ఆయకట్టు బీడే!
► హంద్రీ-నీవా ద్వారా పొలాలకు నీరిచ్చేది లేదని తేల్చిన ప్రభుత్వం
► చెరువులకు ఇచ్చేలా ప్రతిపాదనలు పంపాలని ఆదేశం
► 24.3 టీఎంసీలతో ప్రతిపాదనలు పంపిన అధికారులు
► డీపీఆర్‌కు రూ.43.96 కోట్లు అవసరమని నివేదిక
సాక్షిప్రతినిధి, అనంతపురం అంతా అనుకున్నట్లే జరుగుతోంది. హంద్రీ-నీవా ద్వారా చెరువులకు మినహా ఆయకట్టుకు నీరిచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది. చెరువులకు నీరిచ్చేందుకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు ప్రాథమిక అంచనాతో ఓ నివేదిక పంపారు. పూర్తిస్థాయిలో సర్వే చేసి త్వరలోనే మరో నివేదిక పంపనున్నారు. హంద్రీ-నీవా ద్వారా నాలుగు జిల్లాలకు 40 టీఎంసీలు ఎత్తిపోసుకునేలా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఇందులో అత్యధికంగా 23 టీఎంసీలు ‘అనంత’కు కేటాయించారు.
ఇందులో ఫేజ్-1లోని 1.18లక్షల ఎకరాలకు 8 టీఎంసీలు, ఫేజ్-2లో 2.27లక్షల ఎకరాలకు 15 టీఎంసీలు కేటాయించారు. ఇదిలా ఉండగా.. జిల్లాలోని అన్ని చెరువులకూ నీరిస్తామని ప్రతీ సభలోనూ మాట్లాడే చంద్రబాబు ఆయకట్టుకు నీరిచ్చే అంశం మాత్రం ప్రస్తావించడం లేదు. ఈ క్రమంలో జిల్లాలోని చెరువులకు నీరిచ్చేందుకు అవసరమయ్యే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు ఇటీవవల ప్రాథమిక నివేదికను పంపారు. నివేదికలోని అంశాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో 1263 చెరువులు ఉన్నాయి. ఇందులో 80 చెరువులకు నీరివ్వడం సాధ్యం కాదు. తక్కిన 1183 చెరువుల్లో మడకశిర బ్రాంచ్‌కెనాల్ కింద 265 ఉన్నాయి. ఇవి మినహాయిస్తే తక్కిన 918 చెరువుల్లో 407 చెరువులకు గ్రావిటీ ద్వారా నీరు అందించొచ్చు. దీని కోసం 171 స్లూయిస్ ఏర్పాటు చేయాలి. ఈ 407 చెరువులకు నీరిచ్చేందుకు 13.8 టీఎంసీల నీరు అవసరం.
ఈ నీటిని చెరువులకు అందించేందుకు 822 కిలోమీటర్లు కాలువలు ఏర్పాటు చేయాలి. ఇవి కాకుండా మిగిలిన 511 చెరువులకు నీరిచ్చేందుకు లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాలి. ఇందుకు 130 లిఫ్ట్‌లు అవసరమవుతాయి. ఈ చెరువులకు 10.5 టీఎంసీలు అవసరం. ఈ చెరువులకు 1926 కిలోమీటర్ల మేర కాలువలు తవ్వాలి. ఈ మేరకు సర్వే చేసి డీపీఆర్ (డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్) పంపేందుకు రూ.43.96 కోట్లు అవసరమని హంద్రీ-నీవా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.
జిల్లాకు కేటాయింపు 23 టీఎంసీలు... చెరువులకు ప్రతిపాదనలే 24. 3 టీఎంసీలు:
జిల్లాలో ఆయకట్టుకు నీరిచ్చేందుకు 23 టీఎంసీలు కేటాయిస్తే, చెరువులకే 24.3 టీఎంసీల అవసరమని అధికారులు పంపడం చూస్తే ఆయకట్టుకు నీరిచ్చే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. ఒకవేళ చెరువులకు నీరిచ్చి తర్వాత ఆయకట్టుకు ఇస్తారని అనుకుంటే చెరువులకు అవసరమయ్యే 24.3 టీఎంసీలతో పాటు ఆయకట్టుకు కేటాయించిన 23 టీఎంసీలు కలిపి 47.3 టీఎంసీలు జిల్లాకు అవసరం. సీమలోని నాలుగు జిల్లాలకు కేటాయింపులే 40 టీఎంసీలు ఉంటే ‘అనంత’కు 47.3 టీఎంసీలు ఎలా ఇస్తారనేది పాలకులు సమాధానం చెప్పాల్సి ఉంది. పైగా చెరువులకు నీరిచ్చేందుకు 2,748 కిలోమీటర్లు కాలువలు నిర్మించాలని ప్రతిపాదనలు పంపుతున్నారంటే దీనికి ఎంత ఖర్చవుతుంది? ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయనేది ఇట్టే తెలుస్తోంది.
ఆయకట్టుకు నీరిచ్చే యోచన చేయడం లేదని రాజకీయపార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇటీవల కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయకట్టుకు నీరిస్తారా? లేదా? అని మంత్రి పల్లె రఘునాథరెడ్డిని ఎమ్మెల్సీ గేయానంద్ సూటిగా ప్రశ్నించారు. చెరువులన్నిటికీ నీరిస్తామని పల్లె సమాధానం చెప్పారు. మళ్లీ సూటిగా ప్రశ్నించినా...మంత్రి అదే సమాధానం చెప్పారు. ఈ పరిణామాలను చూస్తే చెరువులకు నీరిస్తామని ప్రకటించడం మినహా ఆయకట్టుకు నీరిస్తామని ప్రభుత్వం చెప్పకపోవడం చూస్తే ‘అనంత’కు తీరని అన్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది.