కొత్తగా రోడ్డెక్కనున్న 46 వేల ఆటోలు నిరుద్యోగులకు వరం
Published Thu, Oct 3 2013 11:01 PM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
సాక్షి, ముంబై: ప్రయాణికులతోపాటు నిరుద్యోగులకూ శుభవార్త. నగరంతోపాటు రాష్ర్టవ్యాప్తంగా కొత్తగా 46 వేల ఆటో పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందువల్ల ప్రయాణికులకు నిరంతరం ఆటోలు అందుబాటులో ఉండడమే కాకు ండా, నిరుద్యోగులకు సైతం ఉపాధి లభిస్తుంది. నగరంలో 32, పుణే, నాసిక్, నాగపూర్ నగరాలల్లో 14 వేల ఆటో పర్మిట్లు జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి శైలేశ్‌శర్మ చెప్పారు. ఆటోల అంశంపై రవాణా విభాగం అధికారులు ఇటీవల ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగాఆటోలపై సీఎం చవాన్ సమీక్షించారు.
అనంతరం వివిధ కారణాల వల్ల రద్దయిన ఆటోల పర్మిట్లను అర్హులకు అందజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా ఆర్టీఓ కార్యాలయాలకు రవాణా శాఖ కమిషనర్ వి.ఎన్.మోరే ఇటీవల ఓ సర్క్యులర్ జారీచేశారు. ఆటో బ్యాడ్జి కలిగి ఉన్న వారికి ప్రాధాన్యమివ్వనున్నారు. ఒకవేళ పర్మిట్ల కంటే ఎక్కువ సంఖ్యలో అర్హులు దరఖాస్తుచేసుకుంటే లాటరీ వేసి జారీ చేయాలా? లేక మరేదైనా ప్రక్రియను అనుసరించాలా? అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. కాగా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆటో సంఘాలు స్వాగతించాయి. అయితే అద్దెకు తీసుకుని ఆటో నడుపుకునే వారికి ప్రాధాన్యం ఇవ్వాలంటూ యూనియన్ నాయకుడు శశాంక్‌రావ్ ఈ సంద ర్భంగా డిమాండ్ చేశారు.
Advertisement