laxman rao
-
సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఏపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్‌రావు
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్.లక్ష్మణ్‌రావును ఎంపిక చేశారు. చాలా కాలంగా ఆర్గనైజేషన్‌లో విధులు నిర్వర్తిస్తోన్న అనుభవం ఉండటంతో ఆయన్ను ఈ పదవికి ఎంపిక చేసినట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆదివారం తెలిపింది. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న జి.చలంను సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్‌గా నియమించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను వెంటనే తొలగించాలి’
సాక్షి, విజయవాడ: ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారని, ఆయనను వెంటనే తొలగించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సోమవారం ఐదుగురు ఎమ్మెల్సీలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. ఏపీపీఎస్సీ, యూరేనియం తవ్వకాలకు సంబంధించిన అంశాలపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. గత ఐదేళ్లల్లో ఆయన తీరు వల్ల లక్షలాది అభ్యర్థులు అవస్థలు పడ్డారని విమర్శించారు. ఆయన ఇష్టానుసారంగా ప్రతి ఏడాది సిలబస్ మార్చేశారని మండిపడ్డారు. గ్రూపు 1, గ్రూపు 2, గ్రూపు 3 పరీక్షల సిలబస్‌కు.. పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు సంబంధం లేదని, అన్నీ తప్పులే ఉన్నాయన్నారు. నెగిటివ్ మార్కులు వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్ధులు నష్టపోయారని గుర్తు చేశారు. ఈ అంశాలపై గవర్నర్‌కు ఆధారాలతో సహా వివరించామని వెల్లడించారు. ఈస్టర్ పండుగ రోజు కూడా పరీక్ష నిర్వహించారని తప్పుపట్టారు. ఛైర్మన్ ఉదయ భాస్కర్‌ను వెంటనే తొలగించి అభ్యర్థులకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఏపీలో యురేనియం తవ్వకాల వల్ల ప్రకృతికి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. కడప, నెల్లూరు జిల్లాల్లో ఈ తవ్వకాల వల్ల చెరువుల్లో నీరు కలుషితం అవుతుందని విమర్శించారు. ఈ విషయమై అధ్యయనం చేసి ఒక యూనివర్శిటీ నివేదిక ఇస్తే.. అది బయటకురాకుండా ఆపేశారని మండిపడ్డారు. ఎలాంటి యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వకుండా చూడాలని గవర్నర్‌ను కోరినట్లు ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. -
నిరసన తెలిపే హక్కునూ కాలరాస్తున్న ప్రభుత్వం
సాక్షి, అమరావతి : కేఎస్గా చిరపరిచితులైన కలగర సాయి లక్ష్మణరావు పాతికేళ్లపాటు గుంటూరు హిందూ కాలేజీలో పాలిటికల్ సైన్స్ బోధించారు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను లోతుగా విశ్లేషించగల సామర్థ్యం ఆయన సొంతం. ఆయన దగ్గర క్లాస్‌రూంలో కూర్చుని చదువుకున్నా, చదువుకోకపోయినా.. గుంటూరులో అనేక బ్యాచ్‌ల విద్యార్థులు ఆయన్ను ‘గురువు గారూ’ అని గౌరవంగా పిలుచుకుంటారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ప్రస్తుత వ్యవస్థపై లక్ష్మణరావు ఏం చెబుతున్నారంటే... నిరసనల్ని ప్రభుత్వం అడ్డుకుంటోంది నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న హక్కు. దాన్ని కూడా కాలరాసిన ప్రభుత్వం ఇది. విజయవాడలో ధర్నా చౌక్‌కు బయలుదేరిన వారిని చాలా సందర్భాల్లో అక్కడకు వెళ్లకుండానే నిర్బంధిస్తున్నారు. తెల్లారకముందే పోలీసులు ఇంటికి వచ్చి గృహ నిర్బంధం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామాంజనేయులును సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య. సీపీఎస్ రద్దు అంశం రాజకీయ అజెండాగా మారింది. సీపీఎస్ రద్దు చేయమని రెండేళ్ల నుంచి ఉద్యమం నడుస్తోంది. రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. అంటే.. సీపీఎస్ అంశం మీద చర్చ జరుగుతుందనే కదా! రద్దు చేయమన్నందుకు వారి సంఘం అధ్యక్షుడిని సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నా. ఓటర్లకు ఒకటే చెబుతున్నా.. అన్ని పార్టీలను పరిశీలించండి. చేసిన వాగ్దానాలను నిజాయితీగా ఎవరు అమలు చేస్తారని భావిస్తారో.. వారికే ఓటేయండి. ధన ప్రభావానికి, ప్రలోభాలకు గురికాకుండా.. అభ్యర్థుల గుణగణాలు, సేవాతత్పరతను పరిశీలించి ఓటు వేయండి. ఉత్తమ సమాజానికి దోహదపడే విధంగా మన ఓటు ఉండాలని ప్రతి ఒక్కరూ భావించాలి. విద్య పేదలకు దూరమవుతోంది కార్పొరేట్ శక్తులు ప్రభుత్వంలో భాగంగా ఉన్నాయి. రాజకీయాలనూ కార్పొరేటీకరణ చేశారు. విద్యావ్యవస్థ విషయానికి వస్తే.. ఏపీ, తెలంగాణలో విద్యారంగం తీవ్ర స్థాయిలో కార్పొరేటీకరణ జరిగింది. ఈ స్థాయిలో కార్పోరేటీకరణ జరిగిన రాష్ట్రాలు దేశంలో లేవు. దీనివల్ల పేదలకు నాణ్యమైన విద్య దూరమైపోతోంది. ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలి. కార్పొరేట్ విద్యాసంస్థలకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు ఉండకూడదు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించాలి. కేరళ, ఢిల్లీలో సర్కారు పాఠశాలలను ఆధునికీకరించి.. కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లారు. ఏపీలోనూ తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా.. ఆకర్షణీయంగా ఉండేవిధంగా ప్రభుత్వ పాఠశాలలను అన్నివిధాలుగా తీర్చిదిద్దాలి. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు వేలల్లో ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలి. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించాలని అలహాబాదు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అమలైతే మంచి ఫలితాలు వస్తాయి. ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలి ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలి. ధన, కుల, మతం, మద్యం, ఇతర ప్రలోభాల ప్రభావం లేకుండా సంస్కరణలు తీసుకురావాలి. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా పట్టభద్రులు ఓట్లేశారు. సాధారణ ఎన్నికల్లోనూ ఇది రావాలి. – మల్లు విశ్వనాథ్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో -
క్షతగాత్రులకు న్యాయం కోసం..
చిలకలపూడి (మచిలీపట్నం) : ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు న్యాయం చేసేందుకు కృష్ణా జిల్లాలో ప్రథమంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై. లక్ష్మణరావు తెలిపారు. తన చాంబర్లో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జాతీయ రహదారులు ఎక్కువగా ఉండటంతో ప్రతి అర గంటకు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలకు కారకుల వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవటం, డ్రైవర్‌కు లైసెన్సు లేని పరిస్థితుల్లో ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు నష్ట పరిహారం చెల్లించటంలో ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇందుకోసం 2017 నవంబరు 7వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జిల్లాలో అమలు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ తీర్పు ఆధారంగా ప్రమాదాల్లో వాహనాలకు ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్సు లేకపోతే పోలీసులు వాహనాలు సీజ్ చేసి కోర్టు ఉత్తర్వులు వెలువడేంత వరకు దాన్ని యజమానికి అప్పగించకూడదని చెప్పారు. ఇప్పటి వరకు రవాణా శాఖ అధికారులు ధ్రువీకరణ పత్రం ఇస్తే వాహనాన్ని విడుదల చేస్తున్నారని, ఇకపై కోర్టు ఆదేశాల మేరకే వాహనాన్ని విడుదల చేసేలా రవా ణా, పోలీసు శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రమాదం జరిగిన మూడు నెలల్లోపు వాహన యజమాని క్షతగాత్రుడికి నష్ట పరిహారం ఇచ్చేందుకు పూచీకత్తు ఇవ్వని పక్షంలో ఆ వాహనాన్ని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వేలం వేసి వచ్చిన మొత్తాన్ని డిపాజిట్ చేస్తారని వెల్లడించారు. ప్రయాణీకులు ఏ వాహనమైనా ఎక్కేటప్పుడు దానికి ఇన్సూరెన్స్, డ్రైవర్‌కు లైసెన్సు ఉందో, లేదో తెలుసుకోవాల్సి ఉందని సూచించారు. వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, డ్రైవర్ లైసెన్సు వాహనంలో ప్రదర్శించాలన్నారు. లేదంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. నెం బరు ప్లేట్లు లేకుండా తిరిగేవాటిపై స్పెషల్ డ్రైవ్‌గా రవాణా, పోలీసు శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించాలని సూచించామని చెప్పారు. ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ప్రైవేటు ఫైనాన్స్ ద్వారా తీసుకున్న వాహనాలకు కూడా తప్పనిసరిగా ఇన్సూరెన్స్‌ను కట్టించాలన్నారు. 22న లోక్ అదాలత్ ఈ నెల 22వ తేదీ ఆదివారం జిల్లా కోర్టు ఆవరణలో నేషనల్ లోక్ అదాలత్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావు తెలిపారు. తొలుత ఈ నెల 14వ తేదీ నిర్వహించాలని భావించినప్పటికీ అదే రోజు అంబేడ్కర్ జయంతి కారణంగా వాయిదా వేశామన్నారు. ఈ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే, ఈ నెల 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అంబేడ్కర్ జయంతి రోజున బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పీఆర్ రాజీవ్ పాల్గొన్నారు. -
రూ.కోట్లు వస్తాయని నమ్మి మోసపోయా: లక్ష్మణ్ రావు
బంజారాహిల్స్: రైస్‌పుల్లింగ్ యంత్రంతో రూ.10 వేల కోట్లు వస్తాయని నమ్మి మోసపోయానని, ఈ క్రమంలో తాను ఆదాయ పన్ను శాఖను మోసం చేశానని బానాపురం లక్ష్మణ్‌రావు వెల్లడించారు. శనివారం ఆయన ఈ ఘటనపై ’సాక్షి’తో మాట్లాడారు. మూడేళ్ల క్రితం కర్నాటక బెల్గాంకు చెందిన షౌకత్‌అలీ అనే వ్యక్తి తన రియల్ ఎస్టేట్ భాగస్వాములు భాస్కర్‌రావు, రమేష్‌ల ద్వారా పరిచయం అయ్యాడని, తనకు తెలిసిన వ్యక్తి వద్ద రైస్‌పుల్లింగ్ కాయిన్ ఉందని, దాని వల్ల ధనలక్ష్మి తాండవిస్తుందని చెప్పడమే కాకుండా పలు పూజలు కూడా చేయించాడని వెల్లడించారు. ఆయనను నమ్మి తాను రూ.10 వేల కోట్ల వస్తాయని ఆశతో ఆదాయపు పన్ను శాఖాధికారులకు సెప్టెంబర్‌లో లేఖ రాసినట్లు వెల్లడించారు. తన వద్ద 10 వేల కోట్లు ఉన్నాయని ఐడీఎస్ కింద దరఖాస్తు చేసుకున్నానని పేర్కొన్నారు. ఈ విషయంలో మొదటి విడత కట్టేం దుకు ప్రయత్నించగా చిల్లిగవ్వ కూడా దొరకలేదని ఈ లోపు న ఐటీ అధికారులు ఇంటిపై దాడి చేశారని, వారికి ఇదే విషయాన్ని వెల్లడించడం జరిగిందన్నారు. తాను షౌకత్‌అలీని నమ్మి మోసపోరుున విషయాన్ని ఆధారాలతో సహా చూపి ంచానని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం నుంచి షౌకత్‌అలీ రైస్‌పుల్లింగ్ యంత్రం తెస్తానంటూ రూ. 60 లక్షల వరకు వసూ లు చేశాడని, ఉన్నవన్నీ అమ్ముకొని అప్పు తెచ్చి ఈ మొత్తాన్ని ఇచ్చానని పేర్కొన్నాడు. షౌకత్‌అలీ తనను చీటింగ్ చేసిన విషయాన్ని ఐటీ అధికారులతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం చేయాలని కోరారు. కట్టు కథేనా.? 10 వేల కోట్ల ఐడీఎస్ కింద ప్రకటించి ఐటీ అధికారులకు చుక్కలు చూపించిన ఫిలింనగర్ సైట్-2 నివాసి బానాపురం లక్ష్మణ్‌రావు చెప్పిందంతా కట్టు కథేనని పోలీసులు భావిస్తున్నారు. పక్కా పథకం ప్రకారం ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును ఉన్నది ఉన్నట్టు ఐటీ అధికారులకు చదివి వినిపించాడని అనుమానిస్తున్నారు. లక్ష్మణ్‌రావు వెనుకాల ఓ బడాబాబు ఉండి ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపడితే అన్ని విషయాలు బయటలకు వస్తాయని భావిస్తున్నారు. -
బోగస్ ’ఐడీఎస్’ లక్ష్మణరావు మోసపోయాడట!
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంలో (ఐడీఎస్) రూ.10 వేల కోట్లు నల్లధనం తన వద్ద ఉన్నట్లు డిక్లేర్ చేసి, పన్ను చెల్లింపు దగ్గరకు వచ్చేసరికి ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారుల్ని ముప్పతిప్పలు పెట్టిన బాణాపురం లక్ష్మణరావు వెనుక ఉన్న బడాబాబులు’ వెలుగులోకి రానట్లేనా..? ఔననే అనుమానాలు కలుగుతున్నాయి. సాక్షాత్తు ఐటీ అధికారులే ఇతడు మోసపోయినట్లు’ నిర్థారించడమే దీనికి కారణం. ఈ మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు (సీసీఎస్) గురువారం లేఖ రాసిన ఐటీ విభాగం.. లక్ష్మణరావును మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. ఈ లేఖను అనధికారంగా తిరస్కరించిన సీసీఎస్ పోలీసులు బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. ఐటీ అధికారుల నుంచి తమకు లేఖ అందిందని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి సాక్షి’కి తెలిపారు. (ఆ 10 వేల కోట్లు బోగస్!) ఐడీఎస్ పథకం కింద సెప్టెంబర్ ఆఖరు వరకు దేశ వ్యాప్తంగా ప్రకటించిన భారీ మొత్తాల్లో నగరం నుంచి డిక్లేర్ చేసిన రూ.10 వేల కోట్లు కూడా ఉంది. దీనిపై అప్పట్లో కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాయి. అయినప్పటికీ రెండు నెలల వరకు రూ.10 వేల కోట్లు డిక్లేర్ చేసింది ఎవరనేది ఐటీ అధికారులు బయటకు చెప్పలేదు. సెప్టెంబర్ 30 వరకు డిక్లేర్ చేసిన మొత్తానికి సంబంధించి నల్లబాబులు’ పన్ను/సర్‌చార్జ్‌ల్ని మూడు విడతల్లో 2017 మార్చి నాటికి చెల్లించాల్సి ఉంది. మొదటి వాయిదా అయిన రూ.1125 కోట్లు చెల్లించలేక చేతులెత్తేయడంతోనే లక్ష్మణరావు పేరు వెలుగులోకి వచ్చింది. ఫిల్మ్‌నగర్‌లోని అతడి ఇంటితో పాటు మరో ఇద్దరి ఇళ్ళపై దాడులు చేసి ఐటీ అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టారు’. మోసపోయినట్లు అనధికారిక నిర్థారణ... సోదాల నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయిన ఐటీ అధికారులు లక్ష్మణరావును విచారించారు. (బాణాపురం లక్ష్మణ్‌రావు ఇంట్లో చిల్లి గవ్వ కూడా దొరకలేదు) ఈ నేపథ్యంలోనే ఇతడు తాను ఓ బాబాతో పాటు మరికొందరి మాటలు నమ్మానంటూ ఐటీ అధికారులకు సినిమా చూపించాడు. రైల్ పుల్లింగ్ కాయిన్స్/బౌల్స్‌ను సేకరించి ఇస్తానని చెప్పిన ఓ బాబా మాటలు నమ్మానంటూ చెప్పుకొచ్చాడు. వాటిని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడం ద్వారా రూ.10 వేల కోట్లు సంపాదించవచ్చంటూ వారు చెప్పిన నేపథ్యంలోనే ఆ మేరకు డిక్లేర్ చేశానంటూ ఐటీ అధికారులకు తెలిపాడు. దీన్ని గుడ్డిగా నమ్మిన ఐటీ అధికారులు సదరు బాబా ఎవరు? వీరికి దళారులుగా వ్యవహరించింది ఎవరు? తదితర అంశాలను గుర్తించేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేయలేదు. ఆర్థిక చట్ట ప్రకారం ఇలాంటి బోగస్ డిక్లరేషన్ చేసిన వారిపై కేసు నమోదు చేసి, ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉన్నా... ఇప్పటి వరకు అలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కేవలం లక్ష్మణరావు చెప్పిన మాటల్నే పరిగణలోకి తీసుకున్న ఐటీ అధికారులు అతడు మోసపోయినట్లు అనధికారంగా నిర్థారించేశారు. సీసీఎస్‌లు లేఖ రాసిన ఐటీ... లక్ష్మణరావు వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేయడం, అతడిపై ఆర్థిక చట్టం కింద కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయడాన్ని పక్కన పెట్టిన ఐటీ అధికారులు అతడి పైనే సానుభూతి చూపడం ప్రారంభించారు. రైస్ పుల్లింగ్ సహా ఇతర పేర్లతో లక్ష్మణరావును మోసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏకంగా సీసీఎస్ పోలీసులకు లేఖ రాశారు. ఈ లేఖను చూసి అవాక్కైన అధికారులు బాధితుడు కాకుండా మూడో వ్యక్తి/సంస్థ రాసిన లేఖను ఫిర్యాదుగా స్వీకరించలేమని ఐటీ అధికారులకు స్పష్టం చేశారు. లక్ష్మణరావు మోసం చేశాడని భావిస్తే అతడిపై ఫిర్యాదు చేయాలని, మోసపోయాడనే అభిప్రాయం ఉంటే నేరుగా వచ్చి ఫిర్యాదు చేసేలా సూచించాలని స్పష్టం చేశారు. బాధితుడే వచ్చి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రాథమిక ఆధారాలు సమర్పిస్తేనే తదుపరి చర్యలు తీసుకోగలమని ఐటీ అధికారులకు చెప్పారు. దీంతో చేసేది లేక ఐటీ అధికారులు తిరిగి వెళ్ళినట్లు సమాచారం. ‘బడాబాబులకు’ బినామీ..! ఐడీఎస్ లక్ష్మణరావు పేరు వెలుగులోకి వచ్చిన తొలి రోజునే అనేక కథనాలు బయటకు వచ్చాయి. కొందరు ‘బడాబాబులకు’ ఇతడు బినామీ అని, వారి నల్లధనాన్నే మార్చేందుకు తనకు చెందినదిగా డిక్లేర్ చేశారని వినిపించింది. అయితే సెప్టెంబర్ 30తో ఐడీఎస్ స్కీమ్ ముగియగా... నవంబర్ 8న డీమానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో సదరు బడాబాబుల’ అంచనాలు తారుమారైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పన్ను కట్టలేక లక్ష్మణరావును చేతులెత్తేయమని చెప్పారని తెలిసింది. అతడికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సహకరిస్తామంటూ హామీ సైతం ఇచ్చినట్లు సమాచారం. లక్ష్మణరావుకు సంబంధించి వినిపిస్తున్న కథనాలు, అతడి గత చరిత్రను పరిగణలోకి తీసుకోని ఐటీ అధికారులు కొత్త పల్లవి అందుకున్నారు. ఓ బాబాతో పాటు కొందరి చేతిలో లక్ష్మణరావు మోసపోయాడని, వారి మాటలు నమ్మి రూ.లక్షల్లో పోగొట్టుకున్నాడటం సానుభూతి చూపించడం ప్రారంభించారు. లక్ష్మణరావు కథలో ఐటీ విభాగం నుంచి ఈ ట్విస్ట్ రావడానికి బడాబాబులు’ తీసుకువచ్చిన ఒత్తిడే కారణమని తెలుస్తోంది. నిందితుడిగా చేర్చాల్సిన వ్యక్తిని బాధితుడిగా మార్చడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
'నల్లబాబు' ట్విస్ట్: ఆ 10 వేల కోట్లు బోగస్!
-
ఆ 10 వేల కోట్లు బోగస్!
- ఐడీఎస్ కింద వేల కోట్లు ఉన్నట్టు వెల్లడించిన హైదరాబాదీ లక్ష్మణ్‌రావు - మొదటి వాయిదా చెల్లించకపోవడంతో ఐటీ దాడులు - ఫిల్మ్‌నగర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు - లక్ష్మణ్‌రావు సీఏ నివాసంపైనా దాడి.. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం సాక్షి, హైదరాబాద్: గుజరాత్లో మహేశ్ షా అనే బడా వ్యాపారి స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) కింద రూ.13,860 కోట్లు ప్రకటించి కేంద్రానికి కట్టాల్సిన వారుుదా దగ్గరికి వచ్చేసరికి చేతులెత్తేసిన తరహాలోనే హైదరాబాద్‌లో ఓ ఉదంతం వెలుగుచూసిం ది. నగరం నుంచి ఐడీఎస్ కింద రూ.9,800 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఓ వ్యక్తి చేసిన సంచలన ప్రకటన కూడా బోగస్ అని తేలింది. ఇంతకాలం ఆ వ్యక్తి ఎవరన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరిగాయి. అయితే సదరు వ్యక్తి ఐడీఎస్ కింద ప్రభుత్వానికి కట్టాల్సిన తొలి వాయిదాను చెల్లించకపోవడంతో ఆదాయ పన్నుశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఫిల్మ్‌నగర్‌లోని ఆ వ్యక్తి ఇంటిపై మంగళవారం సాయంత్రం ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. ఏడు గంటలపాటు సోదాలు జరిపి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి పేరు బాణాపురం లక్ష్మణ్‌రావు అని ఐటీ దాడులతో వెల్లడైంది. అతనికి చార్టెడ్ అకౌంటెంట్‌గా ఉన్న లక్ష్మినారాయణ ఇంటిపై సైతం ఐటీ దాడులు జరిగారుు. ఐడీఎస్ కింద లక్ష్మినారాయణ సైతం రూ.200 కోట్ల ఆస్తులను వెల్లడించారు. ఏడు కంపెనీలు ఉన్నట్టు గుర్తింపు.. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. లక్ష్మణ్‌రావు ఐడీఎస్ కింద ప్రకటించిన ఆస్తుల్లో నిబంధనల మేరకు 45 శాతాన్ని పలు వాయిదాల్లో ఆదాయ పన్నుశాఖకు చెల్లించాల్సి ఉంది. అయితే తొలి వాయిదా చెల్లించకుండా చేతులెత్తేయడంతో ఐటీ శాఖ ఆయనపై విచారణ చేపట్టింది. లక్ష్మణరావు వద్ద నిజంగానే రూ.9,800 కోట్ల ఆస్తులున్నాయా? ఆ మేరకు ఆస్తులు లేకున్నా ఉన్నట్లు వెల్లడించారా? లేక ఇతరులకు బీనామీగా ఈ ఆస్తులను ప్రకటిచారా? అన్న అంశాలపై ఐటీ శాఖ లోతుగా దర్యాప్తు చేస్తోంది. లక్ష్మణ్‌రావు ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు వెళుతున్న ఐటీ అధికారులు లక్ష్మణ్‌రావు సమీప బంధువు రమాదేవి పేరిట ఫిల్మ్‌నగర్‌లోని చిరునామాతో ఏడు కంపెనీలు రిజిస్టరైనట్టు గుర్తించినట్లు సమాచారం. ఇందులో లక్ష్మణ్‌రావుతో పాటు ఆయన భార్య, కొడుకులు ప్రమోద్, వెంకటేశ్, సంతోష్‌లు డెరైక్టర్లుగా ఉన్నారని సమాచారం. రూ.లక్ష క్యాపిటల్‌తో ఈ కంపెనీలను రిజిస్టర్ చేసినట్లు వెల్లడైంది. ఈ కంపెనీల్లో అధిక శాతం 2014 జూలైలోనే రిజిస్టరయ్యాయి. ఓ ప్రముఖ వ్యక్తికి బినామీగా లక్ష్మణ్‌రావు ఐడీఎస్ కింద రూ.9,800 కోట్ల ఆస్తులు ప్రకటించినట్లు చర్చ జరుగుతోంది. ఇవే ఆ కంపెనీలు 2014 జూలై 21న బీఎల్ఆర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, అదే నెల 9న బీఎల్ఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, బీఎల్ఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, 3న బీఎల్ఆర్ పవర్ ప్రాజెక్ట్, 11న బీఎల్ఆర్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్, 2013 జనవరి 9న బీఎల్ఆర్ పవర్ ప్రాజెక్ట్స్, 2008 మే 13న బీఎల్ఆర్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టరై ఉన్నాయి. లక్ష్మణ్‌రావు వ్యాపార, పారిశ్రామిక రంగాలతోపాటు భవన నిర్మాణ రంగంలోనూ ఉన్నట్లు ఈ పత్రాల ద్వారా స్పష్టమవుతున్నది. ఈ సోదాల విషయంలో ఆదాయ పన్ను శాఖ ఇంకా అధికారికంగా స్పందించలేదు. -
ఫిరాయింపులపై 19 నుంచి సెమినార్లు
మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వెల్లడి గాంధీనగర్ (విజయవాడ): ‘పార్టీ ఫిరాయింపులు- ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై ఈనెల 19 నుంచి జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో సెమినార్లు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 19న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య భవన్లో సెమినార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సెమినార్‌కు సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి హాజరవుతారని తెలిపారు. జూన్ 26న విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో జరిగే సెమినార్‌కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇ.ఎ.ఎస్.శర్మ, జూలై 3న తిరుపతిలోని ఉదయ్ ఇంటర్నేషనల్‌లో జరిగే సెమినార్లో మాజీ స్పీకర్ ఆగరాల ఈశ్వరరెడ్డి, జూలై 31న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే సెమినార్లో లా కమిషన్ మాజీ చైర్మన్ బీపీ జీవన్‌రెడ్డి పాల్గొంటార ని చెప్పారు. సెమినార్లో వచ్చిన వ్యాసాల సంపుటిని జూలై 31న కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ఆవిష్కరిస్తారని తెలిపారు. ప్రజాస్వామ్యవాదులు సెమినార్లలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విలువలకు పాతరేస్తున్న ఫిరాయింపులు: వి.లక్ష్మణరెడ్డి రాజకీయ విలువలకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు పార్టీ ఫిరాయింపులు పాతరేస్తున్నాయని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులను రాజకీయ వ్యభిచారంగా అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని ఆయన ఖండించారు. -
ఉద్యమంలో ఉద్యోగుల పాత్రే కీలకం
కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్ృలెన్ : తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ , ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని, రాష్ట్ర పునర్నిర్మాణంలో సైతం ఉద్యోగుల పాత్ర కీలకం కావాలని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో 2014 సంవత్సరం డైరీ, క్యాలెండర్‌ను నారదాసు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ... సంపూర్ణ తెలంగాణ సాధించేవరకూ ఉద్యోగులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు సీమాంధ్ర నేతల ఎత్తుగడలను ఛేదించి లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకూ సంయమనం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమళ్ల అంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి వంగపెల్లి రాజేశ్వర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.రత్నాకర్‌రెడ్డి, నీలం శ్రీనివాస్, కళ్లెం వాసుదేవరెడ్డి, సతీశ్, చంద్రశేఖర్, కె.గంగాధర్, సుధాకర్, రమేశ్, వెంకట్‌రెడ్డి, సుమలత, నీరజ, విజయ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నక్సలైట్లు వద్దంటే.. వద్దు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ‘నక్సలైట్లు మా గ్రామాలకు రావద్దు....’ అంటూ జిల్లా పోలీసు యంత్రాంగం మళ్లీ పాత పిలుపు అందుకుంది. ఈ సారి కొత్తగా మావోయిస్టు పార్టీ చీఫ్ గణపతి ఉరఫ్ ముప్పాళ లక్ష్మణ్‌రావు స్వగ్రామాన్ని ప్రారంభ వేదికగా ఎంచుకుంది. ఈ నెల 23న జిల్లాలోని సారంగపూర్ మండలం బీర్పూర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఎస్పీ శివకుమార్ ప్రత్యేక చొరవతో పోలీసు యంత్రాంగం సంబంధిత కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా తొలిరోజున బీర్పూర్లో ‘నక్సలైట్లు రావద్దు...’ అంటూ గ్రామస్తులతో నిరసన దీక్షలు చేయించనున్నారు. అనంతరం అదే గ్రామంలోని ప్రధాన వీధుల్లో దాదాపు మూడు కిలోమీటర్లు శాంతి ర్యాలీ నిర్వహిస్తారు. ఎనిమిదేళ్ల కిందట ఈ గ్రామ పొలిమేరల్లో పోలీసు యంత్రాంగం నిర్మించిన శాంతి స్తూపం నుంచి ఈ ర్యాలీని ప్రారంభిస్తారు. నక్సలైట్లు అజ్ఞాతం వీడి ఇంటి బాట పట్టాలని.. ఆలోచనలో మార్పు రావాలని... అభివృద్ధి, శాంతి దృక్పథంతో జనజీవనంలోకి రావాలని.. అభివృద్ధికి పాటుపడాలని ప్రత్యేక నినాదాలతో ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసి.. వారితో సమావేశం కానున్నారు. మావోయిస్టులు ఊళ్లోకి రాకుండా కాపలా కాసేందుకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. అదే రోజు సాయంత్రం పోలీసు అధికారులు ప్రత్యేకంగా గ్రామసభ నిర్వహిస్తారు. శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించటంతోపాటు సాంఘిక దురాచారాలను రూపుమాపటం.. అక్కడి ప్రజల ఇబ్బందులు, గ్రామంలో మౌలిక సదుపాయాలను సభలో చర్చిస్తారు. ఆ రోజు రాత్రి... పోలీసు అధికారులు బీర్‌పూర్‌లోనే బస చేస్తారు. ఈ కార్యక్రమానికి మార్పు లేదా ఇంటి బాట అని పేరు పెట్టాలని యోచిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో అజ్ఞాతంలో ఉన్న జిల్లాకు చెందిన నక్సలైట్ల వివరాలన్నీ పోలీసు యంత్రాంగం ఇప్పటికే సేకరించింది. ముందుగా మావోయిస్టు కీలక నేతల గ్రామాలను ఎంచుకొని.. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. అదే వరుసలో నక్సలైట్ ప్రభావిత గ్రామాలకు విస్తరిస్తారు. గతంలో నక్సలైట్ల కార్యకలాపాలు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు లొంగుబాట.. జనజీవన స్రవంతి పేరుతో పోలీసు యంత్రాంగం వరుసగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టింది. కల్లోలిత ప్రాంతాల్లోనూ పోలీసు కళాకారులృబందాలతో పల్లె పల్లెకు వెళ్లింది. అయిదేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో నక్సలైట్ల కార్యకలాపాలు వేళ్లపై లెక్కించే స్థాయికి తగ్గిపోయాయి. ఈ సమయంలో కరీంనగర్ పోలీసు విభాగం ఎంచుకున్న కొత్త కార్యక్రమం.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సమీకృత కార్యాచరణ ప్రణాళిక (ఐఏపీ) నిధులను మరింతగా రాబట్టడం.. నక్సలైట్ ప్రభావిత జిల్లాల్లో ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నట్లుగా ప్రచారం చేసుకోవటానికేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.