చిలకలపూడి (మచిలీపట్నం) : ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు న్యాయం చేసేందుకు కృష్ణా జిల్లాలో ప్రథమంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై. లక్ష్మణరావు తెలిపారు. తన చాంబర్‌లో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జాతీయ రహదారులు ఎక్కువగా ఉండటంతో ప్రతి అర గంటకు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలకు కారకుల వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవటం, డ్రైవర్‌కు లైసెన్సు లేని పరిస్థితుల్లో ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు నష్ట పరిహారం చెల్లించటంలో ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇందుకోసం 2017 నవంబరు 7వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జిల్లాలో అమలు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ తీర్పు ఆధారంగా ప్రమాదాల్లో వాహనాలకు ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్సు లేకపోతే పోలీసులు వాహనాలు సీజ్ చేసి కోర్టు ఉత్తర్వులు వెలువడేంత వరకు దాన్ని యజమానికి అప్పగించకూడదని చెప్పారు.
ఇప్పటి వరకు రవాణా శాఖ అధికారులు ధ్రువీకరణ పత్రం ఇస్తే వాహనాన్ని విడుదల చేస్తున్నారని, ఇకపై కోర్టు ఆదేశాల మేరకే వాహనాన్ని విడుదల చేసేలా రవా ణా, పోలీసు శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రమాదం జరిగిన మూడు నెలల్లోపు వాహన యజమాని క్షతగాత్రుడికి నష్ట పరిహారం ఇచ్చేందుకు పూచీకత్తు ఇవ్వని పక్షంలో ఆ వాహనాన్ని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వేలం వేసి వచ్చిన మొత్తాన్ని డిపాజిట్ చేస్తారని వెల్లడించారు. ప్రయాణీకులు ఏ వాహనమైనా ఎక్కేటప్పుడు దానికి ఇన్సూరెన్స్, డ్రైవర్‌కు లైసెన్సు ఉందో, లేదో తెలుసుకోవాల్సి ఉందని సూచించారు. వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, డ్రైవర్ లైసెన్సు వాహనంలో ప్రదర్శించాలన్నారు. లేదంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. నెం బరు ప్లేట్లు లేకుండా తిరిగేవాటిపై స్పెషల్ డ్రైవ్‌గా రవాణా, పోలీసు శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించాలని సూచించామని చెప్పారు. ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ప్రైవేటు ఫైనాన్స్ ద్వారా తీసుకున్న వాహనాలకు కూడా తప్పనిసరిగా ఇన్సూరెన్స్‌ను కట్టించాలన్నారు.
22న లోక్ అదాలత్
ఈ నెల 22వ తేదీ ఆదివారం జిల్లా కోర్టు ఆవరణలో నేషనల్ లోక్ అదాలత్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావు తెలిపారు. తొలుత ఈ నెల 14వ తేదీ నిర్వహించాలని భావించినప్పటికీ అదే రోజు అంబేడ్కర్ జయంతి కారణంగా వాయిదా వేశామన్నారు. ఈ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే, ఈ నెల 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అంబేడ్కర్ జయంతి రోజున బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పీఆర్ రాజీవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment