► పోలీసులు, ఆక్రమిత గిరిజనుల మధ్య వాగ్వాదం
► గిరిజనులను అదుపులోకి తీసుకుని భవనాలకు సీజ్
అశ్వారావుపేటరూరల్: ఇందిరాసాగర్ ప్రాజెక్టుకు ఖాళీ భవనాలను ఆక్రమించుకొని నివాసం ఉంటున్న నిరుపేద గిరిజనులను ఖాళీ చేయించే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గిరిజనుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా అడ్డుతగిలిన మహిళలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మండల పరిధిలోని తిరుమలకుంట పంచాయతీలో గల బండారుగుంపు సమీపంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇందిరాసాగర్(రుద్రంకోట) పంప్ హౌస్ సిబ్బందికి 2009లో 18 భవనాలను నిర్మించింది. భవన నిర్మాణాలు పూర్తయినప్పటికీ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిలుపుదల చేయడంతో ఖాళీగానే ఉంటున్నాయి.
ఐదురోజుల క్రితం బండారుగుంపు, రెడ్డిగూడెం, సుద్దగోతులగూడెం, తిరుమలకుంట కాలనీలకు చెందిన 18 మంది గిరిజన కుటుంబాలు ఈ భవనాలను ఆక్రమించుకొని నివాసం ఉంటున్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తక్షణమే భవనాలను ఖాళీ చేయించి స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్ యలవర్తి వెంకటేశ్వరరావును ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, అటవీ సిబ్బందితో తహసీల్దార్ భవనాలను ఖాళీ చేయించేందుకు వచ్చారు.
అశ్వారావుపేట సీఐ రవికుమార్ ఎస్‌ఐ కృష్ణ, సురేష్, ప్రవీణ్, చరణ్, ఉదయ్ కుమార్‌లతోపాటు 80మంది పోలీస్ సిబ్బంది, 20 మంది అటవీ శాఖ సిబ్బంది ఉదయం 8 గంటలకే బండారుగుంపు గ్రామానికి చేరుకున్నారు. మహిళలతో తహసీల్దార్, సీఐ మాట్లాడి ప్రభుత్వ భవనాలను ఆక్రమించుకోవడం చట్ట రీత్యా నేరమని, తక్షణమే ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలని సూచించారు.
తమకు వేరే ప్రాంతంలో స్థలాలు ఇస్తే ఖాళీ చేస్తామని పట్టుబట్టారు. అడ్డుపడుతున్న మహిళలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని జీపుల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. సీపీఐ ఎంఎల్(న్యూడెమోక్రసీ) పార్టీ నాయకులు గోగినపల్లి ప్రభాకర్, కంగాల కల్లయ్య, ధర్ముల సీతారాములతోపాటు 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసి దమ్మపేట, అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. వీరిపై సీతారామ ప్రాజెక్టు డీఈఈ రాంబాబు ఫిర్యాదు మేరకు బైండోవర్ కేసులు నమోదు చేయగా తహసీల్దార్ ఎదుట హాజరు పరిచి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఖాళీ చేసిన భవనాల సీజ్..
గిరిజనులను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించిన తర్వాత ఇందిరాసాగర్ భవనాల్లో ఉన్న గిరిజనుల సామగ్రిని రెవెన్యూ సిబ్బంది బయటపెట్టి భవనాలకు తాళాలు వేసి సీజ్‌చేశారు. తహసీల్దార్ విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు భవనాలను ఖాళీ చేయించి ఇరిగేషన్‌శాఖకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.