వారంతా తెలంగాణ బిడ్డలే
సభ్యత్వ నమోదును ప్రారంభిస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి
రామచంద్రాపురం: వలస వచ్చి స్థిరపడ్డ వారంతా తెలంగాణ బిడ్డలేనని, వారికి తాము అండగా ఉంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహీపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పేదల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అమలు చేయడం జరిగిందన్నారు.
సీఎం కేసీఆర్ హామీ మేరకు ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు. గ్రామాలను పచ్చని పల్లెలుగా తీర్చిదిద్దేందుకు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. రాబోయే కాలంలో విద్యుత్‌ృసమస్య లేకుండా కృషి చేస్తామన్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ పథకాలను కాపీ కొడుతున్న బాబు
తెలంగాణ సీఎం కేసీఆర్ అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను ఏపీ సీఎం చంద్రబాబు కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి మహేందర్‌రెడ్డి ఆరోపించారు. ఆంధ్రా కంటే తెలంగాణలో వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. రాష్ట్రంలో రూ.150 కోట్లతో 500 కొత్త బస్సులను తీసుకోవడం జరిగిందన్నారు. మిషన్ కాకతీయ పేరిట 46 వేల చెరువులను అభివృద్ధి పరిచేందుకు రూ.24 వేల కోట్లను కేటాయించడం హర్షదాయకమన్నారు.
ఈ పథకం వల్ల చెరువులు నిండి పల్లెలు పూర్వ వైభవాన్ని చాటుకుంటాయన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, పార్టీ జీహెచ్‌ఎంసీ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు, ఎంపీపీలు యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు రాములుగౌడ్, సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి సోమిరెడ్డి, మాజీ కార్పొరేటర్ పుష్ప, నాయకులు వెంకటేశంగౌడ్, బాల్‌రెడ్డి, చంద్రారెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, తొంట అంజయ్య, నగేష్ యాదవ్, వి.మోహన్‌రెడ్డి, శ్రీధర్‌చారి, పరమేశ్, అన్వర్ పటేల్, అబ్బు అలీ పాల్గొన్నారు.