దసరాకు సీఎం కొత్త నివాసం | KCR to move into new camp office by Dasara | Sakshi
Sakshi News home page

దసరాకు సీఎం కొత్త నివాసం

Published Sun, Jun 19 2016 3:55 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

దసరాకు సీఎం కొత్త నివాసం - Sakshi

దసరాకు సీఎం కొత్త నివాసం

* కొత్త క్యాంపు కార్యాలయం నిర్మాణ పనులు వేగవంతం
* రాష్ట్ర అతిథి గృహంగా మారనున్న ప్రస్తుత క్యాంపు ఆఫీసు
* వీవీఐపీల తాత్కాలిక విడిదికి వినియోగం

సాక్షి, హైదరాబాద్: దసరా నుంచి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొత్త క్యాంపు కార్యాలయం నుంచి విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు రోడ్లు భవనాలశాఖ కొత్త క్యాంపు ఆఫీసు, నివాస భవన నిర్మాణ పనులను వేగవంతం చేసింది.

ప్రస్తుతమున్న ఐఏఎస్ ఆఫీసర్ల క్లబ్ స్థలంలో ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం, నివాస భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మార్చిలోనే ఈ పనులను ప్రారంభించారు. మరోవైపు సీఎం కొత్త భవనంలోకి మారాక ప్రస్తుత నివాసాన్ని కూలుస్తారా లేదా ఇతర అధికారిక అవసరాలకు వినియోగిస్తారా అనే అంశంపై కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చకు తెరపడింది. రాష్ట్రానికి వచ్చే వీవీఐపీలు, ప్రముఖులకు విడిది కల్పించేందుకు వీలుగా ప్రస్తుతమున్న క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్‌గా మార్చాలని ముఖ్యమంత్రి సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రభుత్వ అతిథిగృహంగా ఉన్న లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయంగా మార్చటంతో తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ అతిథి గృహం లేకుండాపోయింది. దీనివల్ల ఢిల్లీ నుంచి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి ప్రతినిధులు, ఇతర ప్రభుత్వ అతిథులకు వసతి కల్పించటం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.

ఫలితంగా వీవీఐపీలకు స్టార్ హోటళ్లలో సూట్‌లను బుక్ చేయాల్సి వస్తోంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం కేసీఆర్ తొలుత దిల్‌కుషా, మంజీరా, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లలో ఒక దాన్ని ప్రభుత్వ అతిథిగృహంగా మార్చాలని భావించారు. ఇందుకోసం ఆయనే స్వయంగా వెళ్లి వాటిని పరిశీలించారు. కానీ ప్రస్తుత అవసరాలకు అవి సరిపోవటం లేదని, సౌకర్యాల ప్రమాణాలు కూడా ఆశించిన స్థాయిలో లేవని వెనక్కి తగ్గారు.

ఈ నేపథ్యంలో సీఎంకు కొత్త భవన సముదాయం నిర్మాణం వేగవంతం కావటంతో పాత క్యాంపు కార్యాలయాన్ని అతిథి గృహంగా మార్చాలని సీఎం సూచించినట్లు తెలిసింది. దసరాకు కొత్త క్యాంపు ఆఫీసు సిద్ధమైతే నవంబర్‌కల్లా ఈ నివాస భవనం ఖాళీ అవుతుంది. దీన్ని కూడా గతంలో ఆధునిక హంగులతో నిర్మించారు. దీంట్లో కొన్ని వాస్తు లోపాలు ఉన్నాయని నిపుణులు సూచించడంతో ఆ మేరకు మార్పుచేర్పులు చేశాకే సీఎం కేసీఆర్ అందులో అడుగుపెట్టారు. ప్రస్తుతం అందులోని నివాస భవనాన్ని మాత్రమే ముఖ్యమంత్రి ఉపయోగిస్తున్నారు.

బేగంపేట మెయిన్ రోడ్డు వైపు ఉన్న క్యాంపు కార్యాలయాన్ని ఖాళీగానే వదిలేశారు. కేవలం సీఎం భద్రతా సిబ్బంది అవసరాలకు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ దసరాకు సీఎం కొత్త భవనంలోకి మారగానే భద్రతా సిబ్బంది సైతం అక్కడికే మకాం మార్చనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాను ఉంటున్న అధికారిక భవనాన్ని, దానికి అనుసంధానంగా ఉన్న క్యాంపు కార్యాలయాన్ని అధునాతనంగా తీర్చిదిద్ది స్టేట్ గెస్ట్ హౌస్‌గా మార్చాలని సీఎం రోడ్లు భవనాలశాఖ అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్ స్థాయి వీవీఐపీలకే ఈ భవనాన్ని కేటాయించాలని సూచించారు. ఎవరెవరి వసతికి దీన్ని ఉపయోగించాలనే విషయంలో ప్రొటోకాల్ విభాగం ప్రత్యేకంగా ఒక జాబితాను తయారు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement