కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా రాజీవ్ మహర్షి
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా రాజీవ్ మహర్షి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అర్‌వింద్ మాయారామ్ స్థానంలో వచ్చిన రాజీవ్ 1978 బ్యాచ్ ఐఏఎస్ రాజస్థాన్ కేడర్ ఆఫీసర్, అర్‌వింద్ మాయారామ్, రాజీవ్ మహర్షి ఇద్దరూ బ్యాచ్‌మేట్‌లు కావడం విశేషం. సంస్కరణలకు అనుకూలవాది అని పేరుబడ్డ రాజీవ్ మహర్షి రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు కార్మిక చట్టాలకు సవరణల విషయంలో చురుకుగా వ్యవహరించారు. అర్‌వింద్ మాయారామ్‌ను మొదటగా పర్యాటక శాఖకు, ఆ తర్వాత మైనారిటీ వ్యవహారాల శాఖకు బదిలీ చేశారు.
ఆర్థిక శాఖలో మొత్తం ఐదుగురు కార్యదర్శులుం టారు. వారు.. ఆర్థిక వ్యవహారాలు, వ్యయ, రెవెన్యూ, డిజిన్వెస్ట్‌మెంట్, ఆర్థిక సేవలు. వీరందరిలోకి సీనియర్ అధికారి ఆర్థిక కార్యదర్శిగా(ప్రస్తుతం రాజీవ్) వ్యవహరిస్తారు. ప్రస్తుతం వ్యయ కార్యదర్శిగా రతన్ పి. విఠల్, ఆర్థిక సేవల కార్యదర్శిగా గుర్‌దయాళ్ సింగ్ సంధు, రెవెన్యూ కార్యదర్శిగా శక్తికాంత దాస్, డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శిగా ఆరాధన జోహ్రిలు వ్యవహరిస్తున్నారు.