district reorganisation
-
కాంగ్రెస్‌ది అనవసర రాద్ధాంతం
♦ ప్రజాభీష్టం మేరకే కొత్త జిల్లాలు ♦ 15 జిల్లాలతో రంగారెడ్డి జిల్లా ♦ ప్రజలు కోరినందునే శంషాబాద్‌లోకి మూడు మండలాలు ♦ నిర్మాణాత్మక సూచనలు ఇవ్వకుండా విమర్శలా ♦ విపక్షాలపై మండిపడిన మహేందర్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాల పునర్విభజనపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేస్తే.. దాన్ని అడ్డుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా 15 మండలాలతో ప్రతిపాదిత రంగారెడ్డి జిల్లా ఏర్పడనుందని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాలను కలిపే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. గురువారం జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేందర్‌రెడ్డి మాట్లాడారు. ప్రతిపాదిత శంషాబాద్ జిల్లాలో షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల విలీనాన్ని రాజకీయం చేస్తూ కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు నిరహార దీక్షలకు దిగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ మండలాలు శంషాబాద్‌కు అతిదగ్గరలో ఉండడం.. మెజార్టీ ప్రజల కోరిక మేరకు ఆ జిల్లాలు కలపాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి హయాం నుంచి వికారాబాద్ ప్రాంతానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందని, జిల్లా కేంద్రం ప్రకటనను దాటవేస్తూ గడిపిన ఆ పార్టీ ప్రస్తుతం..కేసీఆర్ సర్కారు నెరవేరుస్తుంటే జీర్ణించుకోలేక పోతుందని వ్యాఖ్యానించారు. ప్రజల్లో అపోహలు, అనుమానాలను సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు. వికారాబాద్ జిల్లా కేంద్రం అభివృద్ధికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వకుండా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం గర్హనీయమన్నారు. చేవెళ్ల జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ అర్థరహితమని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గండేడ్ను మహబూబ్‌నగర్ జిల్లాలో కలిపే ప్రతిపాదన ప్రభుత్వ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. కాగా, చేవెళ్లను కూడా శంషాబాద్‌లో కలపాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చిన్న జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని, ఈ నిధులతో వికారాబాద్ అభివృద్ధి చెందే అవకాశముందని మహేందర్‌రెడ్డి తెలిపారు. -
ఆదివాసీ ప్రాంతాలను ముక్కలు చేస్తున్నారు
కేయూ క్యాంపస్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఐదో షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాలను సీఎం కేసీఆర్ ముక్కలు చేస్తున్నాడని మన్యసీమ రాష్ట్రసాధన సమితి జాతీయ కన్వీనర్ చందా లింగయ్య అన్నారు. ఆదివా రం ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ), ఆదివాసీ విద్యార్థి సంఘం జేఏసీ, పలు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో కేయూ దూరవిద్య కేంద్రంలోని జాఫర్‌నిజాం సెమినార్ హాల్లో సమావేశంలో నిర్వహించారు. ఇందులో ఐదో షెడ్యూల్ భూభాగాన్ని ఆదివాసీల జిల్లాలుగా చేయాలనే చర్చ జరిగిం ది. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక మన్యసీమ ఆదివాసీ రాష్ట్రం కోసం తెలంగాణ నుంచి వేర్పాటు ఉద్యమాన్ని విద్యార్థులతో ఉధృతం చేస్తామన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర పోలిట్‌బ్యూరో చైర్మన్ బూర్క పోచయ్య ఆదివాసీల ప్రాంతాలను పాలకవర్గాలు విధ్వం సం చేస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో ఆదివాసీ విద్యార్థి సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మైపతి అరుణ్‌కుమార్, బాధ్యులు వెంకట్, సాయిబాబా, జిల్లా అధ్యక్షుడు తాటి హన్మంతరావు, రవి, ఆలంకిషోర్, సిద్దబోయిన లక్ష్మినారాయణ, ఈసం సుధాకర్, ఇర్ప విజయ పాల్గొన్నారు. -
ఎంఈఓ భవనంలోనే డీఈఓ కార్యాలయం
భవనాన్ని పరిశీలించిన ఇంజనీర్లు, అధికారులు రెండు డిప్యూటీ ఈఓ ఆఫీస్‌లు ఏర్పడే అవకాశం మహబూబాబాద్ : జిల్లాల పునర్విభజనతో మానుకోట జిల్లాకు డీఈఓ కార్యాలయాన్ని మండలకేంద్రంలో ఎంఈఓ కార్యాలయంలోనే ఏర్పాటు చేయనున్నారు. ఇక డిప్యూటీ ఈఓ కార్యాలయం పరిధిలోని కొన్ని మండలాలు ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. మరో డిప్యూ టీ ఈఓ కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశం ఉన్నాయి. మానుకోట ఎంఈఓ కార్యాలయంలో 8 గదులు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి ఎంఈఓకు కేటాయించగా రెండు గదులు డిప్యూటీ ఈఓ కార్యాలయానికి వినియోగిస్తున్నారు. ఒక గది స్టోర్ రూమ్‌గా, మరో గది హాల్ కోసం ఉంది. ఇంకా మూడు గదులే మిగిలి ఉన్నాయి. దీంతో ఈ భవనం పైఅంతస్తు నిర్మిం చాలా.. లేక ఖాళీ స్థలంలో మరికొన్ని గదులు నిర్మించాలా.. అనే విషయంపై శుక్రవారం విద్యాశాఖ ఇంజనీర్లు పరిశీలించారు. డిప్యూటీ ఈఓ పరిధిలోకి 19 మండలాలు డిప్యూటీ ఈఓ కార్యాలయ పరిధిలోకి 19 మండలాలు వెళ్లాయి. చెన్నారావుపేట, డోర్నకల్, దుగ్గొండి, గీసుకొండ, గూడూరు, ఖానాపూర్, కొత్తగూడ, కేసముద్రం, కురవి, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, నర్సంపేట, నర్సింహులపేట, నెక్కొండ, నెల్లికుదురు, పర్వతగిరి, సంగెం, రాయపర్తి మండలాలు ఉన్నాయి. కాగా చెన్నారావుపేట మండలం, దుగ్గొండి, గీసుకొండ, ఖానాపూర్, నర్సంపేట, నెక్కొండ, పర్వతగిరి, సంగెం మండలాలు వరంగల్ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. రాయపర్తి మండలం హన్మకొండ జిల్లాలో చేరింది. కొత్తగా రెండు మండలాల చేరిక డిప్యూటీ ఈఓ కార్యాలయ పరిధిలోకి కొత్తగా బయ్యారం, గార్ల మండలాలు చేరాయి. డీఇఓ కార్యాలయం పరిధిలోనూ రెండు మండలాలు ఉంటాయి. కాగా గూడూరు, కొత్తగూడ, బయ్యారం, గార్ల ఏజెన్సీ మండలాలు ఉండటంతో మరో డిప్యూటీ ఈఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు.