- హరీశ్‌రావు, నాణ్యతా లోపాలు, చెరువు పనులు
- క్వాలిటీ కంట్రోల్ అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
- నాణ్యతా లోపాలకు బాధ్యత వహించాలని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యత లోపించినా లేదా అవకతవకలు జరిగినట్లు గుర్తించినా వాటిని కూల్చేయాలన్నారు. మిషన్ కాకతీయ పనులు, క్వాలిటీ కంట్రోల్‌పై ఆయన సోమవారం సచివాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో మూడు క్వాలిటీ కంట్రోల్ డివిజన్లు ఉండగా వాటిని 10కి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో కొంతమంది చాలాకాలంగా పాతుకుపోయారని, వారు హెడ్‌క్వార్టర్స్‌లో ఉండటం లేదన్నారు. మిషన్ కాకతీయ పనుల నాణ్యతపై కొన్ని ప్రాంతాల నుంచి ఎక్కువగా ఫిర్యాదులొస్తున్నాయని...వాటిని సరిదిద్దుకొని పారదర్శకంగా పని చేయాలని హరీశ్ సూచించారు. పనుల్లో ఏవైనా అవకతవకలు జరిగితే క్వాలిటీ కంట్రోల్ విభాగమే బాధ్యత వహించాలన్నారు.
అధికారులు, సిబ్బంది సజావుగా ఉంటే పత్రికల్లో వచ్చే ఆరోపణలకు జంకాల్సిన అవసరం లేదని, ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు వచ్చినట్లు భావిస్తే సంబంధిత మీడియా ఎడిటర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అయితే ఆరోపణలు రాకుండా అధికారులు సక్రమంగా పనిచేయాలని సూచించారు. సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్, మైనర్ సీఈ నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
10 చెక్‌డ్యామ్‌లకు అనుమతి..
నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గ పరిధిలో 10 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి రూ. 12.49 కోట్లను మంజూరు చేశారు. మెదక్ జిల్లాలోని చిన్న ఘణపురం ఎత్తిపోతల పథకం పనుల మరమ్మతులకు రూ. 78 లక్షలను మంజూరు చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు.
చెరువు పనుల నాణ్యతలో రాజీ వద్దు
Published Tue, Jul 12 2016 3:27 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM
Advertisement
Advertisement