హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో తిరిగి టికెట్లు లభించిన బీఆర్‌ఎస్ అభ్యర్థులకు టికెట్లు దక్కిన ఆనందం మూడు రోజులు కూడా నిలవలేదు. ఇప్పటినుంచే చేయాల్సిన ఖర్చు తలచుకొని వారి ఆనందం ఆవిరైందంటున్నారు. ఎన్నికలకు నెల ముందు అభ్యర్థుల్ని ప్రకటిస్తే ఆ నెలరోజులు ఖర్చు చేస్తే సరిపోయేది. మూడు నాలుగు నెలల్లో ఎప్పుడు పోలింగ్ జరుగుతుందో తెలియదు.
అప్పటిదాకా దేనికీ వెనుకాడకుండా ఖర్చు చేయాల్సిందే. ‘కార్యకర్తలు, అభిమానులు నిత్యం వెంట ఉండేలా చూసు కోవాలి. బస్తీలు, కాలనీలు, సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించాలి. వారందరినీ కలుపుకోవాలి. ఇంటింటికీ వెళ్లి తల్లో నాలుకలా మసలుకోవాలి. ఇవన్నీ చేయాలంటే వెంట మందీమార్బలం, ఆర్భాటం, హడావుడి చేయాల్సిందే. అందుకు కార్యకర్తలకు ఉదయం టిఫిన్ల నుంచి మొదలుపెడితే రాత్రి మందు విందుల వరకు ఖర్చు చేయాల్సిందే.
నియోజకవర్గంలో శుభకార్యాలైనా, మంచైనా చైడెనా వెళ్లాలి. పేదల కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే వెళ్లి పరామర్శించాలి. ఖర్చుల నిమిత్తం డబ్బు అందజేయాలి. ఇలా ఒకటా రెండా.. దేనికై నా డబ్బు వెదజల్లాల్సిందే..తప్పదు. లేకుంటే వెంట వచ్చే వారుండరు. అభ్యర్థికి బలం లేదనే ముద్ర పడుతుంది’ అని ఓ అనుభవమున్న రాజకీయ వేత్త వ్యాఖ్యానించడం గమనార్హం.
ఖర్చే ఖర్చు..
‘ఇవన్నీ తలచుకుంటే అన్నకు నిద్ర పట్టడం లేదంటూ వ్యాఖ్యానించాడు కోర్‌సిటీలోని ఓ అభ్యర్థికి దగ్గరి వాడైన డివిజన్‌స్థాయి నేత’. ఓటర్ల జాబితాలు చూసి పేర్లు లేనివాళ్లను చేర్పించాలి. మచ్చిక చేసుకోవాలి. యువతకు, బస్తీసంఘాలకు పనులు చేయాలి.కోరింది ఇవ్వాలి. ఇక చివరి రోజుల్లో పంపిణీల సంగతి సరేసరి అంటూ చిట్టా బయట పెట్టాడు. ఇక శివారు నియోజకవర్గాల్లో ఖర్చు కోర్‌సిటీ కంటే డబుల్‌గా ఉంటుంది.
అక్కడ ఓటర్లు ఎక్కువ, అవసరాలు ఎక్కువ. డిమాండ్ కూడా ఎక్కువే. ఎంతలేదన్నా అభ్యర్థికి కనీసం రూ.50 కోట్లు ఖర్చు కానుందని అంచనా. భారీగా ఖర్చు చేసేవారు అంతకు రెట్టింపు చేయాల్సిన పరిస్థితి. దీంతో ఇప్పటినుంచే డబ్బులు సమకూర్చుకునే పనిలో పడ్డట్లు చెబుతున్నారు. టికెట్లు కాస్త ఆలస్యంగా ఇస్తే కాస్త ఖర్చయినా తగ్గేదని ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. టికెట్ వచ్చేంతదాకా ఒక టెన్షన్. వచ్చాక మరో టెన్షన్ అంటూ మరో సిట్టింగ్ సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. ఎక్కువో తక్కువో, సొంతడబ్బులో, పార్టీ ఇచ్చే ఫండో ఏదైనా కానీ గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు వెరసి దాదాపు రూ.1500 కోట్లకు పైగా ఖర్చు కాగలదని ఒక అంచనా.
పార్టీ కార్యక్రమాలకు..
ఈలోపున పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలూ అభ్యర్థులే దగ్గరుండి నిర్వహించాలి. అందుకు మందీమార్బలాన్ని సమకూర్చాలి. ముఖ్యనాయకులు సమావేశాలు ఏర్పాటుచేస్తే జనాన్ని సమీకరించాలి. పార్టీ తరపున నగరం పరిసరాల్లో జరిగే భారీ సభలకూ జనాన్ని తీసుకువెళ్లాలి. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేయాలి. ఊరికే ఎవరూ రారు..ప్రయాణ సదుపాయంతో పాటు నగదూ అందజేయాలి.
ప్రచారానికి..
ఇప్పుడు ప్రచార సరళి మారింది. గతంలోలా కరపత్రాలు, పోస్టర్లు, గోడరాతలు మాత్రమే సరిపోవు. అసలే సోషల్ మీడియా కాలం. అనుకూల ప్రచారం బాగా వైరల్‌అయ్యేలా చూసుకోవాలి. ఇప్పటికే చేసిన పనులు, చేయబోయే కార్యక్రమాల గురించి ప్రముఖులచే పాటలు రాయించాలి. పాడించాలి. యూట్యూబ్ చానళ్లలో మారుమోగి పోవాలి. దీనికి వ్యయం చేయక తప్పదు.
పండుగల వేళ..ప్రచారం రూటే వేరు..
అసలే శ్రావణ మాసం. ఇకనుంచి అన్నీ పండుగలే. వినాయకచవితి, దసరా, దీపావళి వంటి ముఖ్య పండుగలెన్నో ఉన్నాయి. వినాయక మంటపాల వద్ద పేరు మారుమోగి పోవాలంటే మండపాలు ఏర్పాటు నుంచి నవరాత్రులు ముగిసేంత దాకా ఏర్పాట్లు చేయాలి. ఎన్నో మండపాలకు చందాలివ్వాలి. ముగింపు రోజున భారీ కార్యక్రమాలు నిర్వహించాలి.
Comments
Please login to add a commentAdd a comment