సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ‘నక్సలైట్లు మా గ్రామాలకు రావద్దు....’ అంటూ జిల్లా పోలీసు యంత్రాంగం మళ్లీ పాత పిలుపు అందుకుంది. ఈ సారి కొత్తగా మావోయిస్టు పార్టీ చీఫ్ గణపతి ఉరఫ్ ముప్పాళ లక్ష్మణ్‌రావు స్వగ్రామాన్ని ప్రారంభ వేదికగా ఎంచుకుంది. ఈ నెల 23న జిల్లాలోని సారంగపూర్ మండలం బీర్‌పూర్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
ఎస్పీ శివకుమార్ ప్రత్యేక చొరవతో పోలీసు యంత్రాంగం సంబంధిత కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా తొలిరోజున బీర్‌పూర్‌లో ‘నక్సలైట్లు రావద్దు...’ అంటూ గ్రామస్తులతో నిరసన దీక్షలు చేయించనున్నారు. అనంతరం అదే గ్రామంలోని ప్రధాన వీధుల్లో దాదాపు మూడు కిలోమీటర్లు శాంతి ర్యాలీ నిర్వహిస్తారు. ఎనిమిదేళ్ల కిందట ఈ గ్రామ పొలిమేరల్లో పోలీసు యంత్రాంగం నిర్మించిన శాంతి స్తూపం నుంచి ఈ ర్యాలీని ప్రారంభిస్తారు.
నక్సలైట్లు అజ్ఞాతం వీడి ఇంటి బాట పట్టాలని.. ఆలోచనలో మార్పు రావాలని... అభివృద్ధి, శాంతి దృక్పథంతో జనజీవనంలోకి రావాలని.. అభివృద్ధికి పాటుపడాలని ప్రత్యేక నినాదాలతో ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసి.. వారితో సమావేశం కానున్నారు. మావోయిస్టులు ఊళ్లోకి రాకుండా కాపలా కాసేందుకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. అదే రోజు సాయంత్రం పోలీసు అధికారులు ప్రత్యేకంగా గ్రామసభ నిర్వహిస్తారు. శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించటంతోపాటు సాంఘిక దురాచారాలను రూపుమాపటం.. అక్కడి ప్రజల ఇబ్బందులు, గ్రామంలో మౌలిక సదుపాయాలను సభలో చర్చిస్తారు. ఆ రోజు రాత్రి... పోలీసు అధికారులు బీర్‌పూర్‌లోనే బస చేస్తారు. ఈ కార్యక్రమానికి మార్పు లేదా ఇంటి బాట అని పేరు పెట్టాలని యోచిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో అజ్ఞాతంలో ఉన్న జిల్లాకు చెందిన నక్సలైట్ల వివరాలన్నీ పోలీసు యంత్రాంగం ఇప్పటికే సేకరించింది. ముందుగా మావోయిస్టు కీలక నేతల గ్రామాలను ఎంచుకొని.. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. అదే వరుసలో నక్సలైట్ ప్రభావిత గ్రామాలకు విస్తరిస్తారు.
గతంలో నక్సలైట్ల కార్యకలాపాలు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు లొంగుబాట.. జనజీవన స్రవంతి పేరుతో పోలీసు యంత్రాంగం వరుసగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టింది. కల్లోలిత ప్రాంతాల్లోనూ పోలీసు కళాకారులృబందాలతో పల్లె పల్లెకు వెళ్లింది. అయిదేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో నక్సలైట్ల కార్యకలాపాలు వేళ్లపై లెక్కించే స్థాయికి తగ్గిపోయాయి. ఈ సమయంలో కరీంనగర్ పోలీసు విభాగం ఎంచుకున్న కొత్త కార్యక్రమం.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సమీకృత కార్యాచరణ ప్రణాళిక (ఐఏపీ) నిధులను మరింతగా రాబట్టడం.. నక్సలైట్ ప్రభావిత జిల్లాల్లో ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నట్లుగా ప్రచారం చేసుకోవటానికేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నక్సలైట్లు వద్దంటే.. వద్దు
Published Sat, Dec 21 2013 3:28 AM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM
Advertisement