మోటార్ వాహనాల చ ట్టానికి 17 సవరణలు
- కేంద్రానికి ప్రతిపాదించనున్న కమిటీ
- తెలంగాణ అనుసరిస్తున్న విధానాలను అభినందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మోటార్ వాహనాల చట్ట సవరణకు ప్రతిపాదనలకుగాను కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశమైంది. రాజస్తాన్ రవాణాశాఖ మంత్రి యూనస్‌ఖాన్ నేతృత్వంలోని ఈ కమిటీ 17 సవరణలనుప్రతిపాదించాలని నిర్ణయించింది. కేంద్ర ఉపరితల, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కమిటీ సభ్యులు తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఇతర రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. కమిటీ సూచనలు ఇలా..డ్రైవింగ్ లెసైన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ను సరళీకరించడం. ఆన్‌లైన్‌లో డ్రైవర్లకు డీఎల్, ఎల్‌ఎల్‌ఆర్ జారీలో కఠిన నిబంధనలు.
రోడ్డు ప్రమాదాలలో క్షతగాత్రులకు సాయంపై రెస్క్యూటీంకు మార్గదర్శకాలను జారీచేయడం. డీలర్ల స్థాయిలోనే వాహనాల రిజిస్ట్రేషన్లు, జాతీయ స్థాయిలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు బోర్డు ఏర్పాటు. డ్రైవర్లకు ప్రమాద బీమా కల్పన, వాహనాలకు ఆటోమేటిక్ ఫిట్‌నెస్ పరీక్ష కేంద్రాల ఏర్పాటు. రోడ్డు భద్రతకు సుప్రీంకోర్టు కమిటీ చేసిన ప్రతిపాదనలను అమలు చేయడం. మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీగా జరిమానా విధింపు, ఈ నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించడం. రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు కార్డుల ద్వారా ఈ-టోలింగ్ ఏర్పాటు. ఈ-రిక్షాలను, టూ వీలర్ ట్యాక్సీ వ్యవస్థను ప్రోత్సహిం చడం. రోడ్డు ప్రమాద బాధితుల పరిహారం పెంపు వంటి సవరణలను కమిటీ ప్రతిపాదించనుంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రోడ్డు భద్రత-ట్రాఫిక్ నియంత్రణ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.అలాగే రవాణా శాఖలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా అభినందించారు.