కశ్మీర్‌లో ఎస్సీ, ఎస్టీ ఓట్లపై కన్ను
పహాడీలు, వాల్మీకులకు ఎస్టీ హోదా
మోదీ సర్కార్ ఎత్తుగడ
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తేల్చడంలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారి ఓట్లే కీలకంగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో ప్రబల శక్తిగా ఎదిగేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల ఫలితంగా స్థానిక రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ స్థానాలదే మున్ముందు కీలక పాత్రగా మారవచ్చని అంటున్నారు. జమ్మూ కశ్మీర్‌లో దశాబ్ద కాలం అనంతరం అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ ఒకటో తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది.
జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను, ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేశాక జరుగుతున్న తొలి ఎన్నికలివి. దాంతో ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది. ఈ పదేళ్లలో స్థానిక రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోయిందనే చెప్పాలి. కాంగ్రెస్ మాజీ దిగ్గజం గులాం నబీ ఆజాద్ డీపీఏపీతో పాటు పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీ వంటి నయా రాజకీయ పక్షాలు పుట్టుకొచ్చాయి. 2022లో చేపట్టిన నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా అసెంబ్లీ స్థానాల సంఖ్య 87 నుంచి 90కి పెరిగింది. ఇదేమీ పెద్ద పెరుగుదలగా కనిపించకపోయినా, ముస్లిం మెజారిటీ కశ్మీర్‌తో పోలిస్తే హిందూ ప్రాబల్య జమ్మూ ప్రాంతంలో ఎక్కువ సీట్లు పెరిగేలా మోదీ సర్కారు జాగ్రత్త పడింది.
మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 9 ఎస్సీలకు, 7 ఎస్టీలకు రిజర్వ్ చేశారు. దాంతో జమ్మూ కశ్మీర్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే గుజ్జర్లు, పహాడీ తదితర సామాజిక వర్గాల ప్రాధాన్యం మరింత పెరిగింది. గత ఫిబ్రవరిలో దాదాపు 16 లక్షల మంది పహాడీ జాతులను కొత్తగా ఎస్టీ జాబితాలో చేరుస్తూ మోదీ సర్కారు వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లబ్ధి కోసం చేపట్టిన ఫక్తు రాజకీయ చర్య అని విపక్షాలు అప్పుడే విమర్శించాయి. ఎందుకంటే సంచార పశు పోషక జాతులైన గుజ్జర్లూ, బాకర్వాల్‌లు సాంప్రదాయికంగా కాంగ్రెస్ మద్దతుదారులు. వారిని తనకేసి తిప్పుకోవడం సులువు కాదన్నది బీజేపీ భావన.
అందుకే ఉరీ, కర్నాహ్, బారాముల్లా వంటి ప్రాంతాల్లో సంఖ్యాధికులైన పహాడీల ఓట్లపై పార్టీ కొంతకాలంగా కన్నేసింది. వీరు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) వంటి స్థానిక పక్షాలను బలపరుస్తుంటారు. ఎస్టీ జాబితాలో చేరిన కారణంగా వాళ్లకిప్పుడు బుధాన్, సూరజ్ కోటే, రాజౌరీ వంటి ఎస్టీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం కలిగింది. ఇది వారి ఓట్లను తమవైపు మళ్లిస్తుందని బీజేపీ ఆశ పడుతోంది. పహాడీలతో పాటు వాల్మీకి తెగవారిని తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. వాల్మీకులకు తాజాగా ఎస్టీ హోదా కల్పించారు. ప్రతి ఓటూ కీలకమే అయిన జమ్మూ కశ్మీర్‌లో ఏ అవకాశాన్నీ వదలరాదని బీజేపీ పట్టుదలగా ఉంది. 9 ఎస్టీ స్థానాల్లో ఐదు పీర్ పంజల్ బెల్ట్‌లోని రాజౌరీ – పూంచ్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇవన్నీ తన ఖాతాలోనే పడతాయని అంచనా వేస్తోంది.
గుర్రుగా గుజ్జర్లు
పహాడీ, వాల్మీకి జాతులకు ఎస్టీ హోదా ఇవ్వడంతో గుజ్జర్లలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. 15.6 లక్షలకు పైగా ఉన్న వీరు ఇప్పటిదాకా జమ్మూ కశ్మీర్‌లో 10 శాతం ఎస్టీ రిజర్వేషన్లకు పూర్తి హక్కుదారులు. వాటినిప్పుడు పçహాడీ, వాల్మీకులతో పంచుకోవాల్సి వస్తుండటంపై వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాగని ఈ వర్గాలు నమ్ముకున్న కాంగ్రెస్ కూడా 16 లక్షల జనాభా ఉన్న పçహాడీ, వాల్మీకులను కాదని వీరికి మద్దతుగా పూర్తిస్థాయిలో గళం విప్పే పరిస్థితుల్లో లేదు. మారిన రిజర్వేషన్ల అనంతరం జమ్మూకశ్మీర్ రాజకీయాలపై ఎస్సీ, ఎస్టీల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తేటతెల్లం కానుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment