ముంబై: ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై హెల్మెట్ లేకుండా ప్రవేశం లభించదు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇటీవల జారీ చేసిన ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు ద్విచక్రవాహనాల్లో వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. లేనట్లయితే ప్రవేశం లభించదు. కొంతకాలంగా రహ దారులపై జరిగే ప్రమాదాలలో అత్యధికంగా ద్విచక్రవాహనాలే ప్రమాదానికి గురవుతున్నాయి. దీంతో ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడంతో అనేక మందికి తలకు గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధగా కొన్ని సూచనలు చేసింది.
హైకోర్టు చేసిన సూచనల మేరకు రాష్ట్ర రవాణా శాఖ జనజాగృతి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. ‘ఎన్నో జన చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ హెల్మెట్ ధరించడం విషయంలో అనుకున్న ఫలితాలు రావడం లేదనీ, అందుకు ఇకనుంచి కఠినమైన చర్యలు చేపట్టాలనీ నిర్ణయించినట్లు రవాణా శాఖ కమిషనర్ అవినాశ్ డాక్టె తెలిపారు. హెల్మెట్ లేని వారెవ్వరినీ ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతించకూడదనీ, ఉన్నతాధికారులైనా, సామాన్యులైనా అందరికీ ఈ నియమం వర్తిస్తుందన్నారు.
చదవండి: (సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న గొర్రెల కాపరి..)
ఈ నిర్ణయానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు, జన చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కూడా హెల్మెట్ ధారణ విషయంలో నిర్లక్ష్యం వహించే ద్విచక్రవాహనదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామనీ అవినాష్ డాక్టె వెల్లడించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలోని పరిపాలనా శాఖకు చెందిన అన్ని ఆఫీసుల్లో, విద్యా సంస్థల్లో, ఇతర విభాగాలకు చెందిన కార్యాలయాల్లో కూడా హెల్మెట్ తప్పని సరిగా ధరించాలనే నియమాన్ని కఠినంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి
Comments
Please login to add a commentAdd a comment