కాంగ్రెస్, బీజేపీ ఓటమి ఖాయం
- కార్యకర్తల సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి
- మంత్రి హరీష్‌రావు సమక్షంలో పార్టీలో చేరిన నేతలు
సాక్షి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభకు జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ అభ్యర్థులు ఓటమి చెందడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డిలో టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రి హరీష్‌రావు, ఎంపీలు బీబీపాటిల్, బాల్కసుమన్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, గువ్వల బాలరాజు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే కరువయ్యారన్నారు. తమ పార్టీ అభ్యర్థి కొత్తా ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు సేవచేసేందుకు సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు.
తనను గెలిపిస్తే ప్రజాసమస్యలు పరిష్కరించటంతోపాటు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎంపీ బాల్కసుమన్ మాట్లాడుతూ ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలను పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన పనిలేదన్నారు. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి మాటలను ప్రజలు విశ్వసించరన్నారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో జరుగుతున్న ఈఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు.
కాంగ్రెస్ పాలన ఫలితంగానే రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తమ ప్రభుత్వం కాంగ్రెస్ పాపాలను కడిగే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్‌లో చేరిన నరేంద్రనాథ్ మాట్లాడుతూ కేసీఆర్, హరీష్‌రావు తనకు గతంలో ఎంత నచ్చజెప్పినా వినకుండా బీజేపీ నుంచి పోటీచేసి అన్నివిధాలా నష్టపోయానన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తనను ఉపయోగించుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కానుక ఇద్దాం: బాబూమోహన్
మెదక్ ఎంపీ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుక ఇద్దామని ఎమ్మెల్యే బాబూమోహన్ పేర్కొన్నారు. రేపటి నుంచి తాను గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్, బీజేపీ నాటకాలను బయటపెడతానన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి పార్టీని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డిని ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారన్నారు.
సీఎం కేసీఆర్ సహకారంతో సంగారెడ్డిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణద్రోహికి టికెట్ ఇచ్చిన బీజేపీకి ఉప ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి రాజయ్య యాదవ్ టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు ఎం.ఎ.హకీం, విజయేందర్‌రెడ్డి, జలాలుద్దీన్‌బాబా, మందుల వరలక్ష్మి, నియోజకవర్గ నాయకులు రాంరెడ్డి, శ్రీనివాస్‌చారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు సమక్షంలో సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు.