"నగరవాసులకు శుభవార్త.. నగరపరిధిలో ప్రయాణించే వాహనదారులు ఇక మీదట బైకులపై హెల్మెట్ లేకుండా ప్రయాణించవచ్చు. ఈమేరకు దేవేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌పై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్ తనిఖీలను కోర్టు వ్యతిరేకించింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్‌కు హెల్మెట్ వాడకం తప్పనిసరేమీ కాదని తేల్చి చెప్పింది."
"కనీస రక్షణ అనేది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ కిందకు మాత్రమే వస్తుందని స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర, జిల్లాల హైవేలపై మాత్రం హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని తీర్పునిచ్చింది. నగర పరిధుల్లో మాత్రం హెల్మెట్ ధరించాలా? వద్దా? అన్నది కేవలం పౌరుల వ్యక్తిగత ఇష్టమని వెల్లడించింది. ఇక మీదట ఎవరైనా ట్రాఫిక్ లేదా ఇతర పోలీసులు మీ బండి ఆపి మీరు హెల్మెట్ ఎందుకు ధరించలేదు అని అడిగితే నేను పలానా మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ సమితి, నగర పరిధిలోనే ఉన్నానని వారికి చెప్పొచ్చు. దీంతో వారు మీపై ఎలాంటి జరిమానా వేసే అవకాశం లేదు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి" అంటూ ఓ మెసేజ్ వాట్సాప్‌లో తెగ వైరల్ అవుతోంది.
ఇకపై హెల్మెట్ లేకున్నా నో ఫైన్ అంటూ జనాలు దీన్ని వాట్సాప్ గ్రూపుల్లో తెగ షేర్ చేస్తున్నారు. అయితే మీరు మాత్రం దీన్ని నమ్మి హెల్మెట్ లేకుండా వెళ్లారంటే చలానా బారిన పడటం ఖాయం. ఎందుకంటే ఇది పూర్తిగా ఓ ఫేక్ న్యూస్. ఈ అసత్య ప్రచారానికి తోడు దాని కింద ఫోన్ నెంబర్లు జోడించారు. అందులో ఒక నంబర్ కలవగా అది న్యాయవాది దేవేంద్ర ప్రతాప్ సింగ్‌దే కావడం గమనార్హం. అయితే అతడు దీనిపై స్పందిస్తూ ఈ మెసేజ్‌కు, తనకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పాడు. ఎవరో కావాలనే తన పేరు మీద ఈ వదంతులు సృష్టించారని, దీన్ని ఎవరూ నమ్మొద్దని సూచించాడు. కోర్టులు ఇలాంటి తీర్పులు ఇవ్వవని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ ఫేక్ న్యూస్‌ను ఎవరూ నమ్మవద్దని, దీన్ని అస్సలు ఫార్వర్డ్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment