వృద్ధి కోసం మరిన్ని చర్యలు: మాయారామ్
న్యూఢిల్లీ: దేశాభివృద్ధికి ఊతం ఇవ్వడానికి కేంద్రం మరిన్ని చర్యలను తీసుకోనున్నట్లు ఆర్థిక సేవల కార్యదర్శి అరవింద్ మాయారామ్ చెప్పారు. ఇక్కడ సోమవారం జరిగిన సీయూటీఎస్ అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని ఆయన పేర్కొంటూ, అయితే అటుతర్వాత వృద్ధి ప్రక్రియ ప్రారంభానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని అన్నారు. భారత్ వంటి వర్ధమాన దేశాలు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించాలంటే.. మార్కెట్లలో అన్ని వర్గాలు సమానస్థాయిలో పోటీపడే పరిస్థితి కల్పించాల్సి ఉంటుందని, దీనికి మరిన్ని చర్య లు తీసుకోవల్సి ఉంటుందని చెప్పారు. విద్యుత్, వ్యవసాయం, విద్య, ఆరోగ్యరక్షణ, రైల్వేలు వంటి రంగాలు ఇబ్బందుల నుంచి గట్టెక్కాల్సి ఉందన్నారు. పది, ఇరవై ఏళ్ల క్రితం ఏర్పాటైన గుత్తాధిపత్య నియంత్రణ సంస్థలు ప్రస్తుతం దేశీయంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయని కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) చైర్మన్ అశోక్ చావ్లా తెలిపారు.
ఎఫ్‌ఐఐలతో మాయారాం భేటీ ..
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ)తో కూడా మాయారాం భేటీ అయ్యారు. పెట్టుబడులకు అనువైన పరిస్థితులు క ల్పించేందుకు సంస్కరణల ప్రక్రియ కొనసాగుతుందని, ఈ విషయంలో ఆందోళనలు అక్కర్లేదని ఆయన.. వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలయన్స్ బెర్న్‌స్టెయిన్, జీఎల్‌జీ పార్ట్‌నర్స్, డేవిడ్సన్ కెంపెనర్ వంటి ఎఫ్‌ఐఐల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు