కాంగ్రెస్‌ది అనవసర రాద్ధాంతం
♦ ప్రజాభీష్టం మేరకే కొత్త జిల్లాలు
♦ 15 జిల్లాలతో రంగారెడ్డి జిల్లా
♦ ప్రజలు కోరినందునే శంషాబాద్‌లోకి మూడు మండలాలు
♦ నిర్మాణాత్మక సూచనలు ఇవ్వకుండా విమర్శలా
♦ విపక్షాలపై మండిపడిన మహేందర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాల పునర్విభజనపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేస్తే.. దాన్ని అడ్డుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా 15 మండలాలతో ప్రతిపాదిత రంగారెడ్డి జిల్లా ఏర్పడనుందని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాలను కలిపే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. గురువారం జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేందర్‌రెడ్డి మాట్లాడారు. ప్రతిపాదిత శంషాబాద్ జిల్లాలో షాబాద్, శంకర్‌పల్లి, మొయినాబాద్ మండలాల విలీనాన్ని రాజకీయం చేస్తూ కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు నిరహార దీక్షలకు దిగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ మండలాలు శంషాబాద్‌కు అతిదగ్గరలో ఉండడం.. మెజార్టీ ప్రజల కోరిక మేరకు ఆ జిల్లాలు కలపాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు.
దివంగత ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి హయాం నుంచి వికారాబాద్ ప్రాంతానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందని, జిల్లా కేంద్రం ప్రకటనను దాటవేస్తూ గడిపిన ఆ పార్టీ ప్రస్తుతం..కేసీఆర్ సర్కారు నెరవేరుస్తుంటే జీర్ణించుకోలేక పోతుందని వ్యాఖ్యానించారు. ప్రజల్లో అపోహలు, అనుమానాలను సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు. వికారాబాద్ జిల్లా కేంద్రం అభివృద్ధికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వకుండా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం గర్హనీయమన్నారు. చేవెళ్ల జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ అర్థరహితమని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గండేడ్‌ను మహబూబ్‌నగర్ జిల్లాలో కలిపే ప్రతిపాదన ప్రభుత్వ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. కాగా, చేవెళ్లను కూడా శంషాబాద్‌లో కలపాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చిన్న జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని, ఈ నిధులతో వికారాబాద్ అభివృద్ధి చెందే అవకాశముందని మహేందర్‌రెడ్డి తెలిపారు.