ఖమ్మం: బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి వంద రోజులు టార్గెట్‌గా నిర్దేశించుకుంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యాన పార్టీ కేడర్ జోష్‌లో ఉంది. బరిలో నిలిచే అభ్యర్థులు ప్రచార రథాలు, జెండాలు, ఫ్లెక్సీలు, ఇతర ఎన్నికల సామగ్రికి ఆర్డర్లు ఇచ్చారు. ఇదే సమయాన అసంతృప్త నేతలను బుజ్జగిస్తూ ప్రచారరంగంలోకి దిగారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షాలు అభ్యర్థులను ప్రకటించే నాటికి రెండు, మూడు దఫాలు నియోజకవర్గాన్ని అంతా చుట్టేలా కార్యాచరణ రూపొందించుకున్నారు.
ముఖ్యనేతలకు దిశానిర్దేశం..
నియోజకవర్గాల్లో అభ్యర్థులు ముఖ్య నేతలతో సమావేశమవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలతో జరిగిన లబ్ధిని గడపగడపకూ తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఖమ్మంలో ఇప్పటికే ముఖ్యనేతలతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమావేశమయ్యారు.
ఖమ్మం నగరంలోని 60 డివిజన్లతో పాటు రఘునాథపాలెం మండలంలో చేసిన అభివృద్ధి పనులతో ప్రత్యేకంగా కరపత్రాలు రూపొందిస్తున్నారు. వీటిని తమ కేడర్‌తో ఇంటింటికీ చేర్చేలా ప్రణాళిక రూపొందించారు. మరోపక్క పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో కూడా ఈ దిశగా కార్యాచరణ కొనసాగుతోంది.
పార్టీ అండగా ఉంటుందంటూ..
జిల్లాలోని పాలేరు, వైరా, మధిర వంటి నియోజకవర్గాల్లో కొందరి నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. వీరు బహిరంగంగానే పార్టీ అభ్యర్థులను వ్యతిరేకిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో టికెట్ ఆశించిన ఆశావహులను బుజ్జగించే బాధ్యతను పార్టీ అధిష్టానం పలువురు నేతలకు అప్పగించింది. పాలేరులో కందాల ఉపేందర్‌రెడ్డికి టికెట్ ఖరారు కావడంతో జిల్లావ్యాప్తంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు భేటీ అవుతున్నారు.
దీంతో హైదరాబాద్‌లో ఉన్న తుమ్మలను నేతలు బుజ్జగిస్తున్నారు. ఇక మధిరలో బొమ్మెర రామ్మూర్తి తన అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేస్తూ ఉద్యమకారులకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైరాలో రాములునాయక్‌కు టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. కొందరి కారణంగానే తనకు టికెట్ రాలేద ని వ్యాఖ్యానించారు. వీరిని బుజ్జగించేందుకు అధి ష్టానం ప్రయత్నిస్తోంది. పార్టీ మళ్లీ గెలిస్తే మరెన్నో పదవులు అందుబాటులో ఉంటాయని, ఎమ్మెల్యే టికెట్ ఒకటే లక్ష్యం కాదని నచ్చచెప్పడంలో నిమగ్నమయ్యారు.
సమయాన్ని వినియోగించుకునేలా..
అన్ని పార్టీల కన్నా ముందుగానే బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల వరకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా సిద్ధమవుతున్నారు. అభ్యర్థులు.. తమ కార్యకర్తలు, అభిమానులు, నేతలతో సమావేశమవుతూ ప్రచార వ్యూహా లను ఖరారు చేస్తున్నారు. దాదాపు వంద రోజుల వరకు సమయం ఉన్నందున ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ప్రకటించేలోగానే ఒకటికి, రెండుసార్లు ప్రజలను కలవాలని సూచిస్తున్నారు. మరోవైపు టికెట్ రాకుండా అసంతృప్తితో ఉన్న వారిని బుజ్జగించి.. వారినీ తమతో కలుపుకునేలా చర్యలు చేపడుతున్నారు.
దూకుడుగా కార్యక్రమాలు..
జిల్లాలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, కొత్త పనులకు శంకుస్థాపన, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడంపై బీఆర్‌ఎస్ నేతలు దృష్టి సారించారు. ప్రధానంగా దివ్యాంగులకు పెంచిన ఆసరా పింఛన్ల పంపిణీ, బీసీ బంధు చెక్కులు పంపిణీ చేస్తూ బీఆర్‌ఎస్‌కు అండగా ఉండాలని కోరుతున్నారు. జిల్లాతో పాటు ఖమ్మం నియోజకవర్గంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విస్తృతంగా పర్యటిస్తుండగా..
పాలేరులో కందాల ఉపేందర్‌రెడ్డి, సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య, మధిరలో లింగాల కమల్‌రాజు లబ్ధిదారులకు సంక్షేమ పథకాల పంపిణీ చేపడుతున్నారు. అలాగే, సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. అలాగే, గ్రామాలు, మండల కేంద్రాలు, మున్సిపల్ డివిజన్ల వారీగా గతంలో తమకు ఎక్కడ తక్కువ ఓట్లు వచ్చాయో లెక్కలు వేస్తూ ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment