‘మిషన్’కు నాబార్డు అభయం
- ఆర్థిక సాయంపై సీఎంకు నాబార్డు చైర్మన్ హామీ
- గ్రీన్‌హౌస్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితరాలకు కూడా...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకానికి నిధులపై నాబార్డు అభయమిచ్చింది. ఈ పథకానికి ఆర్థికసాయం అందిస్తామని నాబార్డు చైర్మన్ హర్షకుమార్ భన్వాలా హామీ ఇచ్చారు. మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో క్యాంపు కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మిషన్ కాకతీయ గురించి కేసీఆర్ ఆయనకు సమగ్రంగా వివరించారు. చెరువుల పునరుద్ధరణకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయకు నిధులు మంజూరు చేయాలని కోరగా నాబార్డు చైర్మన్ అందుకు అంగీకరించారు. అలాగే వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత, గ్రీన్‌హౌస్ సాగు, గ్రామాల్లో వంతెనల అనుసంధానం, ప్రాథమిక పాఠశాలలు, తాగునీరు, పారిశుద్ధ్యం, సహకార బ్యాంకులు, సూక్ష్మసేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ, భూసార పరీక్షలు, నదులు, ఉప నదుల కింద చెక్ డ్యాంల నిర్మాణం, గ్రామీణ రోడ్లు, జిల్లాల్లో గోదాముల నిర్మాణం వంటి ప్రాజెక్టులకూ ఆర్థికసాయం అందించేందుకు సిద్ధమన్నారు.
ఫార్మా సిటీ కోసం వీలైతే నిధులు కేటాయించాలని సీఎం కోరగా అందుకు నాబార్డు చైర్మన్ అంగీకరించారు. రాష్ట్ర సహకార బ్యాంకు విభజన అయ్యాక తెలంగాణ సహకార బ్యాంకుకు రూ. 800 కోట్ల నుంచి రూ. 900 కోట్ల మేరకు ఆర్థిక సాయం చేస్తుందన్నారు. తెలంగాణ సహా దేశంలో 10 రాష్ట్రాల్లో త్వరలో స్వయం సహాయక సంఘాల డిజిటలైజేషన్‌ను ప్రారంభిస్తామని హర్షకుమార్ భన్వాలా పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాబార్డు డిప్యూటీ ఎండీ ఆర్.అమలార్ ఫర్వనతన్, నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగరావు, ఉన్నతాధికారులు రేమండ్ పీటర్, పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.