మళ్లీ వెయ్యి నోట్లు వచ్చేస్తాయి!
ప్రస్తుతం ప్రభుత్వం రద్దుచేసిన వెయ్యి రూపాయల నోట్లు త్వరలోనే మళ్లీ మార్కెట్లలోకి వస్తాయి. ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతోపాటు ఎకనమిక్ ఎడిటర్స్ సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ కొత్త విషయం వెల్లడించారు. దాంతోపాటు, ఇప్పటికే చలామణిలో ఉన్న అన్ని నోట్లూ మళ్లీ కొత్త డిజైన్లతో వస్తాయని కూడా తెలిపారు. ఇప్పుడు చలామణిలో ఉన్న 100, 50, 20, 10, 5, 2, 1 నోట్లు అన్నీ కూడా యథాతథంగా చెల్లుబాటు అవుతాయని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ నోట్లన్నింటినీ కూడా కొత్త డిజైన్, కొత్త ఫీచర్లతో త్వరలోనే మళ్లీ విడుదల చేస్తామన్నారు. కొత్త కొలతలు, డిజైన్లతో వెయ్యి రూపాయల నోట్లను కూడా కొన్ని నెలల్లో మళ్లీ విడుదల చేస్తామని శక్తికాంత దాస్ వివరించారు. గత కొన్ని నెలలుగా కొత్త నోట్ల ముద్రణ వ్యవహారం కొనసాగుతూనే ఉందని, రిజర్వు బ్యాంకులో ఉన్న ఇద్దరు ముగ్గురికి మాత్రమే కొత్త నోట్ల డిజైన్ విషయం తెలుసని ఆయన చెప్పారు.