
ఆర్టీసీకి 2 వేల కొత్త బస్సులు
* ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ విభాగం రూపురేఖలు మార్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఆర్టీసీపై దృష్టి సారించారు. సంస్థ పనితీరును మెరుగుపరిచేందుకు ఆయన చర్యలు చేపట్టారు. కాలం చెల్లిన పాత బస్సుల స్థానంలో రెండు వేల కొత్త బస్సులను సమకూర్చుకోవాలని తాజాగా నిర్ణయించారు. తొలి విడతగా రెండు మూడు నెలల్లోనే వెయ్యి కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీకి సీఎం అనుమతించారు.
ఇందులో ఆర్టీసీ సొంతంగా 500 బస్సులను కొనుగోలు చేయనుండగా, మిగతా వాటిని ప్రైవేటు నుంచి అద్దెకు తీసుకోనుంది. ఇందుకోసం రూ. 150 కోట్లను ముఖ్యమంత్రి మంజూరు చేశారు. రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులతో గురువారం రాత్రి సమావేశమైన కేసీఆర్.. ఆర్టీసీ పరిస్థితి, పనితీరుపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులు అందజేసిన పలు ప్రతిపాదనలను పరిశీలించి కొన్నింటికి అక్కడికక్కడే ఆమోదం తెలిపారు. మరికొన్నింటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
కొత్త బస్సులకు రూ.150 కోట్ల కేటాయింపుపై హర్షం
తెలంగాణలో ఆర్టీసీకి కొత్త బస్సులు కొనేందుకు ముఖ్యమంత్రి రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించటం అభినందనీయమని ఆర్టీసీ టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఆర్టీసీ కొత్త రూపును సంతరించుకుంటుందని హర్షం వ్యక్తం చేశారు.