వక్ఫ్‌బోర్డు విభజనకు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు విభజనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. విభజనకు వెంటనే పూనుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్రంలోని ముగ్గురు అధికారుల బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ బృందంలో కేంద్ర మంత్రిత్వ మైనార్టీ వ్యవహారాల శాఖ కార్యదర్శి అరవింద్ మాయరావ్, సంయుక్త కార్యదర్శి రాకేశ్ మోహన్, కార్యదర్శి పీకే శర్మలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2014లోని 10వ షెడ్యూల్‌లో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్‌బోర్డును చేర్చారు. షెడ్యూలు-10లోకి వచ్చే ప్రభుత్వ సంస్థలను కేంద్రం విభజించాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగి ఏడు మాసాలు గడిచినా కేంద్రం నుంచి వక్ఫ్‌బోర్డు విభజనకు కసరత్తు ప్రారంభం కాలేదు. దీంతో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వారంక్రితం ఢిల్లీలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లాను కలిసి వక్ఫ్‌బోర్డు విభజనను త్వరతగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసేందుకు 18న కేంద్రం బృందాన్ని హైదరాబాద్‌కు పంపిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. అందులో భాగాంగానే కేంద్ర బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. బుధవారం సచివాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శులు, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, డెరైక్టర్లు,వక్ఫ్‌బోర్డు ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు తదితరులతో సమావేశమై వక్ఫ్‌బోర్డు విభజన పై చర్చలు జరుపనుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ 58, తెలంగాణ 42 శాతం నిష్పత్తి చొప్పున విభ జన జరగాల్సి ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 43 లక్షలు, సీమాంధ్రలో 39 లక్షల మంది ఉన్నారు. మొదటి సర్వే కమిషన్ ప్రకారం తెలంగాణలో వక్ఫ్ ఆస్తులు 33, 929, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 4,600 ఆస్తులు మాత్రమే నమోదై ఉన్నాయి. దీంతో వక్ఫ్‌బోర్డు విభజన 52:48 ప్రకారం జరగాల్సి ఉంది. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో చర్చల అనంతరం కేంద్రానికి నివేదిక అందజేయనుంది. నెలాఖరులోగా బోర్డు విభజనపై నోటిఫికేషన్ విడుదలైతే వచ్చే నెల మొదటి వారంలో విభజన జరిగి కొత్త బోర్డులు ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయి.