ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి
కార్పొరేటర్లతో మంత్రి మహేందర్‌రెడ్డి: మంత్రిని కలిసిన శివారు కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు తినిపించిన మహేందర్‌రెడ్డిఅభివృద్ధిపై దిశానిర్దేశం
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కనీవినీ ఎరుగని రీతిలో మెజార్టీ కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పని చేయాలని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పి.మహేందర్ రెడ్డి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు సూచించారు. శనివారం పలువురు కార్పొరేటర్లు మంత్రిని కలిసి తమ గెలుపునకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ కార్పొరేటర్ ప్రజలతో మమేకమై అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా తమ పరిధిలో రోడ్ల నిర్మాణం, తాగునీటి ఎద్దడి నివారణ, మురుగు కాల్వల నిర్మాణంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు.
జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదలకు కనీస సౌకర్యాలు కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయసాధన కోసం అందరూ కంకణబద్ధులు కావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, చంపాపేట, శేరిలింగంపల్లి, చందానగర్, మైలార్ దేవ్‌పల్లి, అత్తాపూర్, రాజేంద్రనగర్ కార్పొరేటర్లు, పలువురు టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.