ఇటీవల ముగిసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలలో ప్రసంగిం చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు... తనకూ, టీఆర్‌ఎస్ పార్టీకీ రాజకీయాలంటే ఒక క్రీడ కానే కాదనీ, అదొక విద్యుక్త ధర్మమనీ వ్యాఖ్యానించారు. ఆయన చెప్పిన మాటలను లోతుగా అర్థం చేసుకుంటే అనేక భావాలు గోచరిస్తాయి. 2014 తర్వాత, మోదీ నేతృత్వంలోని బీజేపీ అజేయంగా మారిందని కొందరి భావన. దానివల్లనే పలువురు బీజేపీ యేతర రాజకీయ ప్రత్యర్థులూ, వివిధ పార్టీల నాయకులూ కొంతమేరకు అయోమయంలో పడిపోయారు.
అది సహజం. అయితే 2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో మోదీ నేతృత్వంలోని బీజేపీని ఓడించాలంటే కష్టం కావచ్చేమోగానీ అసాధ్యం మాత్రం కాదు. కాకపోతే దాన్నొక టాస్క్‌లాగా తీసుకోవాలి. అదే సమయంలో ఒక గొప్ప వ్యూహాన్ని కూడా రూపొందించాలి. దాన్ని అంకిత భావంతో అమలు చేయాలి. ఇటీవల 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో సాధించిన విజయా లను విశ్లేషిస్తే, దేశంలో ఎన్నికల వ్యూహంలో గణనీయమైన మార్పులు వచ్చాయని అవగతమవుతున్నది. ఈ విషయాన్ని చాలా రాజకీయ పార్టీలు అర్థం చేసుకోలేకపోయాయి. బీఎస్పీ, ఎస్పీలతో సహా కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోవడానికి కారణం ఇదే. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ప్రాంతీయ పార్టీల సమర్థతను చాటి చెబుతోంది.
70వ దశకంలో వామపక్షాలతో సహా అన్ని రకాల మిత వాద భావజాలం ఉన్న రాజకీయ పార్టీల కన్సార్షియం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో జనతా పార్టీగా ఆవిర్భవించి విజయవంతంగా ఎన్నికలను గెలిచింది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్ట మొదటి కాంగ్రెసేతర ప్రభు త్వంగా 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వం రికార్డు సృష్టిం చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీని ఎవరు ఎదుర్కోగలరన్న ప్రశ్న ప్రజల ముందుకు పదేపదే తీసు కొచ్చినా ప్రయోజనం లేకపోయింది. అలాగే, ఇప్పుడు బీజేపీ, దాని మద్దతుదారులు కూడా మోదీని ఎవరు ఎదుర్కోగలరని అడుగుతున్నారు.
జనతా పార్టీ ప్రయోగం దేశ రాజకీయ ఎజెండాలో కొత్త దృశ్యాలను ఆవిష్కరించింది. ఈ ప్రయోగమే ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, యునైటెడ్ పీపుల్స్ అల యన్స్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ తదితర ఫ్రంట్ల శ్రేణికి మార్గదర్శకత్వం వహించిందనవచ్చు. ఈసారి ప్రయోగం ఫ్రంట్ కాకపోవచ్చు. అన్ని రకాల సారూప్య రాజకీయ పార్టీల కన్సార్షియం కావచ్చు. మోదీ నాయకత్వంలో ఒకప్పుడు ప్రమాదంగా భావించిన హిందుత్వమే నేడు ప్రధాన ఎన్నికల ఎజెండాగా మారింది. అందువల్ల, ఇక్కడ సందేశం చాలా స్పష్టంగా ఉంది. తదుపరి సార్వత్రిక ఎన్నికలలో మోదీ నేతృ త్వంలోని బీజేపీ బలాన్ని ఒంటరిగా ఏ జాతీయ పార్టీ తగ్గించ లేక పోవచ్చు. కానీ కేసీఆర్ ప్రతిపాదించిన కాంగ్రెసేతర, బీజేపీ యేతర పార్టీల కన్సార్షియం కచ్చితంగా బీజేపీ విజయానికి అడ్డుకట్ట వేయగలదు.
బీజేపీ హిందుత్వానికి వ్యతిరేకంగా ఈ కన్సార్టియం... లౌకికవాదం, ప్రజా సంక్షేమం అనే లక్ష్యాలను తీసుకోవాలి. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఉటంకించాలి. ప్రజా సమస్యలకు పరిష్కారాలు చూపాలి. కాంగ్రెస్ మద్దతు లేకుండా బీజేపీకి వ్యతి రేకంగా కన్సార్టియంకు ఆస్కారం లేదన్న వాదన సరైంది కాదు. నేడు దేశంలో బీజేపీకి అడ్డుకట్ట వేయగలిగేది ప్రాంతీయ పార్టీలేనన్న విషయాన్ని గుర్తెరగాలి. ఈ నేపథ్యంలో భవిష్య త్‌లో రూపుదిద్దుకోనున్న కన్సార్టియంలో, కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామిగా చేరాలనుకుంటే, అన్ని పార్టీలూ స్వాగతించాలి. కానీ నాయకత్వం ఇవ్వకూడదు.
కేసీఆర్ చెప్పినట్లుగా ఎన్నికలను విద్యుక్త ధర్మంలాగా చూడాలి. 2024 ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలను నేటి నుంచే ఒక టాస్క్‌గా తీసుకోవాలి. తెలంగాణలో కోట్లాది మందికి లబ్ధి చేకూర్చేలా విజయవంతంగా అమలుచేస్తున్న పథకాలను, కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. దేశంలోని కాంగ్రెసేతర, బీజేపీ యేతర పార్టీలు కలిసి ఎన్నిక లకు చాలా ముందు నుంచే బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా ప్రచారాన్ని చేపట్టాలి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని నిలువరించడం పూర్తిగా సాధ్యమే.
-వనం జ్వాలానరసింహారావు
వ్యాసకర్త తెలంగాణ సీఎం చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment