాలను సీఎం పరిశీలించారు. తూర్పు, పడమర మార్గంలో నాలుగు లేన్ల రోడ్డును అభివృద్ధి చేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి సమీపంలోని గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్లు వస్తున్నాయని... వీటితోపాటు గుట్టలోని చెరువులను మిషన్ కాకతీయ పథకం కింద అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం సూచించారు. సీఎం వెంట విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగి డి సునీత, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిషోర్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, యాదాద్రి ఈవో గీతారెడ్డి, ఆలయ శిల్పి ఆనంద్ సాయి, టెంపుల్ సిటీ రూపశిల్పి జగన్మోహన్రావు, కలెక్టర్ అనితా రామచంద్రన్, జాయింట్ కలెక్టర్ రవి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, స్తపతి సుందరరాజన్, బడే రవి, ఏజేసీపీ శశిధర్‌రెడ్డి, జేసీపీ పి.యాదగిరి, ఏసీపీ మోహన్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ స్వామి, ఎంపీపీ జి.స్వప్న ఉన్నారు. ఉన్నతాధికారులతో సమీక్ష అభివృద్ధి పనులను పరిశీలించాక సీఎం అధికారులతో సమీక్షించారు. రానున్న రోజుల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగనున్నందున ఆ దిశగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయనున్న పెద్దగుట్ట ప్రాం తంలో అవసరమైన స్థలాన్ని సేకరించాలన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేం దుకు 4 దిక్కులా నాలుగు వరుసల రోడ్లు నిర్మించాలని, వంగపల్లి నుంచి యాదగిరిగుట్టకు రావడానికి 4 లేన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. స్వామి పూజకవసరమయ్యే పూలకోసం మొక్కలను స్థానికంగా పెంచేందుకు ఉద్యాన వనాలను అభివృద్ధి చేయాలని, ఇందుకోసం యాదగిరిగుట్టలోనే నర్సరీ ఏర్పా టు చేయాలని అటవీ అధికారులకు సూచించారు. కాటేజీల నిర్మాణానికి జాతీ య స్థాయిలో దాతలు ముందుకు వస్తున్నందున త్వరగా లేఅవుట్లు రూపొం దించి నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. -
చెరువు పనుల నాణ్యతలో రాజీ వద్దు
- హరీశ్‌రావు, నాణ్యతా లోపాలు, చెరువు పనులు - క్వాలిటీ కంట్రోల్ అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం - నాణ్యతా లోపాలకు బాధ్యత వహించాలని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యత లోపించినా లేదా అవకతవకలు జరిగినట్లు గుర్తించినా వాటిని కూల్చేయాలన్నారు. మిషన్ కాకతీయ పనులు, క్వాలిటీ కంట్రోల్‌పై ఆయన సోమవారం సచివాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో మూడు క్వాలిటీ కంట్రోల్ డివిజన్లు ఉండగా వాటిని 10కి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో కొంతమంది చాలాకాలంగా పాతుకుపోయారని, వారు హెడ్‌క్వార్టర్స్‌లో ఉండటం లేదన్నారు. మిషన్ కాకతీయ పనుల నాణ్యతపై కొన్ని ప్రాంతాల నుంచి ఎక్కువగా ఫిర్యాదులొస్తున్నాయని...వాటిని సరిదిద్దుకొని పారదర్శకంగా పని చేయాలని హరీశ్ సూచించారు. పనుల్లో ఏవైనా అవకతవకలు జరిగితే క్వాలిటీ కంట్రోల్ విభాగమే బాధ్యత వహించాలన్నారు. అధికారులు, సిబ్బంది సజావుగా ఉంటే పత్రికల్లో వచ్చే ఆరోపణలకు జంకాల్సిన అవసరం లేదని, ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు వచ్చినట్లు భావిస్తే సంబంధిత మీడియా ఎడిటర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అయితే ఆరోపణలు రాకుండా అధికారులు సక్రమంగా పనిచేయాలని సూచించారు. సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, మైనర్ సీఈ నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 10 చెక్‌డ్యామ్‌లకు అనుమతి.. నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గ పరిధిలో 10 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి రూ. 12.49 కోట్లను మంజూరు చేశారు. మెదక్ జిల్లాలోని చిన్న ఘణపురం ఎత్తిపోతల పథకం పనుల మరమ్మతులకు రూ. 78 లక్షలను మంజూరు చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. -
చార్జీల పెంపుపై ఆందోళనలు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నారాయణపేట రూరల్: విద్యు త్, ఆర్టీసీ బస్ చార్జీల పెంపును తమ పార్టీ వ్యతిరేకిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం పేరపల్లలో ఆయన మాట్లాడారు. కరువుతో తల్లడిల్లుతున్న ప్రజలపై ఒకేసారి రెండువైపులా చార్జీలను పెంచి భారం మోపడం తగదన్నారు. చార్జీలపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మిషన్ కాకతీయ పథకం అద్భుతంగా ఉన్నప్పటికీ చిన్ననీటి ప్రాజెక్టులను విస్మరించి పెద్ద ప్రాజెక్టులపై దృష్టి సారించడం కాంట్రాక్టర్ల కోసమేనా అని ప్రశ్నించారు. -
‘మిషన్’లో అవినీతి
నాణ్యతాలోపంతో పనులు చేస్తున్నా.. పట్టించుకోని ఐబీ అధికారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్న లింగగిరి గ్రామస్తులు లింగగిరి(చెన్నారావుపేట) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోని మిషన్ కాకతీయ పథకంతో చెరువుల అభివృద్ధికి లక్షల రూపాయలు విడుదల చేస్తే కాంట్రాక్టర్లు నాణ్యత లోపంతో పనులు చేపట్టి జేబులు నింపుకుంటున్నారని లింగగిరి గ్రామస్తులు ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు కాయితపు శ్రీనివాస్, ఓరుగంటి నర్సింగరావు, మేడం కుమార్, మంద ఏకాంబ్రం, వెంకన్న, నరేష్లతో పాటు ఆ గ్రామానికి చెందిన రైతులు అక్కల్‌దేవి, బొల్లెబోయిన, చింతల్ చెరువులను వారు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం బొల్లెబోయిన చెరువుకు నిధులు రూ.59.22 లక్షలు, చింతల్ చెరువుకు రూ.41.38 లక్షలు, అక్కల్‌దేవి చెరువుకు రూ.59.5 లక్షల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆ పనులను ఆయా కాంట్రాక్టర్లు మత్తడి, తూము, కాలువల పనులు సక్రమంగా చేయకుండానే నిధులు డ్రా చేసుకున్నారని ఆరోపించారు. కట్ట పనులు కూడా నామమత్రంగా పోసి చేతులు దులుపుకున్నారని అన్నారు. నిత్యం ఐబీ అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన పనులు తూతూ మంత్రంగా జరిగాయని ఆరోపించారు. మూడు చెరువుల ఫొటోలతో కలెక్టర్‌కు, ఆర్డీఓకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. -
దేశానికే ఆదర్శం మిషన్ కాకతీయ
► పనులు వేగవంతం చేయాలి ► పనులను పరిశీలించిన మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్ : చెరువుల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం మండలంలోని వాన్వాట్, మావల గ్రామ పంచాయతీ పరిధిలోని కస్తాల రామకిస్టు శివారు ప్రాంతంలో కొనసాగుతున్న మిషన్ కాకతీయ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు తొందరగా వచ్చే అవకాశం ఉన్నందున రెండో విడత ప్రారంభమైన మిషన్ కాకతీయ పనుల్ని నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. గత ప్రభుత్వాలు చెరువులు, కుంటల నిర్వహణను పూర్తిగా విస్మరించాయన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని పొరుగు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్నాయాని గుర్తు చేశారు. త్వరలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అశాభావం వ్యక్తం చేశారు. మావల శివారు ప్రాంతాంలో హరితహారం కింద పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. హరితహారం కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 400 లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. వీరి వెంట జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, ఎంపీపీ అధ్యక్షురాలు నైతం లక్ష్మీ, ఎంపీపీ ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, మావల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉష్కం రఘుపతి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లోకా భూమారెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆరె రాజన్న, భరత్, ఉపాధ్యక్షుడు నైతం శుక్లాల్ ఉన్నారు. -
‘మిషన్’పై పర్యవేక్షణేది?
కొరవడిన అధికారుల పర్యవేక్షణ రూ.5.53 కోట్లతో 14 చెరువులు, కుంటల మరమ్మతులు కొనసాగుతున్న పనులు రెండోదశ పనులు త్వరగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ జఫర్‌గఢ్: ఎన్నో ఏళ్ల నుంచి నిరాధరణకు గురైన చెరువులు, కుంటలను మరమ్మతు చేసి వాటికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఆయా గ్రామాల్లో రెండో విడతలో చేపట్టిన చెరువులు, కుంటల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. 14 చెరువులు, కుంటల మరమ్మతులకు గాను ప్రభుత్వం రూ.5.53 కోట్ల నిధులను మంజూరు చే సింది. వీటికి ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య శంకుస్థాపన చేయగా సంబంధిత కాంట్రాక్టర్లు పనులను ప్రారంభించారు. మండలంలో మొత్తం 13 చెరువులు ఉండగా చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 88 కుంటలు ఉన్నాయి. వీటి పరిధిలో 950 హెక్టార్లపై పైగా పంట సాగు కావాల్సి ఉంది. కొన్నేళ్ల నుంచి చెరువులు, కుంటలు ఎలాంటి మరమ్మతులకు నోచుకోకపోవడంతో పాటు పూర్తిగా నిరాధరణకు గురయ్యూయి. వీటితో పాటు ఆయా చెరువులకు నీరందించే వరదకాల్వలు కూడా ఎలాంటి మరమ్మతుకు నోచుకోలేదు. దీంతో ప్రతి వర్షాకాలంలో కురిసిన కొద్ది పాటి నీరు కూడా చెరువులు, కుంటలలోకి రాక వృథాగా పోతున్నారుు. మొదటి దశలో ఒక్క తమ్మడపల్లి (ఐ) చెరువు మినహా అన్ని చెరువుల మరమ్మతు పనులు పూర్తయ్యాయి. ఇటీవల రెండోదశలో చేపట్టిన చెరువుల మరమ్మతు పనులు సాగరం, కోనాయిచలం, వెంకటాపూర్ గ్రామాలు మినహా మిగతా 11 గ్రామాల చెరువుల పనులు ప్రారంభమయ్యూయి. పనులపై తనిఖీలు శ్యూం మిషన్ కాకతీయ పనులపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. పనులు జరుగుతున్న సమయంలో అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తనిఖీలు చేయాల్సిన అధికారులు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. కాంట్రాక్టర్లే ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. పనులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నీరుగారిపోయో ప్రమాదం ఉందని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. పనులను పర్యవేక్షిస్తున్నాం మండలంలో మిషన్ కాకతీయ ద్వారా 14 చెరువులు, కుంటల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు తమ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నాం. నిబంధనల ప్రకారం పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. అగ్రిమెంట్ ప్రకారం 90 రోజుల్లోగా పూర్తి చేయాలి. - హరి, ఐబీ డీఈ -
చెరువుల అభివృద్ధితోనే రైతుల్లో ఆనందం
► స్పీకర్ మధుసూదనాచారి ► బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ► నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన భూపాలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులు అభివృద్ధి చెంది రైతన్నల్లో ఆనందం వెల్లువిరుస్తోందని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని దూదేకులపల్లి, దీక్షకుంట గ్రామాల శివారులలోని రేగడికుంట, కొత్తకుంట చెరువుల్లో మిషన్ కాకతీయ పథకం రెండవదశ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులను శాసన సభాపతి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చెరువులను అభివృద్ధి చేయడం మూలంగా నీటి సామర్ధ్యం మరింత పెరిగి ఆయకట్టు పెరుగుతుందన్నారు. తద్వారా రైతుల ఆత్మహత్యలు, వలసలు తగ్గుముఖం పడుతాయన్నారు. గౌడ, మత్స్యకార తదితర కుల వృత్తుల వారికి సైతం లాభదాయకంగా ఉంటుందన్నారు. బాధితులను ఆదుకుంటాం మండలంలోని నేరేడుపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇళ్లు దగ్ధమైన ఏడు కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయిస్తానని శాసన సభాపతి మధుసూదనాచారి హామీ ఇచ్చారు. బాధితులను పరామర్శించి ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయం రూ. 8 వేలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణరవి, వైస్‌చెర్మైన్ ఎరుకల గణపతి, ఎంపీపీ కళ్ళెపు రఘుపతిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, కౌన్సిలర్లు పిల్లలమర్రి నారాయణ, ముంజాల నిర్మలరవీందర్, గోనె భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు మందల రవీందర్‌రెడ్డి, మేకల సంపత్‌కుమార్, క్యాతరాజు సాంబమూర్తి, పైడిపెల్లి రమేష్, రాంపూర్ వెంకన్న పాల్గొన్నారు. సుపరిపాలన అందుతోంది గణపురం : ప్రజల ఆకాంక్ష మేరకు సుపరి పాలన తెలంగాణలో సాగుతుందని శాసనసభ స్పీకర్, భుపాలపల్లి శాసన సభ్యులు సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని గాంధీనగర్‌లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. సర్పంచ్ మారగాని శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. ప్రజాధారణ కోసమే మరిన్ని కార్యక్రమాలను అందిస్తామని తెలిపారు. నియోజకవరగ్గంలో ఇప్పటికే వెయ్యికోట్ల అభివృద్ధిపనులు జరిగాయని చెప్పారు. గాంధీనగర్‌లో అంగన్వాడీ భవనం పెండింగ్ పనులకు రెండు లక్షలు, ప్రధాన కూడలిలో సోలార్ లైటింగ్ కోసం ఐదు లక్షలను నియోజకవర్గం అభివృద్ధి నిధుల నుంచికేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు గుజ్జ లక్ష్మన్‌రావు, జెడ్పీటీసీ మోటపోతుల శివశంకర్‌గౌడ్, ఎంపీపీ పోతారపు శారద, ఎంపీటీసీ బొచ్చులక్ష్మిస్వామి, సోసైటి అధ్యక్ష, ఉపాధ్యక్షులు తాళ్లపెల్లి భాస్కర్‌రావు, పొట్లనగేష్, భైరగాని కుమార్‌స్వామి,రత్నం రవి,కాల్వరాంరెడ్డి. దివిప్రసాద్, మళ్లికార్జున్, గుర్రం తిరుపతి , ముక్కెర సాయిలు తదితరులు పాల్గొన్నారు. సమృద్ధి నీటితోనే సస్యశ్యామలం రేగొండ : పాడిపంటలు సస్యశామలంగా ఉండాలంటే సమృద్ధిగా నీరు ఉంటేనే సాధ్యమని స్పీకర్ సిరికొండ మధుసూధుసూధనాచారి అన్నారు. మండల కేంద్రంలోని వెంకటాద్రికుంట, లంబడికుంట, రామసంముద్రం, రంగయ్యపల్లే గ్రామంలోని గంగిరేణికుంట, కొడవటంచలోని నవ్వులకుంటల అభివృద్ధి పనులను స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్టంలోనే అధిక చెరువులను భూపాలపల్లి నియోజక వర్గంలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రుణ మాఫీతో పాటు రానున్న రోజుల్లో తాగు, సాగు నీరు అందించడమే ధేయ్యంగా సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ పథకాలు ప్రవేశపెట్టి శరవేగంగా పనులు నిర్వహించే విధంగా కృషి చేస్తున్నారన్నారు. ఐబీ డీఈ ప్రసాద్,ఎఈ వెంకటేశ్వర్లు, ఎంపీపీ ఈర్ల సదానందం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోడెం ఉమేష్‌గౌడ్, సర్పంచ్‌లు మోడెం ఆధిలక్ష్మి, పున్నం లక్ష్మి, పోగు వీరలక్ష్మి, ఎంపీటీసీ పట్టేం శంకర్, నాయకులు కోలుగురి రాజేశ్వర్‌రావు, పున్నం రవి, మైస భిక్షపతి, మటిక సంతోష్, బలేరావు మనోహర్‌రావు, అయిలి శ్రీధర్‌గౌడ్, తడక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘మిషన్ కాకతీయ’ అస్తవ్యస్తం
► ఇంటివద్ద కూర్చునే అధికారుల ఎస్టిమేట్ ► పురాతన తూముల కూల్చివేత ► రైతులను సంప్రదించకుండా ప్రతిపాదనలు జగిత్యాల రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్‌కాకతీయ పథకం అధికారుల పర్యవేక్షణ లోపించడంతో అస్తవ్యస్తంగా మారుతోంది. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తూ, బిల్లులు పొందుతున్నారు. జగిత్యాల మండలంలో మొదటివిడత మంజూరైన పనుల్లోనే నాణ్యత లోపించడంతో వర్షాకాలంలో మత్తళ్లు, చెరువు కట్టలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. మండలంలోని సోమన్‌పల్లి ఊరచెరువుకు మొదటి విడతలో మిషన్‌కాకతీయ కింద రూ.26.63 లక్షలు మంజూరయ్యూరుు. ఈ నిధులతో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా రైతులకు ఎలాంటి ఉపయోగమూ లేని మత్తడితోపాటు రేలింగ్‌వాల్ నిర్మించారు. చెరువు ఆయకట్టు కింద రైతులకు ఎక్కడ సాగునీరు అవసరమో..? ఎక్కడ విస్తీర్ణం ఎక్కువగా ఉందో..? అధికారులు చూడకుండానే రేలింగ్వాల్స్ నిర్మించారు. దీనికితోడు నిజాంకాలం నాటి పురాతన తూములను కాంట్రాక్టర్ డిటోనేటర్లతో పేల్చి ధ్వంసం చేరుుంచారు. వాటిస్థానంలో సిమెంట్, కంకరతో తూములను నిర్మించినా అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. తూములకు కింది భాగంలో బెడ్ వేసి నిర్మించాల్సి ఉన్నా.. పాత రాళ్లపైనే తూతూమంత్రంగా నిర్మించారు. తూములు రేలింగ్వాల్స్కు ఎత్తుగా ఉండాల్సి ఉండగా.. కిందికి అయింది, రేలింగ్‌వాల్ పైకి వచ్చింది. దీంతో చెరువులో నుంచి తూము ద్వారా నీరు వచ్చిన సాగుకు అందడం గగనంకానుంది. పురాతన కట్టను కాంట్రాక్టర్ జేసీబీతో తవ్వి.. చెరువులోని మట్టినిపోసి, పాత రేలింగ్‌ను తొలగించి మళ్లీ అదే రాయిని కట్టకు పరిచేందుకు సిద్ధమవుతున్నారు. గత వేసవిలో రైతులు చెరువు నుంచి దాదాపు 10 వేల ట్రిప్పుల మట్టిని స్వచ్ఛందంగా పోసుకున్నారు. ప్రస్తుతం కాంట్రాక్టర్ అదే మట్టిని తాను రైతులకు సర ఫరా చేసినట్లు గుంతలను చూపించుకుని ఎంబీ రికార్డు చేయించుకుంటున్నారు. మత్తడి నిర్మాణంలో పాత మత్తడికే సిమెంట్ పూతలు పెట్టి కొత్తగా నిర్మించినట్లు రికార్డులు చేయించుకుంటున్నారు. పోరండ్ల గ్రామంలో పోరండ్ల ఊర చెరువుకు మిషన్ కాకతీయలో మొదటి విడత రూ.25.75 లక్షలు మంజూరయ్యూరుు. కాంట్రాక్టర్ అధికారులతో కుమ్మక్కై సాగులేని చోటకు సిమెంట్ రేలింగ్‌వాల్ నిర్మించారు. చెరువులో పూడికమట్టిని లోతు తీయాల్సి ఉన్నా.. నామమాత్రంగా మట్టిని తీసి ఎంబీ రికార్డు చేయించుకున్నారు. అలాగే రైతులు స్వచ్ఛందంగా తీసుకున్న మట్టిని సైతం కాంట్రాక్ట్‌లో భాగంగా తీసినట్లు బిల్లు రారుుంచుకున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు ఈ చెరువును కొద్దిగానైనా మరమ్మతు చేయలేదంటే అతిశయోక్తికాదు. పురాతన తూములు ధ్వంసం చేశారు మిషన్ కాకతీయలో ఊర చెరువు అభివృద్ధి కోసం నిధులు మంజూరు కాగా కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు అవసరమైన పనులు చేయకుండా ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. పాత మత్తడిని కొత్తగా నిర్మించినట్లు చూపిస్తున్నారు. ఎస్టిమేట్లో లేని పనులు చేసి బిల్లులు తీసుకుంటున్నారు. - గొంటి మొగిలి, రైతు, సోమన్‌పల్లి రూపాయి పనిచేయలే.. ఊర చెరువు అభివృద్ధికి రూ.25.75లక్షలు మంజూరైన మాటేగానీ.. ఇప్పటివరకు రూపారుు పనిచేయలేదు. చెరువు పైభాగంలో మట్టి తీరుుంచారు. సాగులేని ప్రాంతంవద్ద సిమెంట్ రేలింగ్‌వాల్ నిర్మించారు. రైతులు స్వచ్ఛందంగా తీరుుంచుకున్న మట్టిని తాను తీరుుంచినట్లు కాంట్రాక్టర్ బిల్లు తీసుకున్నాడు. - బొడుగం బాపురెడ్డి, రైతు, పోరండ్ల -
గడువు కంటే ముందే ‘మిషన్ భగీరథ’
రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి బుర్జుగడ్డతండా (శంషాబాద్ రూరల్) : నిర్ణీత గడువు కంటే ముందుగానే జిల్లా వాసులకు ఇంటింటి కీ నల్లా నీటి సరఫరా ప్రారంభిస్తామని రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని బుర్జుగడ్డతండాలో ఉన్న కొత్త చెరువులో రూ.13లక్షలతో చేపట్టిన పూడికతీత పనులను శనివారం ఆయన ఎమ్మెల్యే టీ ప్రకాష్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్శంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 2 వేల కోట్లతో జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుతో జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు. మిషన్ కాకకతీ పథకంలో జిల్లాలోని 1192 చెరువులకు మొదటి, రెండో దశలో రూ.355 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితులతో రాష్ర్టంలో తాగునీటి ఎద్దడి నెలకొందని, రాబోయే రెండు మాసాల్లో నీటి సమస్యలు రాకుండా రూ.50 కోట్లతో ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్రంలో రైతులకు కరెంటు, సాగునీటి ఇబ్బందులు లేకుండా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. మిషన్ కాకతీయ పనులు పూర్తియితే సకాలంలో వానలు కురిస్తే సాగు, తాగునీటికి ఇబ్బందులు తొలిగిపోతాయన్నారు. రైతులు చెరువులు, కుంటల్లోని పూడికను తీసుకెళ్లి పొలాల్లో వేసుకోవాలన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 49 చెరువులకు మొదటి, రెండో దశలో రూ.9 కోట్లతో మిషన్ కాకతీయ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, జెడ్పీటీసీ సభ్యుడు బూర్కుంట సతీష్, సర్పంచ్ సత్యనారాయన, సిద్దులు, ఉపసర్పంచ్ నరేష్, ఎంపీటీసీ సభ్యులు ఇస్తారి, నాయకులు చంద్రారెడ్డి, మహేందర్‌రెడ్డి, సుదర్శన్, రమేష్, సుభాష్, తదితరులు పాల్గొన్నారు. -
చింతలకుంటకు పూర్వ వైభవం
► రెండో విడత ‘మిషన్‌కాకతీయ’లో ఎంపికైన చెరువు ► జోరుగా పూడికతీత పనులు ► హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు చిక్కేపల్లి (పాన్‌గల్) : ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపడుతున్న మిషన్‌కాకతీయ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు పూర్వ వైభ వాన్ని సంతరించుకోనుంది. ఈ పథకం ద్వారా మండలంలోని చిక్కేపల్లిలోని చింతలకుంట చెరువును చేర్చారు. దాంతో చెరువులో నీటి నిల్వలతో పాటు పంట పొలాలు కళకళలాడనుంది. రెండో విడత మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువు మరమ్మతులకు రూ.19.70లక్షల నిధులు మంజూరయ్యాయి. చెరువు కింద దాదాపుగా 30ఎకరాలు ఆయకట్టు ఉంటుందని గ్రామ రైతులు తెలిపారు. గత ప్రభుత్వాలు మరమ్మత్తులు చేయకపోవడంతో చెరువుల్లో ఏళ్ల తరబడి పూడిక పేరుకపోవడంతో వర్షాలు కురిసిన, నీరు నిల్వ ఉండే పరిస్థితి లేకుండా పోయింది. మిషన్‌కాకతీయ మరమ్మతులతో చెరువులకు పూర్వవైభవం వస్తుందని గ్రామ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మరమ్మతులు జోరుగా సాగుతున్నాయి. దీంతో చెరువులోని ఒండ్రుమట్టిని గ్రామ రైతులు జోరుగా తరలించుకుంటున్నారు. -
‘మిషన్ కాకతీయ’ను సక్సెస్ చేద్దాం
భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాడ్గుల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సక్సెస్ చేయాలని, కాంట్రాక్టర్లతో రాజీ పడితే చర్యలు తప్పవని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. మాడ్గుల మండలం నర్సాయిపల్లి పీకలకుంట చెరువు, గిరికొత్తపల్లి తుమ్మలకుంట చెరువుల్లో చేపట్టిన రెండోవిడత మిషన్‌కాకతీయ పనులను మంత్రి బుధవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మొ దటి విడతలో మంజూరైన చెరువుల్లో జరిగిన పనుల నా ణ్యత, చెల్లించిన నిధులు, సర్వేకు చేసిన ఖర్చుల వివరాలను మైనర్ ఇరిగేషన్ డీఈఈ శంకర్‌బాబును అడుగగా ఆ యన పొంతనలేని సమాధానం చెప్పడంతో మండిపడ్డారు. అవగాహన లేకుండా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. మొదటి విడత మిషన్‌కాకతీయలో మంజూరైన చెరువులకు సంబంధించిన ఎంబీ రికార్డులను తీసుకుని హైదరాబాద్‌కు రావాలని మంత్రి మైనర్ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కోట్లు ఖర్చుచేస్తుంటే అధికారులు నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌నాయక్, ఎంపీపీ జైపాల్‌నాయక్, జెడ్పీటీసీ సభ్యుడు పగడాల రవితేజ, సర్పంచ్‌లు సునితకొండల్రెడ్డి, పుష్పలీల, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. -
మిషన్ కాకతీయకు రూ.2,255 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే కాస్త ఎక్కువే సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకానికి ప్రభుత్వం ఈ ఏడాది ఆశించిన స్థాయిలోనే నిధులను కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.172 కోట్ల మేర అదనపు కేటాయింపులు చేసి మొత్తంగా రూ.2,255 కోట్లు కేటాయింపులు జరిపింది. ఈ నిధులతో సుమారు 9 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించనుంది. ఇందులో చిన్న నీటి చెరువుల పునరుద్ధరణకు రూ.1,410.15 కోట్లు కేటాయించగా, ఇదే మిషన్ కాకతీయలో పెద్దతరహా పనులైన మినీ ట్యాంక్బండ్లు ఇతర చెరువుల కోసం రూ.737.93 కోట్లు కేటాయించారు. ఇందులో సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద రూ.100 కోట్లు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృధ్ధి నిధి (ఆర్ఐడీఎఫ్) కింద రూ.5 కోట్లు, ట్రిపుల్ ఆర్ కింద మరిన్ని నిధులు వస్తాయని అంచనా వేసింది. -
నీరందేదెన్నడు..!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆయకట్టు లేని చెరువుల ఎంపిక.. అసంపూర్తిగా మొదటి విడత పనులు.. నేతలే బినామీ పేర్లతో కాంట్రాక్టర్లు.. పర్సంటేజీల్లో మునిగి తేలుతున్న కొందరు అధికారులు.. స్థూలంగా చెప్పాలంటే మిషన్ కాకతీయ పథకం అమలు తీరు జిల్లాలో అస్తవ్యస్తంగా తయారైంది. చిన్న నీటి వనరుల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. చెరువుల పునరుద్ధరణ పనుల కోసం ఏటా రూ.వందల కోట్లు వెచ్చిస్తోంది. ఈ పథకానికి శ్రీకారం చుట్టి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో జిల్లాలో అమలు తీరును పరిశీలిస్తే.. మొదటి విడతకే మోక్షం లేదు.. జిల్లాలో మొత్తం 1,491 చెరువులున్నట్లు నీటి పారుదల శాఖ గుర్తించింది. మొదటి విడతలో 20 శాతం అంటే 558 చెరువులను ఈ పథకం కింద ఎంపిక చేసింది. సుమారు రూ.166 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టారు. ఏడాది కాలంగా కనీసం 200 చెరువుల పనులను కూడా పూర్తి చేయలేకపోయారు. సుమారు 71 చెరువులు వచ్చే జూన్ నాటికి పూర్తవుతాయని నీటి పారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. 75 శాతం వరకు పనులు పూర్తయిన చెరువులు సుమారు 200 వరకు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. మరో 80 చెరువుల పనులు 50 శాతం వరకు జరిగాయని చెబుతున్నారు. పనులు చేసేందుకు కేవలం మూడు నెలలే గడువుంది. వర్షాలు కురిస్తే ఈ చెరువుల పనులు చేయడానికి వీలుండదు. ఈ మూడు నెలల్లో పనులు వేగవంతం చేయని పక్షంలో మొదటి విడతలో చేపట్టిన చెరువుల పనులు వచ్చే ఏడాది వరకు కొనసాగనున్నాయి. రెండో విడతలో 191 మంజూరు.. రెండో విడతలో 522 చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులు అంచనాలను తయారు చేసి, సుమారు రూ.200 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటివరకు కేవలం 191 చెరువులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పలు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 151 చెరువులకు టెండరు ప్రక్రియను పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. అమలు తీరు అస్తవ్యస్థం.. ఏడాది కాలంలో ఈ పథకం అమలు తీరును పరిశీలిస్తే.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలే బినామీ పేర్లతో గుత్తేదార్లుగా అవతారమెత్తారు. ఒక్కో చెరువుకు పోటీపడి 20 శాతం వరకు లెస్‌కు టెండర్లు దాఖలు చేసి పనులు దక్కించుకున్నారు. కానీ పనులు సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతున్నారు. నేతలే కాంట్రాక్టర్లు కావడంతో అధికారులు తమకెందుకొచ్చిన తంటా అనే ధోరణితో ‘మామూలు’గా సరిపెడుతున్నారు. దీంతో ఈ పనులు సకాలంలో పూర్తి కాలేకపోతున్నాయి. రెండో విడత చెరువుల ప్రతిపాదనల బాధ్యతలను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అప్పగించింది. కొన్ని చోట్ల ఒక్క ఎకరం కూడా ఆయకట్టు లేని చెరువులను ప్రతిపాదించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కనీసం ఒక్క రైతుకు కూడా మేలు చేయని పనులకు అధికారులు కళ్లు మూసుకుని రూ.లక్షల నిధులతో అంచనాలను రూపొందించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నాలేననే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కేవలం తమ అనుచరులకు పనులు కల్పించేందుకే ఇలా ఆయకట్టు చెరువులను ఎంపిక చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆదిలాబాద్ వంటి మున్సిపల్ పట్టణాల్లోని ఆయకట్టు లేని చెరువులను రెండో విడతలో ఎంపిక చేయడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మిషన్ కాకతీయ పథకం కేవలం నేతలకే కాదు, కొందరు నీటిపారుదల శాఖ అధికారులకు కూడా కాసుల పంట పండిస్తోంది. బిల్లుల చెల్లింపుల్లో పర్సంటేజీల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ చెరువు పనుల బిల్లులు చెల్లించేందుకు ఓ కాంట్రాక్టర్ వద్ద ఏకంగా రూ.లక్ష లంచం తీసుకుంటూ మంచిర్యాల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వినోద్‌కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బాలసిద్దులు ఏసీబీకి చిక్కడం ఈ పర్సంటేజీల బాగోతాన్ని బజారుకీడ్చింది. 2015 డిసెంబర్లో మంచిర్యాల నీటిపారుదల శాఖ కార్యాలయంపై పంజా విసిరిన ఏసీబీ ఈ ఇద్దరు అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. -
ఒడుదొడుకులు!
► రాజకీయ ఒత్తిళ్లకు గురైన మిషన్ కాకతీయ ► పథకం ప్రారంభమై నేటితో ఏడాది ► ప్రగతి అంతా ఎగుడుదిగుడులే! ► కొనసా...గుతున్న మొదటి విడత పనులు ► పథకం ప్రారంభమై నేటితో ఏడాది కొనసా...గుతున్న మొదటి విడత మహబూబ్‌నగర్ న్యూటౌన్ : చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం..రాజకీయ, ఇతర కారణాల రీత్యా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనం జిల్లాలో మొదటి విడతలో మంజూరైన చెరువుల పనుల్లో కనీసం పావు భాగం కూడా పూర్తికాలేదు. చాలా చెరువుల పనులు ఇంకా కొనసా...గుతూనే ఉన్నాయి. విడతలవారీగా గ్రామాల్లోని చెరువులను అభివృద్ధి చేసి భూగర్భ జలాల పెంపు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గత ఏడాది ఇదే నెలలో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ ఏడాది కాలంలో పథకం ప్రగతి ఎగుడుదిగుడుగా మారింది. మొదటివిడత పనులను ఆర్భాటంగా మంజూరు చేసినప్పటికీ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు స్థానిక రాజకీ యాల కారణంగా ఈ పనులు వద్దుర బాబోయ్ అంటూ నెత్తి నోరు బాదుకున్నారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వెంటనే అగ్రిమెంట్లు చేసుకోవాలని, పనులు వెంటనే ప్రారంభించకపోతే బ్లాక్ లిస్టులో పెడతామని ప్రభుత్వం హుకుం జారీ చేయడంతో మింగలేక కక్కలేక అన్నట్లు నియోజకవర్గ నేతలు సూచించిన గ్రామ స్థాయి నాయకులకు పనులను అప్పగించిన ఘటనలున్నాయి. దీంతో ఎలాంటి అనుభవం లేని వారు పనులను నిర్వహించడంతో ఇంజనీరింగ్ అధికారులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. నీరుగారుతున్న లక్ష్యం గ్రామాల్లోని చెరువులను పునరుద్ధరించి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకం క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలను సాధించడంలేదు. రాజకీయ నాయకులు తమ కార్యకర్తలకే పనులు ఇప్పించుకునేందుకు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేవడం, కాంట్రాక్టర్లనుంచి తీసుకున్న పనులను విభేదాల కారణంగా ప్రారంభించడంలో ఆల స్యం చేయడం వంటి కారణాలు మొదటి విడత కింద మంజూరైన పనులకు ఇబ్బందిగా మారా యి. పోటీకి పోయి లెస్‌కు టెండర్లు వేయడం, సాగే లేని కుంటలకు ప్రాధాన్యం, శిఖం భూము లు కబ్జాకు గురికావడం వంటి కారణాలు జా ప్యానికి కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రారంభమవుతున్న రెండో విడతపై మొదటి విడత ప్రభావం చూపిస్తుందని పలువురు రిటైర్డ్ ఇంజనీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి విడత ప్రగతి ఇలా.. మొదటి విడతలో 1073 చెరువు పనులు జిల్లాకు మంజూరు కాగా 1051 పనులకు టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభించారు. రెండు పనులు కోర్టు కేసులో పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా 20 పనులు భూసేకరణ సమస్యతో ఆగిపోయినట్లు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో 65 చెరువు పనులు మాత్రమే మొదటి విడత కింద పూర్తయినట్లు నివేదికలు చెబుతుండగా అధికారులు మాత్రం 700 పనులు ఫిజికల్‌గా పూర్తయినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం మొదటి విడతలో రూ.284.305 కోట్ల రూపాయలతో పనులు చేపట్టగా ఇప్పటివరకు రూ.103.158 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా 941 పనులు వివిధ స్థాయిల్లో పురోగతిలో ఉన్నాయి. ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకోవడంలేదు. రెండో విడత పురోగతి ఇలా.... మిషన్ కాకతీయ రెండో విడతకు 1885 చెరువు పనులు చేపట్టాలని అనుకున్నా.. నిర్ణయించిన గడువులోపు ప్రతిపాదనలు పూర్తిస్థాయిలో సమర్పించలేదు. ప్రభుత్వానికి 1583 ప్రతిపాదనలు సమర్పించగా 512 చెరువు పనులు మంజూరు చేస్తూ ప్రభుత్వం పలు దఫాలుగా జీఓలను జారీ చేసింది. మంజూరైన పనుల్లో 148 పనులకు టెండర్లు నిర్వహించి 42 పనులకు కాంట్రాక్టర్లతో అగ్రిమెంటు పూర్తి చేశారు. ఇప్పటివరకు 10 పనులను ప్రారంభించారు. అయితే రెండో విడత ప్రతిపాదనలు సమర్పించేందుకు ఈ నెల 4వ తేదీని గడువుగా నిర్ణయించినా పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సమర్పించ లేకపోయారు. దీంతో రెండో విడతలో చేపట్టాల్సిన 302 పనులు ఈ దఫాలో మంజూరుకి మోక్షం లేనట్లే. కాగా మొదటి విడత పనుల్లో తాము బిజీగా ఉన్నామని, వాటి బిల్లుల చెల్లింపు, రెండో విడత సర్వేలతో పని ఒత్తిడికి గురవుతున్నామని ఇం జనీరింగ్ అధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్య లు పరిష్కరించి యుద్ధప్రాతిపదికన మిషన్ కాకతీయ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో లక్ష్యాన్ని చేరడంలేదు. లక్ష్యాన్ని సాధిస్తాం మిషన్ కాకతీయ లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మొదటి విడత కింద చేపట్టిన పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తాం. రెండవ విడత కింద మంజూరైన పనులకు సంబంధించి 148 పనులకు టెండర్లు నిర్వహించి 42 అగ్రిమెంట్లు పూర్తి చేశాం. ఇప్పటివరకు 10 పనులు ప్రారంభించాం. మంజూరైన పనులకు సంబందించి టెండర్లు నిర్వహించి పనులను ప్రారంభించాలని అన్ని డివిజన్ల ఈఈలను ఆదేశించాం. -సదాశివ, ఎస్ఈ, చిన్ననీటి పారుదల శాఖ -
చెరువుకట్టలను తీర్చిదిద్దాలి
- పర్యాటక కేంద్రాలుగా మార్చాలి - ‘హరితహారం’ను విజయవంతం చేయూలి - భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు - మంత్రులు రామన్న, పద్మారావుతో కలిసి పర్యటన నెక్కొండ/నల్లబెల్లి/చెన్నారావుపేట/దుగ్గొండి: మిషన్ కాకతీయ పథకంలో భాగంగా అభివృద్ధి పనులు నిర్వహించిన చెరువు కట్టలపై హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయూలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు కోరారు. చెరువు కట్టలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించా రు. మంత్రులు జోగు రామన్న, టి. పద్మారావుతో కలిసి మంగళవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. చెరువు కట్టలపై ఈత, తాటి, టేకు మొక్కులు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నెక్కొండలో హరీష్‌రావు మాట్లాడారు. గ్రామీణులకు జీవనాధారంగా చెరువులను మార్చి అభివృద్ధి చేయూల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బండ్‌కు ఇరువైపులా నాటే మొక్కలను గౌడ కులస్తులు, ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షించాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావు సూచించారు. హరత తెలంగాణలో అందరూ భాగస్వాములు కావాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కోరారు. నెక్కొండలోని తెలంగాణ బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాల విద్యార్థినులు హరితహారం ర్యాలీ నిర్వహించారు. మంత్రి హరీష్‌రావుకు సమస్యలు విన్నవించారు. గీత కార్మికుల బతుకులు బాగు పడాలె మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల అభివృద్ధి పనులు, చెరువు కట్టలపై ఈత, తాటి వనాల పెంపకంతో గీత కార్మికుల బతుకులు బాగుపడాలని మంత్రి హరీష్‌రావు ఆకాంక్షించారు. చెన్నారావుపేట మండలం వుగ్దుంపురం, గురిజాలలో పర్యటించారు. గురిజాలలో వుహిళలు బతుకవ్ము, బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడారు. ‘గురిజాల గ్రావూన్ని వురువలేం..పల్లెనిద్ర చేసింది గుర్తుంది..తప్పనిసరిగా వుుఖ్యవుంత్రి కేసీఆర్ వురల వస్తాడు.. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిచేస్తాం’ అన్నారు. పింఛన్లు ఇప్పించాలంటూ మంత్రులకు పలువురు వృద్ధులు వినతిపత్రాలు అందించారు. దుగ్గొండిలో.. దుగ్గొండి మండలంలో మిషన్ కాకతీయలో భాగంగా 10 చెరువులను పునరుద్ధరించారు. ఈ చెరువు కరకట్టలపై స్థానిక గౌడ కులస్థులతో మంగళవారం మొక్కలు నాటిం చారు. వెంకటాపురం పెద్దచెరువు, దుగ్గొండి పెద్దచెరువుల వద్ద, తిమ్మంపేట గుండం చెరువు కట్టలపై మంత్రులు హరీష్‌రావు, పద్మారావు, జోగు రామన్న మొక్కలు నాటారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నర్సంపేట నియోజకవర్గంలో 60 చెరువులపై ఒకేసారి లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి పెద్ది సుదర్శన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని మంత్రి రామన్న అభినందించారు. జిల్లాలో ఇప్పటికే 1.17 కోట్ల మొక్కలు నాటడం పూర్తి అయిందన్నారు. మానుకోట ఎంపీ అజ్మీర సీతారాంనాయక్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, సీఎం పీఆర్వో గటిక విజయ్‌కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కలపెల్లి రవీందర్రావు, ఆర్డీఓలు భాస్కర్‌రావు, రామకృష్ణారెడ్డి, డీఎస్పీ మురళీధర్‌రావు, నెక్కొండ ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, జెడ్పీటీసీ బక్కి కవిత, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు షేక్ అబ్దుల్నభి,సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు హంస విజయురావురాజు తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. పార ఎందుకు తెచ్చుకోలేదు? నల్లబెల్లి మండలం నారక్కపేట లచ్చిరెడ్డికుంట కట్టపై మొక్కలు నాటేందుకు పార లేకపోవడంతో అటవీశాఖ అధికారులపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్లు సక్రమంగా లేవని అసహనం ప్రదర్శించారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మరావు, టీఆర్ఎస్ నర్సంపేట నియోజక వర్గ ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డిలతో కలిసి ఆయన మొక్కలు నాటారు. చెరువు ఆయకట్టు, చెరువు శిఖం వివరాలను సర్పంచ్ మోర్తాల రామారావును మంత్రి అడిగి తెలుసుకొన్నారు. మొక్కలు నాటడం పూర్తయ్యేవరకు అటవీశాఖ అధికారులు ఇక్కడే ఉండి పర్యవేక్షించాలన్నారు. అంతకు ముందు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. వరంగల్ సౌత్ డీఎఫ్ఓ కిష్టా, నర్సంపేట ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ సుధీర్, ఎంపీపీ బానోతు సారంగపాణి, తాహసీల్దార్ డీఎస్ వెంకన్న, ఎంపీడీఓ మూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మేడ్చల్‌కు చేరిన ‘మిషన్ కాకతీయ’ బైక్‌యాత్ర
మేడ్చల్: ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంపై ప్రచారం నిర్వహించేందుకు ఓ తెలంగాణ వాది చేపట్టిన బైక్‌యాత్ర గురువారం మేడ్చల్‌కు చేరింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన ప్రైవేట్ లెక్చరర్ సత్యం ఏప్రిల్ 14న జగిత్యాలలో బైక్ యాత్రను ప్రారంభించారు. 17 రోజులుగా కరీంనగర్, మెదక్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజల్లో చైతన్యం కలిపించేందుకు బైక్ యాత్రను చేపట్టినట్లు ఈ సందర్భంగా సత్యం తెలిపారు. అన్ని జిల్లాల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. మేడ్చల్ నుంచి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో బైక్ యాత్ర నిర్వహించి ముగిస్తానని సత్యం తెలిపారు.