స్టేట్ గెస్ట్‌హౌస్‌గా క్యాంపు కార్యాలయం
సీఎం కొత్త భవనంలోకి మారగానే అతిథిగృహంగా ప్రస్తుత నివాసం
పరిశీలించాల్సిన అధికారులకు సీఎం ఆదేశం
‘లేక్‌వ్యూ’ను ఏపీ సీఎంకు కేటాయించటంతో స్టేట్‌గెస్ట్‌హౌస్ అవసరం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయం కోసం కొత్త భవన సముదాయం సిద్ధం కాబోతోంది. సుమారు రూ.33 కోట్ల వ్యయం తో దాదాపు 9 ఎకరాల విస్తీర్ణంలో బేగంపేటలో దీన్ని నిర్మిస్తున్నారు. అది పూర్తికాగానే ముఖ్యమంత్రి నివాసం, క్యాంపు కార్యాలయం అందులోకి మారుతుంది. మరి... ప్రస్తుతం ఉన్న నివాసం, క్యాంపు కార్యాలయాన్ని ఏం చేస్తారు?
స్పీకర్‌కు కేటాయిస్తారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసంగా మారుస్తారని... ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ దాని విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో లా ఆలోచిస్తున్నారు. ఆ భవనాన్ని రాష్ట్రప్రభుత్వ అధికారిక అతిథిగృహంగా మార్చాలని భావిస్తున్నారు. ఈమేరకు రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఆయన సూచన చేశారు. ప్రస్తుత నివాసాన్ని స్టేట్‌గెస్ట్ హౌస్‌గా మారిస్తే ఎలా ఉంటుందో పరిశీలించి చెప్పాల్సిందిగా ఆదేశించారు. వారి నుంచి వచ్చే నివేదిక ఆధారం గా ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.
లేక్ వ్యూ గెస్ట్‌హౌస్ ఏపీకి...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అధికారిక అతిథి గృహంగా లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ కొనసాగింది. నగరానికి వచ్చే ప్రముఖులకు దాన్ని విడిదిగా కేటాయించేవారు. అందుకుతగ్గట్టుగానే అది దర్పంగా ఉండటంతో మరో అతిథిగృహం అవసరం పడలేదు. ఒకేసారి ఇద్దరు.. ముగ్గిరికి కేటాయించాల్సిన పరిస్థితి వస్తే దాని సమీపంలోనే ఉన్న దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌ను వినియోగించేవారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండటంతో... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి క్యాంపు కార్యాలయం కోసం లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం దాన్ని ఏపీ ముఖ్యమంత్రి పెద్దగా వినియోగించనప్పటికీ పదేళ్లపాటు ఏపీ ఆధీనంలోనే అది ఉండనుంది. దీంతో తెలంగాణకు అధికారిక అతిథిగృహం లేకుండాపోయింది. ప్రముఖులు వస్తే హోటళ్ల లో ఉంచాల్సి వస్తోంది. దీంతో కొత్త అతిథి గృహం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చాలారోజులుగా ఆలోచిస్తున్నారు. ఇటీవల సచివాల యం నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఉన్నట్టుండి దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌కు వెళ్లి దాన్ని పరిశీలించారు. స్టేట్ గెస్ట్‌హౌస్‌గా దాన్ని మారి స్తే బాగుంటుందని ఆయన భావించి రోడ్లు భవనాల శాఖ అధికారులకు సూచనలు చేశా రు. కానీ ఆ భవనం పాతబడినందున దానికి మార్పుచేర్పులు చేయటం సరికాదని అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాను వినియోగిస్తున్న క్యాంపు కార్యాలయం, అధికారిక నివాసాన్ని గెస్ట్‌హౌస్‌గా మార్చటమే ఉత్తమమని ఆయన తాజాగా అధికారుల దృష్టికి తెచ్చారు. విశాలంగా ఉండటం, విడివిడిగా రెండు భవనాలు, అధునాతన వసతులతో ఉన్నందున అది స్టేట్ గెస్ట్‌హౌస్‌గా మారిస్తే బాగుంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుత నివాసం గురించి..
⇒నిర్మాణం: 2004లో ప్రారంభమై 2005లో పూర్తి
⇒విస్తీర్ణం : 2 ఎకరాలు, నిర్మాణ వ్యయం : దాదాపు రూ.2 కోట్లు
⇒నివాసం: తొలుత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2005 నుంచి 2009 వరకు వినియోగించారు.
⇒తర్వాత రోశయ్య కేవలం క్యాంపు కార్యాలయాన్ని వినియోగించుకున్నారు.
⇒కిరణ్ కుమార్‌రెడ్డి 2010 నుంచి 2014 వరకు వాడారు.
⇒కేసీఆర్ 2014 నుంచి వినియోగిస్తున్నారు. వాస్తులోపం పేరుతో క్యాంపు కార్యాలయాన్ని వాడట్లేదు.