‘నో హెల్మెట్.. నో పెట్రోలు’పై వెనకడుగు
- ప్రజల్లో వ్యతిరేకతతో తగ్గిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ ధరించనివారికి పెట్రోలు బంకుల్లోకి అనుమతించొద్దనే ఆలోచనపై కసరత్తు చేసిన ప్రభుత్వం ప్రస్తుతానికి దాన్ని పక్కనపెట్టింది. వాహనదారులకు అవగాహన కల్పించకుండా ఇలాంటి కఠిన నిబంధనలు విధించటం వల్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం అలాంటి వివాదాస్పద అంశాల జోలికి ఇప్పట్లో వెళ్లొద్దని నిర్ణయించింది.
ఇటీవల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు విమర్శలు గుప్పించాయి. వాహనదారుల్లో ముందుగా అవగాహన తెచ్చిన తర్వాత ఇలాంటి చర్యలకు దిగితే బాగుంటుందని, ముందే బెదరగొట్టేలా చేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించాయి. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. స్వచ్ఛంద సంస్థలను భాగస్వాముల్ని చేసి ప్రజల్లో హెల్మెట్ ధారణపై అవగాహన తేవాలని నిర్ణయించింది.