గడువు కంటే ముందే ‘మిషన్ భగీరథ’
రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి
బుర్జుగడ్డతండా (శంషాబాద్ రూరల్) : నిర్ణీత గడువు కంటే ముందుగానే జిల్లా వాసులకు ఇంటింటి కీ నల్లా నీటి సరఫరా ప్రారంభిస్తామని రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని బుర్జుగడ్డతండాలో ఉన్న కొత్త చెరువులో రూ.13లక్షలతో చేపట్టిన పూడికతీత పనులను శనివారం ఆయన ఎమ్మెల్యే టీ ప్రకాష్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్శంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 2 వేల కోట్లతో జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుతో జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు.
మిషన్ కాకకతీ పథకంలో జిల్లాలోని 1192 చెరువులకు మొదటి, రెండో దశలో రూ.355 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితులతో రాష్ర్టంలో తాగునీటి ఎద్దడి నెలకొందని, రాబోయే రెండు మాసాల్లో నీటి సమస్యలు రాకుండా రూ.50 కోట్లతో ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్రంలో రైతులకు కరెంటు, సాగునీటి ఇబ్బందులు లేకుండా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. మిషన్ కాకతీయ పనులు పూర్తియితే సకాలంలో వానలు కురిస్తే సాగు, తాగునీటికి ఇబ్బందులు తొలిగిపోతాయన్నారు. రైతులు చెరువులు, కుంటల్లోని పూడికను తీసుకెళ్లి పొలాల్లో వేసుకోవాలన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 49 చెరువులకు మొదటి, రెండో దశలో రూ.9 కోట్లతో మిషన్ కాకతీయ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, జెడ్పీటీసీ సభ్యుడు బూర్కుంట సతీష్, సర్పంచ్ సత్యనారాయన, సిద్దులు, ఉపసర్పంచ్ నరేష్, ఎంపీటీసీ సభ్యులు ఇస్తారి, నాయకులు చంద్రారెడ్డి, మహేందర్‌రెడ్డి, సుదర్శన్, రమేష్, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.