సంగారెడ్డి: జహీరాబాద్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు బరిలో ఉంటారని, సీఎం కేసీఆర్ నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండబోదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీష్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ ముఖ్యనేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధినేత నిర్ణయించిన అభ్యర్థి కోసం పార్టీ శ్రేణులంతా కలిసి కట్టుగా పనిచేయాలన్నారు.
సీఎం హ్యాట్రిక్ విజయంలో ఈ నియోజకవర్గ కూడా భాగస్వామ్యం కావాలని, అభివృద్ధిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇక్కడ బీఆర్‌ఎస్‌ను గెలిపించుకుని కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. మనస్పర్థలుంటే పక్కన బెట్టి మాణిక్‌రావును మూడోసారి కూడా భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని దిశానిర్దేశం చేశారు. పని చేసే ప్రతి కార్యకర్తకు, నాయకులకు వచ్చే రోజుల్లో తగినన్ని అవకాశాలు వస్తాయన్నారు.
ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులు, ప్రధాన కార్యకర్తలకు పార్టీ గుర్తింపు ఇచ్చి పదవులు ఇచ్చి గౌరవించిందన్నారు. మిగిలిన వారికి కూడా ఇస్తుందని వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ తన్వీర్, ఇటీవల పార్టీలో చేరిన సీనియర్ నాయకులు ఏర్పుల నరోత్తం, అన్ని మండలాల కీలక నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment