సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకముందే ముఖ్యనేతలు పార్టీని వీడుతుండటం కలకలం రేపుతోంది. పక్షం రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యనేతలంతా పార్టీని వీడారు.
ఇప్పుడు మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి గుడ్‌బై చెప్పారు. జహీరాబాద్ టికెట్ ఆశించిన ఏర్పుల నరోత్తం నెల రోజుల క్రితమే వీడారు. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో ప్రగతిభవన్‌లో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో హస్తానికి స్థానికంగా బలమైన నాయకుడు లేకపోవడంతో డాక్టర్ ఎ.చంద్రశేఖర్‌కు టికెట్ ఖరారు చేసే యోచనలో అధిష్టానం ఉంది. మరోవైపు ఇదే నియోజకవర్గానికి చెందిన డీసీసీబీ మాజీ చైర్మన్ జైపాల్‌రెడ్డి పార్టీని వీడారు.
ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ ముఖ్యనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఇటు సంగారెడ్డి నియోజకవర్గంలోనూ పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. మండల స్థాయి నాయకులూ ఇదే బాటపట్టారు. అందోల్ నియోజకవర్గాలోనూ క్షేత్రస్థాయి నాయకులు వీడి ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇలా దాదాపు అన్ని చోట్ల కాంగ్రెస్ నుంచి వలసలు ఆ పార్టీని ఇబ్బందుల్లో పడేస్తోంది.
ముందే ఇలా..
ఇప్పటికే బీఆర్‌ఎస్ అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లాలో ఒక్క నర్సాపూర్ మినహా మిగతా అన్ని చోట్ల టికెట్లను ప్రకటించింది. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిత్వాలను ప్రకటించలేదు. ఒకవేళ అభ్యర్థిత్వాలు ప్రకటిస్తే ఆయా నియోజకవర్గాల్లో టికెట్ రాక భంగపడిన నేతలు మరికొంత మంది వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఒకట్రెండు నియోజకవర్గాలు మినహా అన్ని చోట్ల టికెట్‌ను ఇద్దరు, ముగ్గురు ఆశిస్తున్నారు. ఎవరికి వారే వ్యక్తిగతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్దిపేట్ జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి ముగ్గురు కాంగ్రెస్ నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అది దక్కని పక్షంలో ఒకరు పార్టీ మారే అవకాశాలున్నాయి.
బీఆర్‌ఎస్‌లోకి వలసలు..
కాంగ్రెస్ అసంతృప్త నేతలకు బీఆర్‌ఎస్ గాలం వేస్తోంది. ఆ పార్టీని వీడుతున్న నేతలు కారెక్కుతున్నారు. పార్టీని వీడుతున్న వారిలో ఒకరిద్దరు మినహా మిగతా ముఖ్యనేతలంతా గులాబీ పార్టీలో చేరుతున్నారు. పార్టీ టికెట్ల ప్రకటనకు ముందే పరిస్థితి ఉంటే ప్రకటన తర్వాత అసమ్మతి భగ్గు మనడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment