ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ నిర్వచనాలకు కేంద్రం ఓకే
10% మించిన పెట్టుబడులన్నీ ఇక ఎఫ్‌డీఐలే
న్యూఢిల్లీ: లిస్టెడ్ కంపెనీల్లో 10 శాతానికి మించిన విదేశీ పెట్టుబడులన్నిటినీ ఇక ఎఫ్‌డీఐగా పరిగణించనున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ) నిర్వచనాల హేతుబద్దీకరణపై ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారామ్ సారథ్యంలోని కమిటీ రూపొందించిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. ఓ కంపెనీలో 10 శాతం కంటే తక్కువగా ఉన్న పెట్టుబడులను కూడా ఎఫ్‌డీఐగా పరిగణిస్తారు గానీ, తొలి కొనుగోలు చేసిన ఏడాదిలోగా వాటాను 10 శాతానికిపైగా పెంచుకోవాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత కూడా వాటా 10 శాతానికి తక్కువగా ఉంటే దాన్ని పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్‌గా పరిగణిస్తారని కేంద్ర ఆర్థిక శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అన్‌లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి ఎంత ఉన్నా దాన్ని ఎఫ్‌డీఐగా పరిగణించాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది.