
నిర్లక్ష్యమే ముంచింది
►ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కర్ణాటక బస్సు
►నలుగురి మృతి.. 15మందికి తీవ్ర గాయాలు
►మృతుల్లో తల్లీబిడ్డ, మహిళ, ఓ బాలుడు
►డ్రైవర్ గుట్కా అలవాటు వల్లే ప్రమాదం
►బాధితులను ఆదుకుంటాం: మంత్రి మహేందర్‌రెడ్డి
మహబూబ్‌నగర్ క్రైం : ఆర్టీసీ బస్సును కర్టాటకకు చెందిన ఓ బస్సు ఢీకొనడంతో నలుగురు మృత్యువాతపడ్డారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం మహబూబ్‌నగర్ మండలం ధర్మాపూర్ సమీపంలోని జేపీఎన్‌సీఈ కళాశాల వద్ద చోటుచేసుకుంది. హైదారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దెబస్సు కర్ణాటకలోని రాయిచూర్ నుంచి ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లింది. మార్గమధ్యంలో మరికల్ స్టేజీ వద్ద ఊట్కూర్ మండలం పులిమామిడి గ్రామానికి చెందిన సుంకరి బాలమ్మ(28), తన కొడుకు(నాలుగు నెలలు) అజయ్‌తో కలిసి బస్సు ఎక్కింది.
మరికల్‌కు చెందిన విద్యార్థి సోహైల్(14)జిల్లా కేంద్రానికి రావడానికి బస్సులో ప్రయాణమయ్యారు. వీరితో పాటు మక్తల్‌కు చెందిన మరికొందరు కూడా అందులో ఎక్కారు. ధర్మాపూర్ గ్రామశివారులోని జేపీఎన్‌ఎస్ కళాశాల సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన కర్ణాటక బస్సును డ్రైవర్ అత్యంత నిర్లక్ష్యంగా నడుపుతూ ఢీకొట్టాడు. బస్సులో ఉన్న బాలమ్మతో పాటు కొడుకు అజయ్, సోహైల్, హసీనాబేగం(45) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే సంఘటనస్థలంలో ప్రాణాలు విడిచారు. వీరిలో జిల్లా కేంద్రంలోని ధనలక్ష్మినగర్ కాలనీకి చెందిన సాయబన్న కుడిచేయి పూర్తిగా విరిగి రోడ్డుపై పడింది. అతడితో పాటు మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్‌గౌడ్, డీఎస్పీ కృష్ణమూర్తి సంఘటనస్థలాన్ని సందర్శించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్‌గౌడ్ పోలీసులను ఆదేశించారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమించడంతో చికిత్సకోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కర్ణాటక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే..
కర్ణాటక బస్సు డ్రైవర్ గుట్కా వేసుకుని బస్సు నడుపుతున్నాడు. సంఘటన సమీపంలోకి రాగానే బస్సు అద్దాల నుంచి గుట్కా ఉమ్మేస్తుండగానే బస్సుపూర్తిగా కుడివైపు మళ్లి.. ఎదురుగా వస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ గుట్కా వల్లే నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 14మంది క్షతగాత్రులుగా మారారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కర్ణాటకకు చెందిన డ్రైవర్లు ఎక్కువగా గుట్కా, తంబాకు, పాన్ మసాలాలు తింటూ ఇటువంటి ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలుస్తున్నది.
బాధితకుటుంబాలకు పరిహారం
విషయం తెలుసుకున్న రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్‌గౌడ్, అ డిషనల్ ఎస్పీ మల్లారెడ్డి జిల్లా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. మృతి చెందిన నలుగురి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వీరితోపాటు క్షతగాత్రులకు రూ.ఐదువేలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
15ఏళ్లకే నూరేళ్లు
ధన్వాడ: చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కు టుంబంలో విషాదం నిండింది. మండలంలోని మరికల్‌కు చెందిన బాబా, గౌషియాకు కొడుకు, కూతురు ఉన్నారు. వీరి ది పేద కుంటుంబం కావడంతో తండ్రి బాబా సైకిల్ ట్యాక్సీని నిర్వహిస్తూ కుం టుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. సోహైల్(15)ఆర్టీసీ బస్సులో మహబూబ్‌నగర్‌కు వెళ్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఒక్కగానొక కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడు సోహైల్ స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
మక్తల్: అమ్మ అనే పిలుపునకు దూరమయ్యారు ఆ చిన్నారులు. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ చిన్నారుల రోదన గుండెల్ని పిండేసింది. ఊట్కూర్ మండలం పులిమామిడి గ్రామానికి చెందిన బాలమ్మ(35) జిల్లాకేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స కోసం ఇంటి నుంచి ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. ధర్మాపూర్ సమీపంలో క ర్టాటక బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో బాలమ్మతోపాటు తన నాలుగు నెలల కొడుకు అజయ్ చనిపోయారు. విషయం తెలుసుకున్న బాలమ్మ అత్త అనంతమ్మ, భర్త రాజు సంఘటనాస్థలానికి చేరుకొని బోరున విలపించారు. తల్లితో పాటు తమ్ముడి మృతితో లావణ్య, కావేరి, హారిక రోదనలు చూపరులను కంటతడిపెట్టించాయి. ‘అమ్మా.. అమ్మా ఇంటికి ఎప్పుడు వస్తావమ్మా..’ అని విలపిస్తుండగా అక్కడున్నవారు కంటతడిపెట్టారు.