ఒకప్పటి దుర్గం చెరువు
దుర్గం చెరువుకు పూర్వవైభవం ఎప్పుడో...!
గుర్రపు డెక్కతో కుంచించుకుపోతున్న చెరువు
మంత్రి కేటీఆర్ ఆదేశించినా పట్టించుకోని అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: చుట్టూ కొండల మధ్యలో సుందరంగా కొలవుదీరిన దుర్గం చెరువు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో నగరవాసులకు పర్యాటక కేంద్రంగా విలసిల్లిన ఈ ప్రాంతం ప్రాభవాన్ని కోల్పోతోంది. చెరువులో గుర్రపు డెక్క పరచుకుపోవడంతో చెరువు ఉన్నట్లుగానే కనిపించ డం లేదు. నగరం విస్తరించ ముందుకు దుర్గం చెరువు గురించి అతి కొద్ది మందికి మాత్రమే అతికొద్దిమందికి మాత్రమే తెలిసేది. ‘సీక్రేట్ లేక్’ గా గుర్తింపు పొందిన ఈ చెరువు గతంలో గోల్కొండ కోటకు తాగునీటి వనరుగా ఉండేది. ‘సైబరాబాద్’ అభివృద్ధితో ఈ చెరువుకు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ దీని బాధ్యతలను పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించింది. ఈ నేపథ్యంలో చెరువుకు ఓ వైపు సమ్‌థింగ్‌పిషీ పేరిట బార్ అండ్ రెస్టారెంట్ చేశారు. మరోవైపు రెస్టారెంట్లు నిర్మించారు. బోటు షికారుకు చర్యలు తీసుకున్నారు.
గుర్రపు డెక్కతోనే సమస్య
అయితే నగర విస్తరణతో చెరువు మురికి కూపంగా మారుతోంది. సమీప కాలనీల నుంచి మురుగునీరు చెరువులోకి చేరడం, చెరువు గర్భంలోనే అపార్టుమెంట్లు వెలియడంతో ఆనవాళ్లు కోల్పోతోంది. దీనికితోడు జలాశయంలో గుర్రపు డెక్క విస్తరించడంతో బోటు షికారుకు అంతరాయం ఏర్పడింది. రెండు ఏళ్లుగా బోటింగ్‌ను నిలిపివేశారు.
అమలుకు నోచని మంత్రి ఆదేశాలు..
గ్రేటర్ బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్న మంత్రి కేటార్ ఏడాది క్రితం అధికారులతో కలిసి చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా చెరువు అభివృద్ధికి పనులు వేగవంతం చేయాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అయితే అప్పటినుంచి నేటి వరకు పనుల్లో కొంచెమైనా పురోగతి కనిపించలేదు. రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు అభివృద్ధి చేస్తున్న మంత్రి హరీష్ రావుకు దుర్గం చెరువుకు ఎందుకు కనపడలేదని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.