
వడ్డెర్ల సమస్యల పరిష్కారానికి కృషి
వడ్డెర కులస్తుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నెరవేర్చేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి హామీనిచ్చారు.
అఖిల భారత వడ్డెర సంఘం మహాసభలో మంత్రి మహేందర్‌రెడ్డి
హైదరాబాద్ : వడ్డెర కులస్తుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నెరవేర్చేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి హామీనిచ్చారు. హైదరాబాద్‌లోని మియపూర్ న్యూకాలనీ సంత ప్రాంగణంలో ఆదివారం జరిగిన అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం మహాసభలో మంత్రి మాట్లాడారు. అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.
పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం కింద సన్న బియ్యాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఇళ్లులేనివారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లను కట్టించి త్వరలోనే అందించనున్నట్లు తెలిపారు. సంఘం అధ్యక్షుడు వేముల లక్ష్మణ్ మాట్లాడుతూ తాజ్‌మహల్, కోణార్క్ దేవాలయం, ప్రాజెక్టులు వంటి అనేక ప్రఖ్యాత నిర్మాణాలకు వడ్డెర్ల సేవలు వినియోగించుకున్నారే తప్ప వారి బాగోగులను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డెర్లు ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా పూర్తిగా వెనుకబడ్డారన్నారు.
ఎంతమంది పాలకులు వచ్చినా తమ బాగోగులను పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు తమ పాలిట శాపంగా పరిణమించాయన్నారు. వడ్డెర్లకు వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కనీసం పది సీట్లు ఇవ్వాలని అధికారపార్టీకి విజ్ఞప్తి చేశారు. వడ్డెర కులాన్ని ఎస్సీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సంఘం గౌరవ అధ్యక్షుడు నారాయణ స్వామి, ప్రధానకార్యదర్శి గుంజ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు దండుగుల మైసయ్య, మహిళా అధ్యక్షురాలు తిరుమలదేవి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైసయ్య, నాయకులు టి.నారాయణస్వామి, మంజుల మారయ్య, మంజుల హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.