చింతలకుంటకు పూర్వ వైభవం
► రెండో విడత ‘మిషన్‌కాకతీయ’లో ఎంపికైన చెరువు
► జోరుగా పూడికతీత పనులు
► హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
చిక్కేపల్లి (పాన్‌గల్) : ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపడుతున్న మిషన్‌కాకతీయ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు పూర్వ వైభ వాన్ని సంతరించుకోనుంది. ఈ పథకం ద్వారా మండలంలోని చిక్కేపల్లిలోని చింతలకుంట చెరువును చేర్చారు. దాంతో చెరువులో నీటి నిల్వలతో పాటు పంట పొలాలు కళకళలాడనుంది. రెండో విడత మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువు మరమ్మతులకు రూ.19.70లక్షల నిధులు మంజూరయ్యాయి.
చెరువు కింద దాదాపుగా 30ఎకరాలు ఆయకట్టు ఉంటుందని గ్రామ రైతులు తెలిపారు. గత ప్రభుత్వాలు మరమ్మత్తులు చేయకపోవడంతో చెరువుల్లో ఏళ్ల తరబడి పూడిక పేరుకపోవడంతో వర్షాలు కురిసిన, నీరు నిల్వ ఉండే పరిస్థితి లేకుండా పోయింది. మిషన్‌కాకతీయ మరమ్మతులతో చెరువులకు పూర్వవైభవం వస్తుందని గ్రామ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మరమ్మతులు జోరుగా సాగుతున్నాయి. దీంతో చెరువులోని ఒండ్రుమట్టిని గ్రామ రైతులు జోరుగా తరలించుకుంటున్నారు.