వడివడిగా ప్రాజెక్టులు | 10 projects were completed in five years and another 13 projects were partially completed | Sakshi
Sakshi News home page

వడివడిగా ప్రాజెక్టులు

Published Sun, Jun 2 2019 5:42 AM | Last Updated on Sun, Jun 2 2019 5:42 AM

 10 projects were completed in five years and another 13 projects were partially completed - Sakshi

ఈ ఏడాది సాగులోకి మరో 12 లక్షల ఎకరాలు..
కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రం హక్కుగా కలిగిన నికర, మిగులు జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తేవడం లక్ష్యంగా చేపట్టిన ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం తొలి నుంచీ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఐదేళ్ల కాలంలో 10 ప్రాజెక్టులను పూర్తి చేయగా మరో 13 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణగా మారుస్తామన్న ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని 1.25 కోట్ల ఎకరాల మాగాణంగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భారీ, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టులు, పథకాల కింద 70.64 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.

2004లో మొదలైన జలయజ్ఞం ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలతో ప్రభుత్వం ఇప్పటివరకు 16.65 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చింది. ఇందులో రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఏకంగా 12.78 లక్షల ఎకరాలను సాగులోకి తేవడం విశేషం. ప్రధానంగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, దేవాదుల, సింగూరు వంటి భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కిందే 10.94 లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో 54.05 లక్షల ఎకరాలను వృధ్ధిలోకి తేవాల్సి ఉంది. ఇందులో ఈ ఏడాది ఖరీఫ్‌ నాటికి కనిష్టంగా దాదాపు 12 లక్షల ఎకరాలకైనా కొత్తగా సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఐదేళ్లలో రూ. 81 వేల కోట్లు...
రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ. 80వేల కోట్ల మేర సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ. 23 వేల కోట్ల మేర నిధులు ఖర్చు చేయగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో మునుపెన్నడూ లేనివిధంగా రూ. 30,588 కోట్లు ఖర్చు చేసింది. 2017–18లో కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే రూ. 18 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. ఇక దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వలకు కలిపి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయగా వాటి ద్వారా మరో రూ. 5 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. మొత్తంగా కార్పొరేషన్‌ రుణాల ద్వారా ఇంతవరకు రూ. 33,664 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కాళేశ్వరం కార్పొరేషన్‌ కిందే మొత్తంగా రూ. 28,661 కోట్ల మేర ఖర్చు జరిగింది. 

మొదలుకానున్న కాళేశ్వర శకం...
రాష్ట్ర సాగునీటి రంగంలో కొత్త అధ్యాయం ఆవిష్కృతం కానుంది. ఈ ఏడాది జూలై నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల శకం మొదలు కానుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అతితక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి నీటిని పంట పొలాలకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ ఏడాది జూలై చివరి నుంచి కాళేశ్వరం ద్వారా కనీసం 150 టీఎంసీల నుంచి గరిష్టంగా 200 టీఎంసీల నీటిని తరలించేలా పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు పూర్తవగా పంప్‌హౌస్‌లలో ఈ నెల మొదటి లేదా రెండో వారం నుంచి డ్రై రన్‌ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6లో ఇప్పటికే 4 మోటార్ల డ్రై రన్‌ పూర్తయింది. ప్యాకేజీ–7లో టన్నెల్‌ పనులు పూర్తయ్యాయి. ప్యాకేజీ–8లో మోటార్లన్నీ సిద్ధమయ్యాయి. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ పనులు జరగకున్నా ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఫీడర్‌ చానల్‌ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టును స్థిరీకరించే పనులు చివరికొచ్చాయి.  మొత్తంగా ఈ ఖరీఫ్‌లోనే 10 లక్షల ఎకరాల స్థిరీకరణ, మరో 90 వేల ఎకరాల మేర కొత్త ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు చేస్తున్నారు.  

చెరువుల పునరుద్ధరణ సక్సెస్‌.. ఇక చెక్‌డ్యామ్‌లపై దృష్టి
తెలంగాణ తొలి ప్రభుత్వం చిన్న నీటివనరుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. నాలుగు విడతల్లో 26,926 చెరువులను పునరుద్ధరించింది. ఇందుకోసం రూ. 3,979.53 కోట్లు ఖర్చు చేసింది. ఈ పనులతో 8.53 టీఎంసీల నీటి నిల్వ పెరగడంతోపాటు 13.57 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఇక ఇప్పుడు ఎక్కడి నీటిని అక్కడే కట్టడి చేసేలా గొలుసుకట్టు చెరువుల వద్ద చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి సర్కారు సిద్ధమైంది. మొత్తంగా 1,200 చెక్‌డ్యామ్‌లు, 3 వేల తూముల నిర్మాణం చేయాలని భావిస్తోంది. తూముల నిర్మాణం ద్వారా 8,350 చెరువులను నింపేలా పనులు మొదలుపెట్టింది. ఇందుకోసం రూ. 4,200 కోట్లు ఖర్చు చేయనుంది. ఇప్పటికే తూముల టెండర్ల పనులు మొదలవగా చెక్‌డ్యామ్‌లకు ఇప్పుడిప్పుడే అనుమతిస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేక నిర్జీవంగా మారిన భూములన్నీ ఇప్పుడు నిండు సత్తువను సంతరించుకుంటున్నాయి. నీటి జాడ లేక వట్టిపోయిన చెరువులన్నీ నేడు నీటితో కళకళలాడుతున్నాయి. పడావు భూములు కాస్తా పచ్చని పంట పొలాలుగా మారుతున్నాయి. అరవై ఏళ్లుగా సాగునీటి కోసం పడ్డ అరిగోస.. ఐదేళ్ల కాలంలోనే కోటి ఎకరాల మాగాణం దిశగా వడివడిగా పరుగులు పెడుతోంది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 1.25 కోట్ల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంలో ఇప్పటికే 71 లక్షల ఎకరాల మార్కును దాటింది. తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్న ఐదేళ్ల కాలంలోనే ఏకంగా కొత్తగా 12.77 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రాగా మరో 14.78 లక్షల ఎకరాల స్థిరీకరణ పూర్తయింది. ప్రాజెక్టులపై మొత్తంగా 2004 నుంచి ఇప్పటివరకు రూ. 1.11 లక్షల కోట్ల మేర ఖర్చవగా గత ఐదేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏకంగా రూ. 81 వేల కోట్లు ఖర్చు చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. నాలుగేళ్లలో మరో రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి కోటి ఎకరాల మాగాణ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది.     
– సాక్షి, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement