ఒడుదొడుకులు!
► రాజకీయ ఒత్తిళ్లకు గురైన మిషన్ కాకతీయ
► పథకం ప్రారంభమై నేటితో ఏడాది
► ప్రగతి అంతా ఎగుడుదిగుడులే!
► కొనసా...గుతున్న మొదటి విడత పనులు
► పథకం ప్రారంభమై నేటితో ఏడాది కొనసా...గుతున్న మొదటి విడత
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం..రాజకీయ, ఇతర కారణాల రీత్యా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనం జిల్లాలో మొదటి విడతలో మంజూరైన చెరువుల పనుల్లో కనీసం పావు భాగం కూడా పూర్తికాలేదు. చాలా చెరువుల పనులు ఇంకా కొనసా...గుతూనే ఉన్నాయి. విడతలవారీగా గ్రామాల్లోని చెరువులను అభివృద్ధి చేసి భూగర్భ జలాల పెంపు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గత ఏడాది ఇదే నెలలో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ ఏడాది కాలంలో పథకం ప్రగతి ఎగుడుదిగుడుగా మారింది. మొదటివిడత పనులను ఆర్భాటంగా మంజూరు చేసినప్పటికీ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు స్థానిక రాజకీ యాల కారణంగా ఈ పనులు వద్దుర బాబోయ్ అంటూ నెత్తి నోరు బాదుకున్నారు.
టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వెంటనే అగ్రిమెంట్లు చేసుకోవాలని, పనులు వెంటనే ప్రారంభించకపోతే బ్లాక్ లిస్టులో పెడతామని ప్రభుత్వం హుకుం జారీ చేయడంతో మింగలేక కక్కలేక అన్నట్లు నియోజకవర్గ నేతలు సూచించిన గ్రామ స్థాయి నాయకులకు పనులను అప్పగించిన ఘటనలున్నాయి. దీంతో ఎలాంటి అనుభవం లేని వారు పనులను నిర్వహించడంతో ఇంజనీరింగ్ అధికారులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది.
నీరుగారుతున్న లక్ష్యం
గ్రామాల్లోని చెరువులను పునరుద్ధరించి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకం క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలను సాధించడంలేదు. రాజకీయ నాయకులు తమ కార్యకర్తలకే పనులు ఇప్పించుకునేందుకు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేవడం, కాంట్రాక్టర్లనుంచి తీసుకున్న పనులను విభేదాల కారణంగా ప్రారంభించడంలో ఆల స్యం చేయడం వంటి కారణాలు మొదటి విడత కింద మంజూరైన పనులకు ఇబ్బందిగా మారా యి. పోటీకి పోయి లెస్‌కు టెండర్లు వేయడం, సాగే లేని కుంటలకు ప్రాధాన్యం, శిఖం భూము లు కబ్జాకు గురికావడం వంటి కారణాలు జా ప్యానికి కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రారంభమవుతున్న రెండో విడతపై మొదటి విడత ప్రభావం చూపిస్తుందని పలువురు రిటైర్డ్ ఇంజనీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మొదటి విడత ప్రగతి ఇలా..
మొదటి విడతలో 1073 చెరువు పనులు జిల్లాకు మంజూరు కాగా 1051 పనులకు టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభించారు. రెండు పనులు కోర్టు కేసులో పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా 20 పనులు భూసేకరణ సమస్యతో ఆగిపోయినట్లు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో 65 చెరువు పనులు మాత్రమే మొదటి విడత కింద పూర్తయినట్లు నివేదికలు చెబుతుండగా అధికారులు మాత్రం 700 పనులు ఫిజికల్‌గా పూర్తయినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం మొదటి విడతలో రూ.284.305 కోట్ల రూపాయలతో పనులు చేపట్టగా ఇప్పటివరకు రూ.103.158 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా 941 పనులు వివిధ స్థాయిల్లో పురోగతిలో ఉన్నాయి. ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకోవడంలేదు.
రెండో విడత పురోగతి ఇలా....
మిషన్ కాకతీయ రెండో విడతకు 1885 చెరువు పనులు చేపట్టాలని అనుకున్నా.. నిర్ణయించిన గడువులోపు ప్రతిపాదనలు పూర్తిస్థాయిలో సమర్పించలేదు. ప్రభుత్వానికి 1583 ప్రతిపాదనలు సమర్పించగా 512 చెరువు పనులు మంజూరు చేస్తూ ప్రభుత్వం పలు దఫాలుగా జీఓలను జారీ చేసింది. మంజూరైన పనుల్లో 148 పనులకు టెండర్లు నిర్వహించి 42 పనులకు కాంట్రాక్టర్లతో అగ్రిమెంటు పూర్తి చేశారు. ఇప్పటివరకు 10 పనులను ప్రారంభించారు. అయితే రెండో విడత ప్రతిపాదనలు సమర్పించేందుకు ఈ నెల 4వ తేదీని గడువుగా నిర్ణయించినా పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సమర్పించ లేకపోయారు. దీంతో రెండో విడతలో చేపట్టాల్సిన 302 పనులు ఈ దఫాలో మంజూరుకి మోక్షం లేనట్లే. కాగా మొదటి విడత పనుల్లో తాము బిజీగా ఉన్నామని, వాటి బిల్లుల చెల్లింపు, రెండో విడత సర్వేలతో పని ఒత్తిడికి గురవుతున్నామని ఇం జనీరింగ్ అధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్య లు పరిష్కరించి యుద్ధప్రాతిపదికన మిషన్ కాకతీయ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో లక్ష్యాన్ని చేరడంలేదు.
లక్ష్యాన్ని సాధిస్తాం
మిషన్ కాకతీయ లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మొదటి విడత కింద చేపట్టిన పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తాం. రెండవ విడత కింద మంజూరైన పనులకు సంబంధించి 148 పనులకు టెండర్లు నిర్వహించి 42 అగ్రిమెంట్లు పూర్తి చేశాం. ఇప్పటివరకు 10 పనులు ప్రారంభించాం. మంజూరైన పనులకు సంబందించి టెండర్లు నిర్వహించి పనులను ప్రారంభించాలని అన్ని డివిజన్‌ల ఈఈలను ఆదేశించాం. -సదాశివ, ఎస్‌ఈ, చిన్ననీటి పారుదల శాఖ