Assembly electins
-
పార్టీల ‘పహాడీ’ రాజకీయాలు
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తేల్చడంలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారి ఓట్లే కీలకంగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్లో ప్రబల శక్తిగా ఎదిగేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల ఫలితంగా స్థానిక రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ స్థానాలదే మున్ముందు కీలక పాత్రగా మారవచ్చని అంటున్నారు. జమ్మూ కశ్మీర్లో దశాబ్ద కాలం అనంతరం అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ ఒకటో తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను, ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేశాక జరుగుతున్న తొలి ఎన్నికలివి. దాంతో ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది. ఈ పదేళ్లలో స్థానిక రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోయిందనే చెప్పాలి. కాంగ్రెస్ మాజీ దిగ్గజం గులాం నబీ ఆజాద్ డీపీఏపీతో పాటు పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీ వంటి నయా రాజకీయ పక్షాలు పుట్టుకొచ్చాయి. 2022లో చేపట్టిన నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా అసెంబ్లీ స్థానాల సంఖ్య 87 నుంచి 90కి పెరిగింది. ఇదేమీ పెద్ద పెరుగుదలగా కనిపించకపోయినా, ముస్లిం మెజారిటీ కశ్మీర్‌తో పోలిస్తే హిందూ ప్రాబల్య జమ్మూ ప్రాంతంలో ఎక్కువ సీట్లు పెరిగేలా మోదీ సర్కారు జాగ్రత్త పడింది.మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 9 ఎస్సీలకు, 7 ఎస్టీలకు రిజర్వ్ చేశారు. దాంతో జమ్మూ కశ్మీర్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే గుజ్జర్లు, పహాడీ తదితర సామాజిక వర్గాల ప్రాధాన్యం మరింత పెరిగింది. గత ఫిబ్రవరిలో దాదాపు 16 లక్షల మంది పహాడీ జాతులను కొత్తగా ఎస్టీ జాబితాలో చేరుస్తూ మోదీ సర్కారు వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లబ్ధి కోసం చేపట్టిన ఫక్తు రాజకీయ చర్య అని విపక్షాలు అప్పుడే విమర్శించాయి. ఎందుకంటే సంచార పశు పోషక జాతులైన గుజ్జర్లూ, బాకర్వాల్లు సాంప్రదాయికంగా కాంగ్రెస్ మద్దతుదారులు. వారిని తనకేసి తిప్పుకోవడం సులువు కాదన్నది బీజేపీ భావన. అందుకే ఉరీ, కర్నాహ్, బారాముల్లా వంటి ప్రాంతాల్లో సంఖ్యాధికులైన పహాడీల ఓట్లపై పార్టీ కొంతకాలంగా కన్నేసింది. వీరు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) వంటి స్థానిక పక్షాలను బలపరుస్తుంటారు. ఎస్టీ జాబితాలో చేరిన కారణంగా వాళ్లకిప్పుడు బుధాన్, సూరజ్ కోటే, రాజౌరీ వంటి ఎస్టీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం కలిగింది. ఇది వారి ఓట్లను తమవైపు మళ్లిస్తుందని బీజేపీ ఆశ పడుతోంది. పహాడీలతో పాటు వాల్మీకి తెగవారిని తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. వాల్మీకులకు తాజాగా ఎస్టీ హోదా కల్పించారు. ప్రతి ఓటూ కీలకమే అయిన జమ్మూ కశ్మీర్లో ఏ అవకాశాన్నీ వదలరాదని బీజేపీ పట్టుదలగా ఉంది. 9 ఎస్టీ స్థానాల్లో ఐదు పీర్ పంజల్ బెల్ట్‌లోని రాజౌరీ – పూంచ్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇవన్నీ తన ఖాతాలోనే పడతాయని అంచనా వేస్తోంది.గుర్రుగా గుజ్జర్లుపహాడీ, వాల్మీకి జాతులకు ఎస్టీ హోదా ఇవ్వడంతో గుజ్జర్లలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. 15.6 లక్షలకు పైగా ఉన్న వీరు ఇప్పటిదాకా జమ్మూ కశ్మీర్లో 10 శాతం ఎస్టీ రిజర్వేషన్లకు పూర్తి హక్కుదారులు. వాటినిప్పుడు పçహాడీ, వాల్మీకులతో పంచుకోవాల్సి వస్తుండటంపై వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాగని ఈ వర్గాలు నమ్ముకున్న కాంగ్రెస్ కూడా 16 లక్షల జనాభా ఉన్న పçహాడీ, వాల్మీకులను కాదని వీరికి మద్దతుగా పూర్తిస్థాయిలో గళం విప్పే పరిస్థితుల్లో లేదు. మారిన రిజర్వేషన్ల అనంతరం జమ్మూకశ్మీర్ రాజకీయాలపై ఎస్సీ, ఎస్టీల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తేటతెల్లం కానుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జమ్ము కశ్మీర్ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మొదటి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సోమవారం ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది. మొదట తొలి జాబితాలో భాగంగా మొత్తం 44 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. అనంతరం కొంత సమయం తర్వాత ఆ జాబితాను బీజేపీ ఉపసంహరించుకుంది. మళ్లీ తిరిగి కేవలం 15 మంది అభ్యర్థుల పేర్లతో మరో జాబితాను విడుదల చేసింది.BJP releases amended list of 15 candidates for upcoming J&K Assembly elections pic.twitter.com/yUzU6lYrTB— ANI (@ANI) August 26, 2024 జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.BJP withdraws first list of 44 candidates released for upcoming J&K Assembly Elections; BJP to amend and release the list of candidates again pic.twitter.com/X9tqVoZ9Zv— ANI (@ANI) August 26, 2024 -
మహారాష్ట్ర బీజేపీ కూటమిలో మొదలైన సీట్ల పంచాయితీ!
ముంబై: ఈ ఏడాది చివరల్లో మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార మహాయుతి కూటమి పార్టీల్లో ఇప్పటి నుంచే సీట్ల పంపకం చర్చ మొదలైంది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్న మహారాష్ట్రలో ఏ పార్టీ ఏన్ని సీట్లు పోటీ చేయాలని దానిపై ఎన్డీయే కూటమి పార్టీల మధ్య పోరు ప్రారంభమైంది.బీజేపీ దాదాపు 150 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం శివసేన( షిండే) పార్టీ 100 సీట్లు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ 80 సీట్లలో పోటీ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. 40 సీట్లలో ఎవరు ఏ పార్టీ పోటీ చేస్తుందనే విషయంలో తీవ్ర అసమ్మతి నెలకొనటంతో సుదీర్ఘ చర్చలకు దారితీసినట్లు తెలుస్తోంది.లోక్‌సభ ఎన్నికలల్లో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. మొత్తం 48 లోక్ సీట్లలో ప్రతిపక్షం మహా వికాస్ అఘాడి 30 సీట్ల గెలుపొందగా.. బీజేపీ ఎన్డీయే కూటమి కేవలం 17 సీట్లకే పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన, సీట్ల మధ్య విభేదాలు, ఇతర అంశాలు అసెంబ్లీ సీట్ల విభజనపై కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఎన్సీపీ నేత అజిత్ పవార్, బీజేపీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి గురువారం ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అయితే వారి భేటీ సీట్ల విభజన చర్చలోకి వచ్చినట్లు సమాచారం. అయితే సీట్ల విభజన జరుతున్నట్లు వస్తున్న వార్తలను మహాయుతి పార్టీలు కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు.. శుక్రవారం కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మీడియాతో మాట్లాడుతూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు.. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ సీట్లలో బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
TS Election 2023: టికెట్లకు ముందే ఇక్కట్లు! ముఖ్యనేతలు పార్టీని వీడుతుండటంతో కలకలం!!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకముందే ముఖ్యనేతలు పార్టీని వీడుతుండటం కలకలం రేపుతోంది. పక్షం రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యనేతలంతా పార్టీని వీడారు. ఇప్పుడు మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి గుడ్‌బై చెప్పారు. జహీరాబాద్ టికెట్ ఆశించిన ఏర్పుల నరోత్తం నెల రోజుల క్రితమే వీడారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో ప్రగతిభవన్‌లో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో హస్తానికి స్థానికంగా బలమైన నాయకుడు లేకపోవడంతో డాక్టర్ ఎ.చంద్రశేఖర్‌కు టికెట్ ఖరారు చేసే యోచనలో అధిష్టానం ఉంది. మరోవైపు ఇదే నియోజకవర్గానికి చెందిన డీసీసీబీ మాజీ చైర్మన్ జైపాల్‌రెడ్డి పార్టీని వీడారు. ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ ముఖ్యనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఇటు సంగారెడ్డి నియోజకవర్గంలోనూ పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. మండల స్థాయి నాయకులూ ఇదే బాటపట్టారు. అందోల్ నియోజకవర్గాలోనూ క్షేత్రస్థాయి నాయకులు వీడి ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. ఇలా దాదాపు అన్ని చోట్ల కాంగ్రెస్ నుంచి వలసలు ఆ పార్టీని ఇబ్బందుల్లో పడేస్తోంది. ముందే ఇలా.. ఇప్పటికే బీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లాలో ఒక్క నర్సాపూర్ మినహా మిగతా అన్ని చోట్ల టికెట్లను ప్రకటించింది. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిత్వాలను ప్రకటించలేదు. ఒకవేళ అభ్యర్థిత్వాలు ప్రకటిస్తే ఆయా నియోజకవర్గాల్లో టికెట్ రాక భంగపడిన నేతలు మరికొంత మంది వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఒకట్రెండు నియోజకవర్గాలు మినహా అన్ని చోట్ల టికెట్‌ను ఇద్దరు, ముగ్గురు ఆశిస్తున్నారు. ఎవరికి వారే వ్యక్తిగతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్దిపేట్ జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి ముగ్గురు కాంగ్రెస్ నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అది దక్కని పక్షంలో ఒకరు పార్టీ మారే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్లోకి వలసలు.. కాంగ్రెస్ అసంతృప్త నేతలకు బీఆర్ఎస్ గాలం వేస్తోంది. ఆ పార్టీని వీడుతున్న నేతలు కారెక్కుతున్నారు. పార్టీని వీడుతున్న వారిలో ఒకరిద్దరు మినహా మిగతా ముఖ్యనేతలంతా గులాబీ పార్టీలో చేరుతున్నారు. పార్టీ టికెట్ల ప్రకటనకు ముందే పరిస్థితి ఉంటే ప్రకటన తర్వాత అసమ్మతి భగ్గు మనడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
TS Election 2023: బీఆర్ఎస్ అభ్యర్థులకు ‘ఎన్నికల ఖర్చు’ ఫోబియా..
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో తిరిగి టికెట్లు లభించిన బీఆర్ఎస్ అభ్యర్థులకు టికెట్లు దక్కిన ఆనందం మూడు రోజులు కూడా నిలవలేదు. ఇప్పటినుంచే చేయాల్సిన ఖర్చు తలచుకొని వారి ఆనందం ఆవిరైందంటున్నారు. ఎన్నికలకు నెల ముందు అభ్యర్థుల్ని ప్రకటిస్తే ఆ నెలరోజులు ఖర్చు చేస్తే సరిపోయేది. మూడు నాలుగు నెలల్లో ఎప్పుడు పోలింగ్ జరుగుతుందో తెలియదు. అప్పటిదాకా దేనికీ వెనుకాడకుండా ఖర్చు చేయాల్సిందే. ‘కార్యకర్తలు, అభిమానులు నిత్యం వెంట ఉండేలా చూసు కోవాలి. బస్తీలు, కాలనీలు, సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించాలి. వారందరినీ కలుపుకోవాలి. ఇంటింటికీ వెళ్లి తల్లో నాలుకలా మసలుకోవాలి. ఇవన్నీ చేయాలంటే వెంట మందీమార్బలం, ఆర్భాటం, హడావుడి చేయాల్సిందే. అందుకు కార్యకర్తలకు ఉదయం టిఫిన్ల నుంచి మొదలుపెడితే రాత్రి మందు విందుల వరకు ఖర్చు చేయాల్సిందే. నియోజకవర్గంలో శుభకార్యాలైనా, మంచైనా చైడెనా వెళ్లాలి. పేదల కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే వెళ్లి పరామర్శించాలి. ఖర్చుల నిమిత్తం డబ్బు అందజేయాలి. ఇలా ఒకటా రెండా.. దేనికై నా డబ్బు వెదజల్లాల్సిందే..తప్పదు. లేకుంటే వెంట వచ్చే వారుండరు. అభ్యర్థికి బలం లేదనే ముద్ర పడుతుంది’ అని ఓ అనుభవమున్న రాజకీయ వేత్త వ్యాఖ్యానించడం గమనార్హం. ఖర్చే ఖర్చు.. ‘ఇవన్నీ తలచుకుంటే అన్నకు నిద్ర పట్టడం లేదంటూ వ్యాఖ్యానించాడు కోర్‌సిటీలోని ఓ అభ్యర్థికి దగ్గరి వాడైన డివిజన్‌స్థాయి నేత’. ఓటర్ల జాబితాలు చూసి పేర్లు లేనివాళ్లను చేర్పించాలి. మచ్చిక చేసుకోవాలి. యువతకు, బస్తీసంఘాలకు పనులు చేయాలి.కోరింది ఇవ్వాలి. ఇక చివరి రోజుల్లో పంపిణీల సంగతి సరేసరి అంటూ చిట్టా బయట పెట్టాడు. ఇక శివారు నియోజకవర్గాల్లో ఖర్చు కోర్‌సిటీ కంటే డబుల్‌గా ఉంటుంది. అక్కడ ఓటర్లు ఎక్కువ, అవసరాలు ఎక్కువ. డిమాండ్ కూడా ఎక్కువే. ఎంతలేదన్నా అభ్యర్థికి కనీసం రూ.50 కోట్లు ఖర్చు కానుందని అంచనా. భారీగా ఖర్చు చేసేవారు అంతకు రెట్టింపు చేయాల్సిన పరిస్థితి. దీంతో ఇప్పటినుంచే డబ్బులు సమకూర్చుకునే పనిలో పడ్డట్లు చెబుతున్నారు. టికెట్లు కాస్త ఆలస్యంగా ఇస్తే కాస్త ఖర్చయినా తగ్గేదని ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. టికెట్ వచ్చేంతదాకా ఒక టెన్షన్. వచ్చాక మరో టెన్షన్ అంటూ మరో సిట్టింగ్ సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. ఎక్కువో తక్కువో, సొంతడబ్బులో, పార్టీ ఇచ్చే ఫండో ఏదైనా కానీ గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు వెరసి దాదాపు రూ.1500 కోట్లకు పైగా ఖర్చు కాగలదని ఒక అంచనా. పార్టీ కార్యక్రమాలకు.. ఈలోపున పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలూ అభ్యర్థులే దగ్గరుండి నిర్వహించాలి. అందుకు మందీమార్బలాన్ని సమకూర్చాలి. ముఖ్యనాయకులు సమావేశాలు ఏర్పాటుచేస్తే జనాన్ని సమీకరించాలి. పార్టీ తరపున నగరం పరిసరాల్లో జరిగే భారీ సభలకూ జనాన్ని తీసుకువెళ్లాలి. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేయాలి. ఊరికే ఎవరూ రారు..ప్రయాణ సదుపాయంతో పాటు నగదూ అందజేయాలి. ప్రచారానికి.. ఇప్పుడు ప్రచార సరళి మారింది. గతంలోలా కరపత్రాలు, పోస్టర్లు, గోడరాతలు మాత్రమే సరిపోవు. అసలే సోషల్ మీడియా కాలం. అనుకూల ప్రచారం బాగా వైరల్అయ్యేలా చూసుకోవాలి. ఇప్పటికే చేసిన పనులు, చేయబోయే కార్యక్రమాల గురించి ప్రముఖులచే పాటలు రాయించాలి. పాడించాలి. యూట్యూబ్ చానళ్లలో మారుమోగి పోవాలి. దీనికి వ్యయం చేయక తప్పదు. పండుగల వేళ..ప్రచారం రూటే వేరు.. అసలే శ్రావణ మాసం. ఇకనుంచి అన్నీ పండుగలే. వినాయకచవితి, దసరా, దీపావళి వంటి ముఖ్య పండుగలెన్నో ఉన్నాయి. వినాయక మంటపాల వద్ద పేరు మారుమోగి పోవాలంటే మండపాలు ఏర్పాటు నుంచి నవరాత్రులు ముగిసేంత దాకా ఏర్పాట్లు చేయాలి. ఎన్నో మండపాలకు చందాలివ్వాలి. ముగింపు రోజున భారీ కార్యక్రమాలు నిర్వహించాలి. -
TS Election 2023: ఎన్నికల ప్రచారానికి వంద రోజులు టార్గెట్‌గా..
ఖమ్మం: బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి వంద రోజులు టార్గెట్‌గా నిర్దేశించుకుంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యాన పార్టీ కేడర్ జోష్‌లో ఉంది. బరిలో నిలిచే అభ్యర్థులు ప్రచార రథాలు, జెండాలు, ఫ్లెక్సీలు, ఇతర ఎన్నికల సామగ్రికి ఆర్డర్లు ఇచ్చారు. ఇదే సమయాన అసంతృప్త నేతలను బుజ్జగిస్తూ ప్రచారరంగంలోకి దిగారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షాలు అభ్యర్థులను ప్రకటించే నాటికి రెండు, మూడు దఫాలు నియోజకవర్గాన్ని అంతా చుట్టేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. ముఖ్యనేతలకు దిశానిర్దేశం.. నియోజకవర్గాల్లో అభ్యర్థులు ముఖ్య నేతలతో సమావేశమవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలతో జరిగిన లబ్ధిని గడపగడపకూ తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఖమ్మంలో ఇప్పటికే ముఖ్యనేతలతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమావేశమయ్యారు. ఖమ్మం నగరంలోని 60 డివిజన్లతో పాటు రఘునాథపాలెం మండలంలో చేసిన అభివృద్ధి పనులతో ప్రత్యేకంగా కరపత్రాలు రూపొందిస్తున్నారు. వీటిని తమ కేడర్‌తో ఇంటింటికీ చేర్చేలా ప్రణాళిక రూపొందించారు. మరోపక్క పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో కూడా ఈ దిశగా కార్యాచరణ కొనసాగుతోంది. పార్టీ అండగా ఉంటుందంటూ.. జిల్లాలోని పాలేరు, వైరా, మధిర వంటి నియోజకవర్గాల్లో కొందరి నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. వీరు బహిరంగంగానే పార్టీ అభ్యర్థులను వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్లో టికెట్ ఆశించిన ఆశావహులను బుజ్జగించే బాధ్యతను పార్టీ అధిష్టానం పలువురు నేతలకు అప్పగించింది. పాలేరులో కందాల ఉపేందర్‌రెడ్డికి టికెట్ ఖరారు కావడంతో జిల్లావ్యాప్తంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు భేటీ అవుతున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న తుమ్మలను నేతలు బుజ్జగిస్తున్నారు. ఇక మధిరలో బొమ్మెర రామ్మూర్తి తన అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేస్తూ ఉద్యమకారులకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైరాలో రాములునాయక్‌కు టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. కొందరి కారణంగానే తనకు టికెట్ రాలేద ని వ్యాఖ్యానించారు. వీరిని బుజ్జగించేందుకు అధి ష్టానం ప్రయత్నిస్తోంది. పార్టీ మళ్లీ గెలిస్తే మరెన్నో పదవులు అందుబాటులో ఉంటాయని, ఎమ్మెల్యే టికెట్ ఒకటే లక్ష్యం కాదని నచ్చచెప్పడంలో నిమగ్నమయ్యారు. సమయాన్ని వినియోగించుకునేలా.. అన్ని పార్టీల కన్నా ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల వరకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా సిద్ధమవుతున్నారు. అభ్యర్థులు.. తమ కార్యకర్తలు, అభిమానులు, నేతలతో సమావేశమవుతూ ప్రచార వ్యూహా లను ఖరారు చేస్తున్నారు. దాదాపు వంద రోజుల వరకు సమయం ఉన్నందున ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ప్రకటించేలోగానే ఒకటికి, రెండుసార్లు ప్రజలను కలవాలని సూచిస్తున్నారు. మరోవైపు టికెట్ రాకుండా అసంతృప్తితో ఉన్న వారిని బుజ్జగించి.. వారినీ తమతో కలుపుకునేలా చర్యలు చేపడుతున్నారు. దూకుడుగా కార్యక్రమాలు.. జిల్లాలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, కొత్త పనులకు శంకుస్థాపన, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడంపై బీఆర్ఎస్ నేతలు దృష్టి సారించారు. ప్రధానంగా దివ్యాంగులకు పెంచిన ఆసరా పింఛన్ల పంపిణీ, బీసీ బంధు చెక్కులు పంపిణీ చేస్తూ బీఆర్ఎస్కు అండగా ఉండాలని కోరుతున్నారు. జిల్లాతో పాటు ఖమ్మం నియోజకవర్గంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విస్తృతంగా పర్యటిస్తుండగా.. పాలేరులో కందాల ఉపేందర్‌రెడ్డి, సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య, మధిరలో లింగాల కమల్‌రాజు లబ్ధిదారులకు సంక్షేమ పథకాల పంపిణీ చేపడుతున్నారు. అలాగే, సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. అలాగే, గ్రామాలు, మండల కేంద్రాలు, మున్సిపల్ డివిజన్ల వారీగా గతంలో తమకు ఎక్కడ తక్కువ ఓట్లు వచ్చాయో లెక్కలు వేస్తూ ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నారు. -
TS Election 2023: ‘ఆది’ నుంచి అదే పోరు!
రాజన్న: వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబును ‘ఆది’ నుంచి పౌరసత్వం సమస్య వెంటాడుతూనే ఉంది. కోర్టుల్లో పోరాడుతూనే 2009 నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్లు కేటాయించే అంశంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆరసైతం మొట్టమొదటగా రమేశ్‌బాబు పౌరసత్వం అంశాన్ని మాట్లాడుతూ టికెట్టు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. పౌరసత్వం కేసు కోర్టులో ఉన్నందునే వేములవాడలో అభ్యర్థిని మార్చాల్సి వస్తోందని ప్రకటించారు. బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న చల్మెడ లక్ష్మీనరసింహారావు నియోజకవర్గంలో చురుకుగా పర్యటిస్తుండగా.. రమేశ్‌బాబు అనుచరులు మాత్రం ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 జూన్‌లో కేంద్ర హోంశాఖలో ఫిర్యాదు చేశారు. ఏడాది కాలంపాటు దేశంలో లేడని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీని విచారణకు ఆదేశించింది. రమేశ్‌బాబు 96 రోజులు మాత్రమే భారతదేశంలో ఉన్నట్లు నివేదికను సమర్పించారు. 2010 ఉపఎన్నికల తర్వాత రమేశ్‌బాబు ఎన్నికను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆది శ్రీనివాస్ ఆశ్రయించారు. దీంతో 2013 ఆగస్టు 14న రమేశ్‌బాబు పౌరసత్వం రద్దు చేయడమే కాకుండా ఓటర్ జాబితాలో పేరు తొలగించాలని తీర్పినిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ రమేశ్‌బాబు 2013లో సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా.. కోర్టు స్టే ఇచ్చింది. రమేశ్‌బాబుకు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని ఆది శ్రీనివాస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ వాదనలు కొనసాగుతున్న క్రమంలో ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ తేల్చాలని రమేశ్‌బాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో ఈ అంశం కేంద్ర హోంశాఖకు వెళ్లింది. రమేశ్‌బాబు విజ్ఞప్తితో కేంద్రహోంశాఖ త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. త్రీమెన్ కమిటీ సైతం రమేశ్‌బాబు మోసపూరితంగా పౌరసత్వం పొందారని తేల్చి చెబుతూ.. ఆగస్టు 31, 2017న పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అంశాన్ని రివ్యూ చేయాలని మరోసారి కేంద్రహోంశాఖకు రమేశ్‌బాబు విజ్ఞప్తి చేయగా.. జర్మనీ పౌరసత్వం ఉందంటూ డిసెంబర్ 17, 2017న భారతదేశ పౌరసత్వం రద్దు చేసింది. దీనిపై రమేశ్‌బాబు జనవరి 5, 2018న హైకోర్టును ఆశ్రయించగా.. స్టే లభించింది. స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఆది శ్రీనివాస్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈక్రమంలో హైకోర్టు జూలై 10, 2019న రమేశ్‌బాబు పౌరసత్వాన్ని కేంద్రహోంశాఖ మూడు నెలల్లో తేల్చాలని ఆదేశించింది. కేంద్రహోంశాఖ రమేశ్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి కేసు కొనసాగుతోంది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో రెండు, మూడు నెలల్లో తీర్పు వస్తుందన్న అంచనాతో బీఆర్ఎస్ పార్టీ అధినేత టికెట్ చల్మెడ లక్ష్మీనరసింహారావుకు కేటాయించినట్లు ప్రకటించారు. నాలుగుసార్లు గెలుపు.. రమేశ్‌బాబు 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2010 ఉపఎన్నికల సందర్బంగా టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరి ఆపార్టీ టికెట్‌పై గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. భావోద్వేగ ప్రకటన.. టిక్కెట్టు రాలేదని తెలిసిన తర్వాత ఎమ్మెల్యే రమేశ్‌బాబు భావోద్వేగ ప్రకటన చేశారు. ‘సవాళ్లు వచ్చినప్పుడే ధీటుగా నిలబడాలి. ఎన్నికల కోసం అభ్యర్ధులు వెనువెంటనే పుట్టరు. ప్రజాసేవ ద్వారా ఈ అర్హతలు సంపాదించుకోవాలి. పౌరసత్వంపై అక్టోబర్‌లో మనకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ సమస్య తీరితే మనకు ఆటంకాలు ఉండవు. ఉత్తమంగా పనిచేశానన్న సీఎం గారి వ్యాఖ్యలే మన దశాబ్దకాలం నిస్వార్థ ప్రజాసేవకు నిదర్శనం.’ అంటూ భావోద్వేగంతో కూడిన పోస్టు చేశారు. -
ముందుగా మేల్కొంటే విజయం తథ్యమే!
ఇటీవల ముగిసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలలో ప్రసంగిం చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు... తనకూ, టీఆర్ఎస్ పార్టీకీ రాజకీయాలంటే ఒక క్రీడ కానే కాదనీ, అదొక విద్యుక్త ధర్మమనీ వ్యాఖ్యానించారు. ఆయన చెప్పిన మాటలను లోతుగా అర్థం చేసుకుంటే అనేక భావాలు గోచరిస్తాయి. 2014 తర్వాత, మోదీ నేతృత్వంలోని బీజేపీ అజేయంగా మారిందని కొందరి భావన. దానివల్లనే పలువురు బీజేపీ యేతర రాజకీయ ప్రత్యర్థులూ, వివిధ పార్టీల నాయకులూ కొంతమేరకు అయోమయంలో పడిపోయారు. అది సహజం. అయితే 2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో మోదీ నేతృత్వంలోని బీజేపీని ఓడించాలంటే కష్టం కావచ్చేమోగానీ అసాధ్యం మాత్రం కాదు. కాకపోతే దాన్నొక టాస్క్‌లాగా తీసుకోవాలి. అదే సమయంలో ఒక గొప్ప వ్యూహాన్ని కూడా రూపొందించాలి. దాన్ని అంకిత భావంతో అమలు చేయాలి. ఇటీవల 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో సాధించిన విజయా లను విశ్లేషిస్తే, దేశంలో ఎన్నికల వ్యూహంలో గణనీయమైన మార్పులు వచ్చాయని అవగతమవుతున్నది. ఈ విషయాన్ని చాలా రాజకీయ పార్టీలు అర్థం చేసుకోలేకపోయాయి. బీఎస్పీ, ఎస్పీలతో సహా కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోవడానికి కారణం ఇదే. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ప్రాంతీయ పార్టీల సమర్థతను చాటి చెబుతోంది. 70వ దశకంలో వామపక్షాలతో సహా అన్ని రకాల మిత వాద భావజాలం ఉన్న రాజకీయ పార్టీల కన్సార్షియం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో జనతా పార్టీగా ఆవిర్భవించి విజయవంతంగా ఎన్నికలను గెలిచింది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్ట మొదటి కాంగ్రెసేతర ప్రభు త్వంగా 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వం రికార్డు సృష్టిం చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీని ఎవరు ఎదుర్కోగలరన్న ప్రశ్న ప్రజల ముందుకు పదేపదే తీసు కొచ్చినా ప్రయోజనం లేకపోయింది. అలాగే, ఇప్పుడు బీజేపీ, దాని మద్దతుదారులు కూడా మోదీని ఎవరు ఎదుర్కోగలరని అడుగుతున్నారు. జనతా పార్టీ ప్రయోగం దేశ రాజకీయ ఎజెండాలో కొత్త దృశ్యాలను ఆవిష్కరించింది. ఈ ప్రయోగమే ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, యునైటెడ్ పీపుల్స్ అల యన్స్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ తదితర ఫ్రంట్ల శ్రేణికి మార్గదర్శకత్వం వహించిందనవచ్చు. ఈసారి ప్రయోగం ఫ్రంట్ కాకపోవచ్చు. అన్ని రకాల సారూప్య రాజకీయ పార్టీల కన్సార్షియం కావచ్చు. మోదీ నాయకత్వంలో ఒకప్పుడు ప్రమాదంగా భావించిన హిందుత్వమే నేడు ప్రధాన ఎన్నికల ఎజెండాగా మారింది. అందువల్ల, ఇక్కడ సందేశం చాలా స్పష్టంగా ఉంది. తదుపరి సార్వత్రిక ఎన్నికలలో మోదీ నేతృ త్వంలోని బీజేపీ బలాన్ని ఒంటరిగా ఏ జాతీయ పార్టీ తగ్గించ లేక పోవచ్చు. కానీ కేసీఆర్ ప్రతిపాదించిన కాంగ్రెసేతర, బీజేపీ యేతర పార్టీల కన్సార్షియం కచ్చితంగా బీజేపీ విజయానికి అడ్డుకట్ట వేయగలదు. బీజేపీ హిందుత్వానికి వ్యతిరేకంగా ఈ కన్సార్టియం... లౌకికవాదం, ప్రజా సంక్షేమం అనే లక్ష్యాలను తీసుకోవాలి. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఉటంకించాలి. ప్రజా సమస్యలకు పరిష్కారాలు చూపాలి. కాంగ్రెస్ మద్దతు లేకుండా బీజేపీకి వ్యతి రేకంగా కన్సార్టియంకు ఆస్కారం లేదన్న వాదన సరైంది కాదు. నేడు దేశంలో బీజేపీకి అడ్డుకట్ట వేయగలిగేది ప్రాంతీయ పార్టీలేనన్న విషయాన్ని గుర్తెరగాలి. ఈ నేపథ్యంలో భవిష్య త్లో రూపుదిద్దుకోనున్న కన్సార్టియంలో, కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామిగా చేరాలనుకుంటే, అన్ని పార్టీలూ స్వాగతించాలి. కానీ నాయకత్వం ఇవ్వకూడదు. కేసీఆర్ చెప్పినట్లుగా ఎన్నికలను విద్యుక్త ధర్మంలాగా చూడాలి. 2024 ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలను నేటి నుంచే ఒక టాస్క్‌గా తీసుకోవాలి. తెలంగాణలో కోట్లాది మందికి లబ్ధి చేకూర్చేలా విజయవంతంగా అమలుచేస్తున్న పథకాలను, కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. దేశంలోని కాంగ్రెసేతర, బీజేపీ యేతర పార్టీలు కలిసి ఎన్నిక లకు చాలా ముందు నుంచే బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా ప్రచారాన్ని చేపట్టాలి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని నిలువరించడం పూర్తిగా సాధ్యమే. -వనం జ్వాలానరసింహారావు వ్యాసకర్త తెలంగాణ సీఎం చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ -
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
సాక్షి, డిండి(నల్లగొండ): రాష్ట్రంలో భవిష్యత్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా డిండి మండల పరిధిలోని శేషాయికుంటలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహావిష్కరణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ముం దుకు వెళ్లాలని సూచించారు. సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే అని, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల జీవితాలను దుర్భరంగా మార్చారన్నారుఏడున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు. నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 12 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్‌పార్టీ కైవసం చేసుకోనుందని ఆ దిశగా పార్టీని నడిపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే బాలునాయక్, అఖిల భారత ఆదివాసి జాతీయ కోఆర్డినేటర్ కిషన్ నాయక్, డిండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లవెల్లి రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలు మార్పు తీసుకురావాలి: కమల్
సాక్షి, వేలూరు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మార్పును తీసుకురావాలని సినీ నటుడు, మక్కల్ నీది మయం పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ తెలిపారు. మంగళవారం తిరువణ్ణామలై జిల్లాలో కమల్‌హాసన్ ప్రచారం చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో నాలుగు ప్రాంతాల్లో ప్రజలను ఆయన సందర్శించారు. ప్రజలకు అభివాదం మాత్రం చేస్తూ ఎటువంటి ప్రచారం చేయకుండా వెళ్లారు. అనంతరం ప్రయివేటు కల్యాణ మండపంలో ఆయన అభిమానులు, కార్యకర్తలతో చర్చించారు. రాజకీయల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. చదవండి: రజనీ రాజకీయ పార్టీ పొంగల్‌కు పక్కా! మక్కల్ నీది మయం అధికారానికి వచ్చిన వెంటనే సెయ్యారులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని, నిరుపేదలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తిరువణ్ణామలై జిల్లాలో అధికంగా గ్రామీణ కళాకారులున్నారని, వారి కష్టాలు తనకు తెలుసునన్నారు. అధికారంలోకి వస్తే కుటుంబం కోసం ఇళ్లల్లో శ్రమిస్తున్న గృహిణులకు ప్రత్యేకంగా జీతాలు ఇస్తామని ప్రకటించారు. చదవండి: రజనీ రెడీ అంటే సీఎం అభ్యర్థిగా పోటీకి సై! -
బిహార్ ‘చాణక్యుడు’ ఏకాకి అయినట్లేనా?
బిహార్ చాణక్యుడిగా పేరొందినవాడు ఇప్పుడు ఏకాకి అయ్యాడు. మిత్రులు, ప్రత్యర్థులు ఇరువురూ తనను ఇప్పుడు వదిలిపెట్టేశారు. ఇప్పుడు బిహార్ ప్రజలు మాత్రమే ఆయన ఆశాకిరణం. నితీశ్‌పై, ఆయన రాజకీయాలపై ఈ ఎన్నికలు ఒక రెఫరెండం లాంటివి. 69 ఏళ్ల వయసులో నితీశ్ తన రాజకీయ జీవితంలోనే అతి పెద్ద సమరంలో తలపడుతున్నారు. బీజేపీతో కూటమి ఇప్పుడు ఒక ముసుగు మాత్రమే. తగినన్ని స్థానాలు గెల్చుకోకపోతే నితీశ్‌ని బీజేపీ చెత్తబుట్టలోకి తోసేస్తుంది. ‘ఎన్డీఏకి నితీశ్ ప్రతిరూపం వంటివాడని, ఎన్నికల తర్వాత ఆయనే ముఖ్యమంత్రి’ అని అమిత్ షా అన్న పదాలకు అర్థం నితీశ్‌కి బాగా తెలుసు. అది ఎలాంటి విశ్వాసమూ లేకుండానే పునరుద్ధరించే హామీ వంటిది. నమ్రతకు మారుపేరుగా నిలిచిన నితీశ్ మొదటిసారిగా బహిరంగ సభల్లోనే ఉన్నట్లుండి ఆగ్రహ ప్రదర్శన చేస్తున్నారంటే ఆశ్చ ర్యపడాల్సింది లేదు. అది ఆయన ఒంటరితనానికి చక్కని వ్యక్తీకరణగా కూడా చెప్పవచ్చు. పరిమితమైన ఆకర్షణా శక్తి, బలహీనమైన రాజకీయ పార్టీ కలిగి ఉన్నప్పటికీ భారతీయ చరిత్రలో మూడు దఫాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఏకైక రాజకీయ నేత బహుశా నితీశ్ మాత్రమే కావచ్చు. తన పార్టీకి 20 శాతం ఓట్ల దన్ను మాత్రమే ఉన్నప్పటికీ బిహార్‌లో ఇప్పటికీ ప్రశ్నించలేని గొప్పనేత ఆయన. 1994లో జార్జి ఫెర్నాండెజ్‌తో కలిసి లాలూయాదవ్ నుంచి వేరుపడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కూడా పెద్దగా ముద్రవేయని జనతాదళ్ (యునైటెడ్) పార్టీని ఈయన ముందుండి నడిపించాడు. ఇద్దరు బలమైన శత్రువుల మధ్య చీలికల నుంచి పుట్టుకొచ్చే ఉప ఉత్పత్తి చందాన నితీశ్ బిహార్ రాజకీయాల్లో అగ్రస్థానంలోకి వచ్చారు. బీజేపీ, ఆర్జేడీలు రెండు భిన్న భావజాలాలతో ఘర్షిస్తూ వచ్చాయి. లాలూయాదవ్ ఆర్జేడీ ప్రబోధించిన మండల్ రాజకీయాలకు పూర్తి వ్యత్యాసంగా బీజేపీ హిందుత్వ కొనసాగుతూ వచ్చింది. మండల్ రాజకీయాలకు చెందిన అసలుసిసలు యోధుడైన నితీశ్ ఇంతకాలంగా బీజేపీ శకటంమీదే ప్రయాణిస్తూ వచ్చారు కానీ బీజేపీ ప్రధాన బ్రాండ్ అయిన హిందుత్వను నితీశ్ స్వీకరించలేదు. బిహార్ చాణక్యుడిలా నితీశ్ రాజకీయ చతురతకు, సహజ జ్ఞానానికి మారుపేరులా గుర్తింపు పొందేవారు. పై రెండు భిన్న పార్టీలకు నిత్యం ఒకరిపైకి మరొకరిని ఎగదోలుతూనే గత 15 సంవత్సరాలుగా బిహార్‌లో కీలకనేతగా మనగలుగుతూ వచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ రెండు పార్టీలుకూడా నితీశ్ జేడీయూ కంటే పెద్దవే కానీ అన్నివేళలా ద్వితీయ స్థానంలో ఉండిపోవడానికి అంగీకరించేవి. లాలూయాదవ్‌ను అధికారానికి దూరం పెట్టాలని బీజేపీ కోరుకుంటే, బీజేపీని దూరం పెట్టాలని లాలూయాదవ్ ప్రయత్నించేవారు. ఈ ఇద్దరి వాంఛను నితీశ్ బ్రహ్మాం డంగా నెరవేరుస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు బీజేపీ ఇక చాలు అనే అభిప్రాయానికి వచ్చేసింది. తనకు ఏమాత్రం కాస్త అధికంగా అసెంబ్లీ స్థానాలు దక్కితే నితీశ్‌ను తోసిపారేసేందుకు కూడా బీజేపీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈసారి నితీశ్ ఛాయలో మనుగడ సాధించడం కాకుండా తన సొంత దారిలో తాను పయనించాలని బీజేపీ నిర్ణయించేసుకుంది. బీజేపీ ఆకాంక్షను రెండు విషయాలు ప్రజ్వరిల్లచేశాయి. ఒకటి, నితీశ్ ప్రజాదరణ ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. ప్రతి సర్వే ఈ అంశాన్ని చాటి చెబుతోంది. లోక్‌నీతి–సీఎస్డీఎస్ సర్వేలో, 43 శాతం మంది ఓటర్లు మళ్లీ నితీశ్ ప్రభుత్వం రాకూడదని కోరుకుంటున్నట్లు తేలింది. 38 శాతం మంది మాత్రమే ఆయన మళ్లీ అధికారం చేపట్టాలని కోరుకుంటున్నారు. ఇక తన రేటింగులను చూస్తే నితీశ్ ప్రజాదరణ మరింతగా పడిపోయింది. 2010లో నితీశ్‌కు 77 శాతం మంది ఓటర్ల ఆమోదం ఉండేది. ఇక 2015 అసెంబ్లీ ఎన్నికల్లో అయితే అది 80 శాతానికి పెరిగింది. కానీ ఆ తర్వాతి నుంచి అది తగ్గుతూ 52 శాతానికి పడిపోయింది. మరీ దారుణంగా 2020 ఎన్నికల నాటికి అది 28 శాతానికి పడిపోవడం గమనార్హం. ఇకపోతే సీ–ఓటర్ సర్వే ప్రకారం చూస్తే, నితీశ్ ప్రభుత్వ పనితీరు పట్ల 25 శాతంమంది మాత్రమే సంతోషం వ్యక్తం చేస్తుండగా, 46 శాతం మంది అసమ్మతి వ్యక్తం చేశారు. నితీశ్ ఇప్పుడు తమకు ఏరకంగానూ విలువైన వ్యక్తి కాదని బీజేపీకి అర్థమైపోయింది. రెండు, 1990ల నుంచి బిహార్ ఎన్నికలను మండల్ యోధులే శాసిస్తూ వచ్చారు. తొలి 15 ఏళ్లలో అంటే 2005 సంవత్సరం వరకు రాష్ట్రంలో మండల్ ఉద్యమానికి లాలూయాదవ్ బలమైన ప్రతినిధిగా ఉండేవారు. అలాంటి లాలూ ఇప్పుడు జైలులో ఉన్నారు. లాలూ కుమారుడు తేజస్వి పార్టీ నాయకత్వాన్ని చేజిక్కించుకున్నారు. లాలూ యాదవ్ వారసత్వాన్ని మరుగునపర్చి తన సొంత ప్రతిష్టను పెంచుకోవడం కోసం తేజస్వి ప్రయత్నిస్తున్నారు. అణచివేతకు గురైన వెనుకబడిన కులం చైతన్యాన్ని తన తండ్రి లాలూ మేల్కొల్పడం కాదనలేని వాస్తవమని తేజస్వి గుర్తించాడు. తన తండ్రి కారణంగా ఆర్జేడీ సామాజిక పునాది చెక్కుచెదరలేదని తేజస్వికి తెలుసు కానీ ఎన్నికల్లో గెలవడానికి అది మాత్రమే సరిపోదని గ్రహించాడు. కొత్త సామాజిక పునాదిని తాను సృష్టించుకోవాలని, కొత్త ఆకాంక్షలను వ్యక్తపరుస్తున్న వర్గం విశ్వసనీయతను సాధించుకోవాలని బోధపర్చుకున్నాడు. అందుకే తాను గెలిస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టిస్తానని హామీ ఇచ్చాడు. ఇది ఎన్నికల ఫలితాలను సమూలంగా మార్చగలుగుతుందా అనేది ఇకపై తేలాల్సి ఉంది. నితీశ్ కూడా మండల్ యోధుడే. వెనుకబడిన, పీడిత కులాల సామాజిక, రాజకీయ సాధికారతకు లాలూ బాధ్యుడు కాగా, ఈ సామాజిక బృందం ఆకాంక్షలకు నితీశ్ సాధనమయ్యారు. తన తొలి దఫా పాలనలో లాలూ అరాచకత్వాన్ని అరికట్టడానికి నితీశ్ ప్రయత్నిస్తూనే పీడిత కులాల ప్రాథమిక అవసరాలను తీర్చడానికి కృషి చేశారు. కానీ రెండో దఫా పాలనలో వాటిని పట్టించుకోలేదు. ఇక మూడోదశ పాలన మొత్తం అనిశ్చితి, అనాసక్తతతో గడిచింది. ఈ అన్నింటి పరిణామాల నేపథ్యంలో బీజేపీని వాడుకునే కళలో నితీశ్ రాటుదేలుతూ వచ్చారు. అధికారంలో ఉండటానికి తాను బీజేపీని వాడుకుంటే, మండల్ రాజకీయాల ప్రభావాన్ని తటస్థం చేయాడనికి బీజేపీ నితీశ్‌ని వాడుకుంది. అంతకుమించి హిందుత్వ రాజకీయాలను నితీశ్ ప్రోత్సహించలేదు. ఇప్పుడు నితీశ్ ఈ ఎన్నికల్లో గెలుపు సాధించకపోతే చిరాగ్ పాశ్వాన్‌ను దరిచేర్చుకుని నీతీశ్‌ని లక్ష్యంగా చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. రాముడికి హనుమాన్ లాగా తాను మోదీని సేవించడానికి సిద్ధమని చిరాగ్ ప్రకటించేశాడు కాబట్టి బీజేపీ వెనక్కు తిరిగి చూసుకోవలసిన పనిలేదు కూడా. మరి నితీశ్ పరిస్థితి ఏమిటి? బిహార్ రాజకీయాల్లో ఆయన స్థానం వేగంగా పడిపోతోంది. అశుతోష్ – వ్యాసకర్త రచయిత, జర్నలిస్టు -
సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలం: మంత్రి
పట్నా/న్యూఢిల్లీ: ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగిసేలోగానే బిహార్‌లో శాసన సభ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్‌కుమార్ సింగ్(ఆర్కే సింగ్) శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఒంటరిగానే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని ధీమా వ్యక్తం చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవా కొనసాగిందని, ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే అదే సమయంలో జనతాదళ్ పార్టీతో పొత్తు కొనసాగుతుందని, లోక్‌సభ ఎన్నికల ఫలితం సీట్ల పంపకంలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయం చర్చించి త్వరలోనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. (చదవండి: ఎన్డీయేలో చేరనున్న జితన్ రామ్ మాంఝీ) ‘‘బిహార్‌లో మేం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలం. అందులో ఎలాంటి సందేహం లేదు. 1996 నుంచి జేడీయూతో బంధం ఉంది. దానిని వదులుకోవాలని అనుకోవడం లేదు. మా స్నేహితులను వదులుకోం. అందుకే సీట్ల పంపకం ప్రక్రియలో సున్నితంగా వ్యవహరిస్తున్నాం. అలా అని మా మధ్య విభేదాలలేమీ లేవు. లోక్‌సభ ఎన్నికల ప్రభావం అయితే దీనిపై ఉంటుందని చెప్పగలను’’ అని ఆర్కే సింగ్ చెప్పుకొచ్చారు. కాగా కేంద్ర విద్యుత్ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన బిహార్‌లోని అరా నియోజకవర్గ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ( చదవండి: నవంబర్ 29లోగా బిహార్ ఎన్నికలు) ఇక ఆర్కే సింగ్ వ్యాఖ్యలపై జేడీయూ సీనియర్లు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏవిధంగా స్పందిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జితన్ రామ్ మాంఝీ, శరద్ యాదవ్ వంటి సీనియర్ నేతల ఘర్ వాపసీకి రంగం సిద్ధం చేసిన జేడీయూ సీట్ల సర్దుబాటు విషయంలో ఎలా ముందుకు సాగుతుందనేది చర్చనీయాంశమైంది. జితన్ రామ్ మాంఝీని ఎన్డీయేలోకి ఆహ్వానించిన జనతాదళ్ హిందుస్తానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎమ్) పార్టీకి తొమ్మిది సీట్లు కేటాయించిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.(చదవండి: నితీశే బిహార్ సీఎం అభ్యర్థి) -
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం!
పట్నా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హిందుస్తానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎమ్) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ అధికార ఎన్డీయే కూటమితో జట్టుకట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు 9 స్థానాల్లో పోటీచేసేందుకు వీలుగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఎన్డీయేలో భాగమైన జేడీయూ కోటా కింద 9 సీట్లు హెచ్‌ఏఎమ్‌కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన గురువారం విడుదల చేయనున్నట్లు హెచ్ఏఎమ్ అధికార ప్రతినిధి దానిశ్ రిజ్వాన్ తెలిపారు. అయితే తాము జేడీయూ తరఫున ఎన్నికల బరిలో నిలుస్తామే తప్ప ఆ పార్టీలో హెచ్‌ఏఎమ్‌ను విలీనం చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామన్నారు. (చదవండి: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వాయిదాకు సుప్రీంకోర్టు నో) అదే విధంగా ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నితీశ్‌జీ తీసుకుంటున్న చర్యలు తమను ఆకర్షించాయని రిజ్వాన్ చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు సీట్ల కేటాయింపు విషయం పెద్ద సమస్యేమీ కాదని, ఎన్డీయేలో భాగస్వామ్యం కావడం ముఖ్యమన్నారు. కాగా ప్రతిపక్ష ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బంధన్ కూటమి నుంచి వైదొలిగిన దాదాపు నెల రోజుల తర్వాత జితన్ రామ్ మాంఝీ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక 2015లో జేడీయూను వీడిన జితన్ రామ్ సొంతంగా హిందూస్తాన్ అవామ్ మోర్చా పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీ కూటమిలో చేరిన ఆయన ఆగష్టులో మహాఘట్బంధన్కు గుడ్ బై చెప్పారు. మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరుతుండటంతో.. ‘ఘర్ వాపసీ’కి రంగం సిద్ధమైందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. (చదవండి: నితీశే బిహార్ సీఎం అభ్యర్థి) కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ(జనతాదళ్, ఐక్య), ఎల్జేపీ(లోక్‌జనశక్తి పార్టీ)లు ఐక్యంగానే బరిలోకి దిగుతాయని, ముఖ్యమంత్రి నితీశ్ కుమారే సీఎం అభ్యర్థి అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇది వరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బిహార్‌లో కూడా ప్రతిపక్షం నిర్వీర్యమైందనీ, తామే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు జితన్ రామ్ మాంఝీతో పాటు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన జేడీయూ మాజీ నేత శరద్ యాదవ్‌ను కూడా తిరిగి ఆహ్వానించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి విజయ్?
చెన్నై: రానున్న శాసనసభ ఎన్నికల బరిలోకి విజయ్ దిగనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో జరుగుతున్న చర్చ ఇదే. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారాయి. ఇలాంటి సమయంలో యువ నటుడు దళపతి విజయ్ రాజకీయ రంగప్రవేశానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తాజా సమాచారం. ఈ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది. అందులో భాగంగా విజయ్ తండ్రి, ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఈయన కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పార్టీ పేరును నమోదు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగా ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ న్యాయవాదితో సంప్రదించినట్లు తెలిసింది. -
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్యల రోజురోజుకు పెరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా పలు స్థానాల్లో జరగాల్సిన లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. కరోనా వైరస్, వరదల నేపథ్యంలో అసెంబ్లీ స్థానాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా వేసినట్లు గురువారం ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఆరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ ఉప ఎన్నికలు సెప్టెంబర్ 7 వరకు నిర్వహించాల్సింది. తాజాగా ఎన్నికల సంఘం ప్రకటనతో అస్సాం, కేరళ, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. -
కొంచెం ముందు కుదిరితే బాగుండేది
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే క్రమంలో ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడం కొద్దిగా ముందు జరిగి ఉంటే బాగుండేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పొత్తులు కొంచెం త్వరగా కుదిరి కూటమిగా ప్రజల్లోకి వెళ్లి ఉంటే బాగుండేదని, అయినా తాము ప్రచారంలో ఎక్కడా వెనుకబడలేదని చెప్పారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతో పాటు టీవీల్లో విస్తృత ప్రచారం చేసినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే ఏఐసీసీకి ప్రాథమిక నివేదిక ఇచ్చామని, పోటీ చేసిన అభ్యర్థులు, గెలిచిన వారితో మాట్లాడుతున్నామని తెలిపారు. రెండు, మూడ్రోజుల్లో ఫలితాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామని చెప్పారు. ఈ ఫలితాలెలా ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎల్పీ సమావేశం గురించి ప్రస్తావించగా, ఎప్పుడు నిర్వహించాలనేది ఆలోచిస్తున్నామని చెప్పిన ఆయన.. ఇంకా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారమే కాలేదు కదా అని వ్యాఖ్యానించారు. కూటమి కొనసాగింపుపై రెండు, మూడ్రోజుల్లో కుంతియాతో చర్చిస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. సీఈసీ, ఈసీకి ఫిర్యాదు చేస్తాం.. ఎన్నికల్లో తమ ఓటమికి అనేక కారణాలున్నాయని, ఎన్నికల నిర్వహణపైనే ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయని ఉత్తమ్ చెప్పారు. ఒక్క శాతం ఓట్ల తేడాతో తమ అభ్యర్థులు ఓడిన ధర్మపురి, కోదాడ, ఇబ్రహీంపట్నంలలో ఎందుకు వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించలేదని ప్రశ్నించారు. అసలు వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కపెట్టడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పోలైన ఓట్లకు, లెక్కింపు ఓట్లకు తేడా ఉందనే విషయాన్ని చెప్పినా కనీసం సమాధానం చెప్పే వాళ్లు లేరని.. దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. మంచిర్యాల నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటల తర్వాత వేల సంఖ్యలో ఓట్లు పోల్ కావడం ఎలా సాధ్యమన్నారు. వీటన్నింటిపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ), రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి ప్రశ్నించగా తానేమీ మాట్లాడనని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. -
సిద్ధూ సర్కార్‌కు కౌంట్‌డౌన్ : యడ్యూరప్ప
సాక్షి, బెంగళూర్ : సిద్ధరామయ్య నేతృత్వంలోని పాలక కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప అన్నారు. ప్రజలంతా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఆయన కోరారు. తాను సుపరిపాలన అందచేస్తానని కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తున్నానన్నారు. షికార్పూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. కాగా సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, అందుకే పోలింగ్ శాతం పెరుగుతోందని బీజేపీ సీనియర్ నేత సదానందగౌడ అన్నారు. ప్రజలు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారన్నారు. యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. మే 15న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. -
మా పార్టీలో డబ్బే ముఖ్యం: వీరప్ప మొయిలీ
బెంగళూరు: త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. తమ పార్టీలో అభ్యర్థుల ఎంపికలో డబ్బు కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ శుక్రవారం చేసిన ఓ ట్వీట్‌తో వివాదం చెలరేగింది. ‘రాజకీయాల్లో డబ్బు సమస్యను కాంగ్రెస్ పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రజా పనుల విభాగం మంత్రి (మహదేవప్ప)తో కాంట్రాక్టర్లకున్న సంబంధాలను బట్టి అభ్యర్థులను ఎంపిక చేసే పరిస్థితి సరైంది కాదు’ అని మొయిలీ ఖాతా నుంచి వచ్చిన ఓ ట్వీట్ పేర్కొంది. అయితే ఇది ధ్రువీకృత ఖాతా కాదు. ‘ఆ ట్వీట్‌ను నేను చేయలేదు. అది వేరెవరో చేసిన తప్పు. ఆ ట్వీటర్ ఖాతా నా నియంత్రణలో లేదు’ అని చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొయిలీ కుమారుడు హర్షకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకూడదంటూ ఆ రాష్ట్ర ప్రజా పనుల విభాగం మంత్రి మహదేవప్ప ఇటీవల ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. -
రామ రామ... కృష్ణ కృష్ణ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వెంకటగిరి టీడీపీ టికెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జాక్‌పాట్ కొట్టారు. రామకృష్ణ వ్యవహారాలన్నీ తెలిసినా ఆయన గెలుస్తారో లేదో అనే అనుమానంతో చంద్రబాబు నాయుడు టికెట్ విషయంలో కాస్త తటపటాయించారు. అభ్యర్థి ఎలాంటి వాడైనా సరే గెలవాలి అనే ఆలోచ చంద్రబాబు మెదడులో మెదలడంతో రామకృష్ణకు ఎట్టకేలకు టికెట్ జాక్‌పాట్ తగిలింది. ఆయన వ్యాపార వ్యవహారాల్లో కూడా జాక్‌పాట్ సాధ్యమై అనతి కాలంలోనే రామకృష్ణ ఆర్థికంగా అందనంత ఎత్తుకు ఎదిగారనే ప్రచారం ఉంది. రవాణా వ్యవహారంలో చె న్నై నుంచి హైదరాబాద్, బెంగళూరు దాకా ఈయన పేరు మార్మోగుతోంది. రామకృష్ణ లారీ వెళుతోందంటే అధికారులు దాన్ని ఆపి అందులోని సరుకు బిల్లు కట్టిందా? కట్టకుండా వెళుతుందా? అని తనిఖీ చేసే ధైర్యం కూడా చేయలేని వాతావరణం సృష్టించుకుని తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంతకంతకు విస్తరించుకున్నారు. గోతాల వ్యాపారం నుంచి ట్రాన్స్‌పోర్టు కంపెనీ దాకా నాయుడుపేటలో 90వ దశకంలో రెండోరకం గోతాల వ్యాపారం చేసిన రామకృష్ణ తన బంధువులు ఇచ్చిన ఆర్థిక సహకారంతో మినీలారీని కోనుగోలు చేసి ఆంధ్ర నుంచి చెన్నైకు ధాన్యాన్ని రవాణా చే శారు. ఈ రవాణాలో అనేక అక్రమాలు సాగినట్లు అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. రామకృష్ణపై 1991లో సూళ్లూరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నంబరు 12-91 నమోదైంది. అప్పట్లో ధాన్యం అక్రమరవాణాను అడ్డుకున్న నాయుడుపేట మండల రెవెన్యూ అధికారి షంషేర్ అహ్మద్‌పై రామకృష్ణ దౌర్జన్యానికి పాల్పడడం వివాదస్పదమైంది. రామకృష్ణ సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అప్పట్లో జిల్లా ఉన్నతాధికారులు పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు యత్నించారు. అప్పటి రాపూరు ఎమ్మెల్యే నువ్వుల వెంకటరత్నంనాయుడు రామకృష్ణను ఈ గండం నుంచి గట్టెక్కించారని ఆ ప్రాంత వాసులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. ఎస్ఆర్ఎల్టీ పేరుతో నేటికి సుమారు 30 పైగా లారీలతో రామకృష్ణ నడుపుతున్న రవాణా వ్యాపారంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల అనంతపురంలో రామకృష్ణకు చెందిన ఓ లారీ బిల్లులు లేకుండా పాన్‌పరాగ్‌లు రవాణాచేస్తుండగా అధికారులు దాడులు చేసి సీజ్ చేస్తే అపరాధ రుసుం చెల్లించి విడిపించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా జీరో దందా (పన్ను చెల్లించకుండా చేసే వ్యాపారం) అని రామకృష్ణ వ్యతిరేకులు ఆరోపిస్తుంటే తనంటే గిట్టనందువల్లే ఈ ఆరోపణలు చేస్తున్నారని రామకృష్ణ చెబుతున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్‌తో చేనేతల స్థలం కైవసం వెంకటగిరి పట్టణం ఉపాధ్యనగర్ సమీపంలో 14544 చదరపు అడుగులు చేనేత సొసైటీకి చెందిన స్థలాన్ని రామకృష్ణ తన భార్య సింధు పేరుతో అప్పటి సొసైటీ అధ్యక్షుడు నీలాసుబ్బరాయులతో నెల్లూరులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని కైవసం చేసుకున్నారని చేనేతల్లో ఓ వర్గం ఆరోపిస్తోంది. ఈ వ్యవహరంపై వెంకటగిరి పట్టణానికి చెందిన చొప్పా వెంకటేశ్వర్లు అనే చేనేత కార్మికుడు లోకాయుక్తను ఆశ్రయించారు. కట్టడాలను నిలుపదల చేయాలని లోకాయుక్త ఆదేశించినా అధికారులు అమలు చేయడం లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణ కైవసం చేసుకున్న స్థలం చిన్నపిల్లల పార్కు కోసం కేటాయించిన ప్రజాప్రయోజన స్థలంగా చేనేతకార్మికులు చెబుతున్నారు. ఆ వివాదస్పద స్థలంలో మున్సిపాలిటీ అనుమతి లేకుండా ఎమ్మెల్యే పెద్దభవంతిని నిర్మిస్తున్నారు. అనుమతి లేకండా పేదలు చిన్న గూడుకట్టుకున్నా కూల్చేసే అధికారులు రామకృష్ణ నిర్మాణాలను పట్టిచుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశమేమీ కాదు. కురుగొండ్ల ఆస్తి కోట్లల్లోనే.. : వెంకటగిరి టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ నామినేషన్ సమయంలో దాఖలు చేసిన అఫిడివిట్లో మార్కెట్ విలువ ప్రకారం తన పేరుతో రూ 26. 65 కోట్లు ఆస్తి, తన భార్య సింధు పేరుతో రూ.17.53 కోట్లు ఆస్తిని చూపారు. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తులు దాదాపు మూడు రెట్లు అదనంగా ఉండే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే అఫిడివిట్లో ఆస్తులతోపాటు ఇద్దరిపేరుపై సుమారు రూ.28 కోట్లు అప్పుగా చూపారు.