రామ రామ... కృష్ణ కృష్ణ | Rama Rama..krishna krishna | Sakshi
Sakshi News home page

రామ రామ... కృష్ణ కృష్ణ

Published Thu, May 1 2014 3:16 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

Rama Rama..krishna krishna

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వెంకటగిరి టీడీపీ టికెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జాక్‌పాట్ కొట్టారు. రామకృష్ణ వ్యవహారాలన్నీ తెలిసినా ఆయన గెలుస్తారో లేదో అనే అనుమానంతో చంద్రబాబు నాయుడు టికెట్ విషయంలో కాస్త తటపటాయించారు. అభ్యర్థి ఎలాంటి వాడైనా సరే గెలవాలి అనే ఆలోచ చంద్రబాబు మెదడులో మెదలడంతో  రామకృష్ణకు ఎట్టకేలకు టికెట్ జాక్‌పాట్ తగిలింది.
 
 ఆయన వ్యాపార వ్యవహారాల్లో కూడా జాక్‌పాట్ సాధ్యమై అనతి కాలంలోనే రామకృష్ణ ఆర్థికంగా అందనంత ఎత్తుకు ఎదిగారనే ప్రచారం ఉంది. రవాణా వ్యవహారంలో చె న్నై నుంచి హైదరాబాద్, బెంగళూరు దాకా ఈయన పేరు మార్మోగుతోంది. రామకృష్ణ లారీ వెళుతోందంటే అధికారులు దాన్ని ఆపి అందులోని సరుకు బిల్లు కట్టిందా? కట్టకుండా వెళుతుందా? అని తనిఖీ చేసే ధైర్యం కూడా చేయలేని వాతావరణం సృష్టించుకుని  తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంతకంతకు విస్తరించుకున్నారు.
 
 గోతాల వ్యాపారం నుంచి
 ట్రాన్స్‌పోర్టు కంపెనీ దాకా
 నాయుడుపేటలో 90వ దశకంలో రెండోరకం గోతాల వ్యాపారం చేసిన రామకృష్ణ తన బంధువులు ఇచ్చిన ఆర్థిక సహకారంతో  మినీలారీని కోనుగోలు చేసి ఆంధ్ర నుంచి చెన్నైకు ధాన్యాన్ని  రవాణా చే శారు. ఈ రవాణాలో అనేక అక్రమాలు సాగినట్లు అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. రామకృష్ణపై 1991లో సూళ్లూరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నంబరు 12-91 నమోదైంది.
 
 అప్పట్లో ధాన్యం అక్రమరవాణాను అడ్డుకున్న నాయుడుపేట మండల రెవెన్యూ అధికారి షంషేర్ అహ్మద్‌పై  రామకృష్ణ  దౌర్జన్యానికి  పాల్పడడం వివాదస్పదమైంది. రామకృష్ణ సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అప్పట్లో జిల్లా ఉన్నతాధికారులు పీడీ యాక్ట్  ప్రయోగించేందుకు యత్నించారు. అప్పటి రాపూరు ఎమ్మెల్యే నువ్వుల వెంకటరత్నంనాయుడు రామకృష్ణను ఈ గండం నుంచి గట్టెక్కించారని ఆ ప్రాంత వాసులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు.
 
 ఎస్‌ఆర్‌ఎల్‌టీ పేరుతో నేటికి సుమారు 30 పైగా లారీలతో రామకృష్ణ నడుపుతున్న రవాణా వ్యాపారంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల అనంతపురంలో రామకృష్ణకు చెందిన ఓ లారీ బిల్లులు లేకుండా పాన్‌పరాగ్‌లు రవాణాచేస్తుండగా అధికారులు దాడులు చేసి సీజ్ చేస్తే  అపరాధ రుసుం చెల్లించి విడిపించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా జీరో దందా (పన్ను చెల్లించకుండా చేసే వ్యాపారం) అని రామకృష్ణ వ్యతిరేకులు ఆరోపిస్తుంటే తనంటే గిట్టనందువల్లే ఈ ఆరోపణలు చేస్తున్నారని రామకృష్ణ చెబుతున్నారు.
 అక్రమ రిజిస్ట్రేషన్‌తో చేనేతల స్థలం కైవసం
 వెంకటగిరి పట్టణం ఉపాధ్యనగర్ సమీపంలో 14544 చదరపు అడుగులు చేనేత సొసైటీకి చెందిన స్థలాన్ని రామకృష్ణ తన భార్య సింధు పేరుతో అప్పటి సొసైటీ అధ్యక్షుడు నీలాసుబ్బరాయులతో నెల్లూరులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని కైవసం చేసుకున్నారని చేనేతల్లో ఓ వర్గం ఆరోపిస్తోంది.
 
 ఈ వ్యవహరంపై వెంకటగిరి పట్టణానికి చెందిన చొప్పా వెంకటేశ్వర్లు అనే చేనేత కార్మికుడు లోకాయుక్తను ఆశ్రయించారు. కట్టడాలను నిలుపదల చేయాలని లోకాయుక్త ఆదేశించినా  అధికారులు అమలు చేయడం లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణ కైవసం చేసుకున్న స్థలం చిన్నపిల్లల పార్కు కోసం కేటాయించిన ప్రజాప్రయోజన స్థలంగా చేనేతకార్మికులు చెబుతున్నారు. ఆ వివాదస్పద స్థలంలో మున్సిపాలిటీ అనుమతి లేకుండా ఎమ్మెల్యే పెద్దభవంతిని  నిర్మిస్తున్నారు. అనుమతి లేకండా పేదలు చిన్న గూడుకట్టుకున్నా కూల్చేసే అధికారులు రామకృష్ణ నిర్మాణాలను పట్టిచుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశమేమీ కాదు.
 
 కురుగొండ్ల ఆస్తి కోట్లల్లోనే.. : వెంకటగిరి టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ నామినేషన్ సమయంలో దాఖలు చేసిన అఫిడివిట్‌లో మార్కెట్ విలువ ప్రకారం తన పేరుతో రూ 26. 65 కోట్లు ఆస్తి, తన భార్య సింధు పేరుతో రూ.17.53 కోట్లు ఆస్తిని చూపారు.  బహిరంగ మార్కెట్‌లో ఈ ఆస్తులు దాదాపు మూడు రెట్లు అదనంగా ఉండే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే అఫిడివిట్‌లో ఆస్తులతోపాటు ఇద్దరిపేరుపై సుమారు రూ.28 కోట్లు అప్పుగా చూపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement