ఆర్నెళ్లలో ఆర్టీసీ లాభాల బాట
♦ త్వరలో 500 కొత్త బస్సులు
♦ అయ్యప్ప భక్తుల కోసం శబరికి 200 బస్సులు
♦ ‘సాక్షి’తో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఆరునెలల్లో ఆర్టీసీ లాభాల బాట పడుతోందని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం ప్రతిరోజు రూ.కోటి నష్టం వాటిల్లుతోందని, ఈ నష్టాన్ని అధిగమించేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకుసాగుతున్నట్లు చెప్పారు. సోమవారం ‘సాక్షి’ ప్రతినిధితో మహేందర్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 95 డిపోల్లో ఆరు ఇప్పటికే లాభాల్లో నడుస్తున్నాయని, మరో 22 డిపోలు కూడా లాభనష్టాల్లేని దశకు చేరుకున్నాయని తెలిపారు. ప్రసిద్ధ అయ్యప్ప పుణ్యక్షేత్రం శబరిమలకు 200 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.
బస్‌స్టేషన్ల బాగుకు రూ.23 కోట్లు!
బస్‌స్టేషన్ల ఆధునికీకరణకు రూ.23 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మహేందర్‌రెడ్డి తెలి పారు. జిల్లాకు సగటున రూ.1-3 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రం లో 500 కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయని, దీంట్లో వంద ఏసీ బస్సులను ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి హైదరాబాద్‌కు నడపాలని నిర్ణయించినట్లు చెప్పారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు బస్సుల ఫ్రీక్వెన్సీ పెంచుతామని, అందులో భాగంగా 400 పల్లె వెలుగు బస్సులను మండల, జిల్లా కేంద్రాల మధ్య నడుపుతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1,300 గ్రామాలకు బస్సు సౌకర్యంలేదని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించినట్లు మంత్రి పేర్కొన్నారు.