దౌడ్ రెడీ..‘మినీ’ ఏదీ?
సిటీబ్యూరో: మెట్రో రైలు దూసుకొస్తోంది. ఎట్టకేలకు ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేవిధంగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. నాగోల్ నుంచి అమీర్‌పేట్ వరకు, మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వరకు మొదటి దశ రైళ్లను పట్టాలెక్కించాలనేది హెచ్‌ఎంఆర్ ప్రతిపాదన. కానీ మెట్రో రైలు మార్గాలకు అనుగుణంగా బస్సులు నడిపేందుకు ఇప్పటి వరకు ఆర్టీసీ ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేయలేదు. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చే నాటికి కాలనీల నుంచి ప్రయాణికులకు మెట్రో స్టేషన్‌లకు తరలించేందుకు 100 మినీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. కానీ ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు పడలేదు. మరోవైపు మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీల్లో ఉమ్మడి టిక్కెట్ వ్యవస్థపైనా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. స్మార్ట్ కార్డు ద్వారా ప్రయాణికులు ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లలో పయనించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే అంశంపై కదలిక లేదు.
జాడలేని మినీ బస్సులు.....
మెట్రో రాక గ్రేటర్ ఆర్టీసీకి అతి పెద్ద సవాల్‌గా మారనుంది. ఇప్పటికే రోజుకు సుమారు రూ.96 లక్షల చొప్పున రూ.289 కోట్లకు పైగా ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్న ఆర్టీసీకి ప్రయాణికుల ఉత్పత్తి మార్గాలుగా భావించే ప్రధాన కారిడార్‌లలోనే మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రోకు అనుగుణమైన రవాణా సదుపాయాన్ని అందజేయడమే ఆర్టీసీ ముందున్న కర్తవ్యం. ప్రస్తుతం సిటీబస్సుల్లో ప్రతి రోజు 33 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో రైళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సుమారు 16 లక్షల మందికి పైగా ప్రయాణికులు మెట్రోవైపు వెళ్లనున్నారు. ఎల్‌బీనగర్–హైటెక్‌సిటీ, దిల్‌సుఖ్‌నగర్–పటాన్‌చెరు, కోఠీ–బీహెచ్‌ఈఎల్, ఉప్పల్– మియాపూర్, కేపీహెచ్‌బీ–సికింద్రాబాద్ వంటి అత్యధిక ఆదాయ మార్గాల్లోనే మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్న దృష్ట్యా తక్షణమే ఆర్టీసీ భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధం కావలసి ఉంది. ఈ క్రమంలో మెట్రో మార్గాలకు రెండు వైపులా ఉండే కాలనీల నుంచి ప్రయాణికులను చేరవేసేందుకు 100 మినీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ప్రకటించి ఏడాది దాటింది. కానీ ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు.
మినీయే బెటర్...
మొదటి దశలో నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ.), మియాపూర్–అమీర్‌పేట్ (13 కి.మీ.)మార్గాల్లో మెట్రో రైలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ రెండు లైన్‌లలో మెట్రో రైలుకు ప్రయాణికులను అందజేసే ఫీడింగ్ రూట్‌ల (అనుసంధాన మార్గాల)పై ఆర్టీసీ దృష్టిసారించవలసి ఉంది. నాగోల్–మెట్టుగూడ మార్గానికి రెండు వైపులా ఉన్న కాలనీలు, ఉద్యోగులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు తదితర వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాల నుంచి ప్రయాణికులను మెట్రో రైలు స్టేషన్లకు చేరవేడయంలో ఈ ఫీడింగ్ రూట్స్ దోహదం చేస్తాయి. ఈ రెండు మార్గాల్లో వచ్చే ప్రతి మెట్రో స్టేషన్‌ను దృష్టిలో ఉంచుకొని ఆ స్టేషన్ చుట్టుపక్కల కాలనీల నుంచి ప్రయాణికులను మెట్రోకు తరలిస్తారు. దీంతో ఇప్పటి వరకు సిటీ బస్సు అందుబాటులో లేని కాలనీలకు, 40 ఫీట్ల రోడ్డు సదుపాయం ఉన్న ప్రాంతాలకు మినీ బస్సులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
ప్రత్యామ్నాయ పరుగులు...
ఇలా ఉండగా, ప్రధాన కారిడార్‌లలోకి మెట్రో రైలు ప్రవేశిస్తున్నందున పొరుగు జిల్లాలకు, హెచ్‌ఎండీఏ పరిధిలోని శివారు ప్రాంతాలకు సిటీ సర్వీసులను విస్తరించే యోచనలో ఆర్టీసీ ఉంది. ప్రస్తుతం సబర్బన్ బస్సులు మాత్రమే వెళ్తున్న రూట్లలో సిటీ లోకల్ బస్సులు తిరుగుతాయి. భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ వంటి దూర మార్గాలపై గ్రేటర్ ఆర్టీసీ దృష్టి సారించింది.
వలయాకార మార్గాల్లో..
ఫీడింగ్ రూట్స్‌తో పాటు రేడియల్ (వలయాకార) మార్గాల్లో కూడా బస్సులు నడపాల్సి ఉంది. ఒక్క మెట్రో స్టేషన్‌కే కాకుండా రెండు, మూడు మెట్రో స్టేషన్‌లకు ప్రయాణికులను తరలించేందుకు ఈ రేడియల్ రూట్స్ దోహదం చేస్తాయి.ఈ మేరకు ఉప్పల్, మియాపూర్, ఎస్సార్‌నగర్ వంటి ప్రధాన కేంద్రాల చుట్టూ ఉన్న కాలనీలు, ఎక్కువ శాతం ప్రయాణికులు రాకపోకలు సాగించే ప్రాంతాలపైన ఆర్టీసీ గతంలోనే దృష్టి సారించింది. ఏయే ప్రాంతాల నుంచి ప్రయాణికులు ప్రధాన మార్గంలోకి వస్తున్నారనే అంచనాలకు అనుగుణంగా బస్సులను ప్రవేశపెట్టాలి.
ఉప్పల్‌లోని కల్యాణపురి, ప్రశాంత్‌నగర్, బ్యాంక్‌కాలనీ వంటి ప్రాంతాలకు ప్రస్తుతం బస్సులు చాలా పరిమితంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు మెట్రో రైల్లో ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించనున్న దృష్ట్యా...ఈ కాలనీల నుంచి మెట్రోకు ప్రయాణికులను ఫీడింగ్ చేసే రవాణా వ్యవస్థగా æఆర్టీసీ సేవలందజేస్తుంది. ూ అలాగే నాగోల్ మెట్రో స్టేషన్‌కు అటు ఎల్‌బీనగర్, సాగర్‌రింగ్‌రోడ్డు, హయత్‌నగర్, బండ్లగూడ, జైపురికాలనీ, కొత్తపేట్ తదితర ప్రాంతాల్లోని కాలనీల నుంచి ప్రయాణికులను తరలిస్తారు. ూ మియాపూర్, ఎస్సార్‌నగర్‌ల చుట్టుపక్కల ఉన్న కాలనీల నుంచి కూడా ఇదే తరహాలో ఫీడింగ్‌రూట్లు, రేడియల్ రూట్లలో ప్రయాణికులను మెట్రోకు అనుసంధానం చేస్తారు. ూ ఈ రెండు మార్గాల్లో ఫీడింగ్ రూట్లు, రేడియల్ రూట్లపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.