ధరలు దిగొస్తాయ్: మాయారామ్
న్యూఢిల్లీ: వచ్చే కొద్దినెలల్లో ద్రవ్యోల్బణం దిగొస్తుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ పేర్కొన్నారు. అయితే, నిత్యావసరాల ధరలకు దీర్ఘకాలంలో కళ్లెంవేయాలంటే డిమాండ్-సరఫరాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గిం చాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ద్రవ్యోల్బణం ఇబ్బందికరంగా మారింది. అయితే, సమీప భవిష్యత్తులో ఇది కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా మరింత తగ్గించాలంటే మాత్రం ఉత్పత్తి పెంపు, కూరగాయలు ఇతరత్రా సరుకుల రవాణాను మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టాల్సిందే’ అని మాయారామ్ పేర్కొన్నారు. నవంబర్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టానికి(7.52%), రిటైల్ ద్రవ్యోల్బణం రేటు రెండంకెల స్థాయిలోనే కొనసాగుతూ 9 నెలల గరిష్ట స్థాయికి(9.52%) ఎగబాకిన సంగతి తెలిసిందే.
క్యాడ్ 50 బిలియన్ డాలర్లలోపే: బంగారం దిగుమతులు భారీగా దిగిరావడం, ఎగుమతులు పుంజుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది(2013-14) కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) 50 బిలియన్ డాలర్లలోపే ఉండొచ్చని మాయారామ్ అంచనావేశారు. గతేడాది క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(జీడీపీలో 4.8 శాతం- 88.2 బిలియన్ డాలర్లు) దూసుకెళ్లడం విదితమే.