TS Vemulawada Assembly Constituency: TS Election 2023: ‘ఆది’ నుంచి అదే పోరు!
Sakshi News home page

TS Election 2023: ‘ఆది’ నుంచి అదే పోరు!

Published Thu, Aug 24 2023 1:06 AM | Last Updated on Thu, Aug 24 2023 4:38 PM

- - Sakshi

రాజన్న: వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబును ‘ఆది’ నుంచి పౌరసత్వం సమస్య వెంటాడుతూనే ఉంది. కోర్టుల్లో పోరాడుతూనే 2009 నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్లు కేటాయించే అంశంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆరసైతం మొట్టమొదటగా రమేశ్‌బాబు పౌరసత్వం అంశాన్ని మాట్లాడుతూ టికెట్టు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు.

పౌరసత్వం కేసు కోర్టులో ఉన్నందునే వేములవాడలో అభ్యర్థిని మార్చాల్సి వస్తోందని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కించుకున్న చల్మెడ లక్ష్మీనరసింహారావు నియోజకవర్గంలో చురుకుగా పర్యటిస్తుండగా.. రమేశ్‌బాబు అనుచరులు మాత్రం ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు పౌరసత్వాన్ని సవాల్‌ చేస్తూ రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్‌ 2009 జూన్‌లో కేంద్ర హోంశాఖలో ఫిర్యాదు చేశారు. ఏడాది కాలంపాటు దేశంలో లేడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ అప్పటి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఎస్పీని విచారణకు ఆదేశించింది. రమేశ్‌బాబు 96 రోజులు మాత్రమే భారతదేశంలో ఉన్నట్లు నివేదికను సమర్పించారు. 2010 ఉపఎన్నికల తర్వాత రమేశ్‌బాబు ఎన్నికను సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆది శ్రీనివాస్‌ ఆశ్రయించారు. దీంతో 2013 ఆగస్టు 14న రమేశ్‌బాబు పౌరసత్వం రద్దు చేయడమే కాకుండా ఓటర్‌ జాబితాలో పేరు తొలగించాలని తీర్పినిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ రమేశ్‌బాబు 2013లో సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా.. కోర్టు స్టే ఇచ్చింది.

రమేశ్‌బాబుకు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని ఆది శ్రీనివాస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ వాదనలు కొనసాగుతున్న క్రమంలో ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ తేల్చాలని రమేశ్‌బాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో ఈ అంశం కేంద్ర హోంశాఖకు వెళ్లింది. రమేశ్‌బాబు విజ్ఞప్తితో కేంద్రహోంశాఖ త్రీమెన్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

త్రీమెన్‌ కమిటీ సైతం రమేశ్‌బాబు మోసపూరితంగా పౌరసత్వం పొందారని తేల్చి చెబుతూ.. ఆగస్టు 31, 2017న పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అంశాన్ని రివ్యూ చేయాలని మరోసారి కేంద్రహోంశాఖకు రమేశ్‌బాబు విజ్ఞప్తి చేయగా.. జర్మనీ పౌరసత్వం ఉందంటూ డిసెంబర్‌ 17, 2017న భారతదేశ పౌరసత్వం రద్దు చేసింది. దీనిపై రమేశ్‌బాబు జనవరి 5, 2018న హైకోర్టును ఆశ్రయించగా.. స్టే లభించింది.

స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఆది శ్రీనివాస్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈక్రమంలో హైకోర్టు జూలై 10, 2019న రమేశ్‌బాబు పౌరసత్వాన్ని కేంద్రహోంశాఖ మూడు నెలల్లో తేల్చాలని ఆదేశించింది. కేంద్రహోంశాఖ రమేశ్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి కేసు కొనసాగుతోంది. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో రెండు, మూడు నెలల్లో తీర్పు వస్తుందన్న అంచనాతో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత టికెట్‌ చల్మెడ లక్ష్మీనరసింహారావుకు కేటాయించినట్లు ప్రకటించారు.

నాలుగుసార్లు గెలుపు..
రమేశ్‌బాబు 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2010 ఉపఎన్నికల సందర్బంగా టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరి ఆపార్టీ టికెట్‌పై గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌పై గెలిచారు.

భావోద్వేగ ప్రకటన..
టిక్కెట్టు రాలేదని తెలిసిన తర్వాత ఎమ్మెల్యే రమేశ్‌బాబు భావోద్వేగ ప్రకటన చేశారు. ‘సవాళ్లు వచ్చినప్పుడే ధీటుగా నిలబడాలి. ఎన్నికల కోసం అభ్యర్ధులు వెనువెంటనే పుట్టరు. ప్రజాసేవ ద్వారా ఈ అర్హతలు సంపాదించుకోవాలి. పౌరసత్వంపై అక్టోబర్‌లో మనకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ సమస్య తీరితే మనకు ఆటంకాలు ఉండవు. ఉత్తమంగా పనిచేశానన్న సీఎం గారి వ్యాఖ్యలే మన దశాబ్దకాలం నిస్వార్థ ప్రజాసేవకు నిదర్శనం.’ అంటూ భావోద్వేగంతో కూడిన పోస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement