Vanam jwala narasimha rao
-
అభివృద్ధీ... నీ పయనం ఎటు?
ఏడు సంవత్సరాల క్రితం 87 ఏళ్ల వయసులో మరణించిన భవిష్యత్తు వాది ఆల్విన్ టాఫ్లర్ ‘ఫ్యూచర్ షాక్’ అనే పుస్తకాన్ని 1970లో రాశాడు. వేగవంతమైన మార్పు ప్రజలను పిచ్చిగా మార్చుతుందని అందులో ఊహించారు. ఆ ఊహ నిజమే నని నా అనుభవాలే చెబుతున్నాయి. 75 ఏళ్ల వయసులో, ముందూ వెనుకా ఐదు తరాల వాళ్లను చూసిన మాలాంటి వారికి అభివృద్ధి పేరుతో వివిధ రంగాలలో చోటుచేసుకుంటున్న కొన్ని మార్పులు గమనిస్తుంటే ఆశ్చర్యం సంగతి అటుంచి, ఏంచేయాలో పాలుపోని పరిస్థితి కలుగుతున్నది. అన్నపూర్ణ లాంటి తెలుగు రాష్ట్రాలలో ఏ పట్టణంలో, ఏ హోటల్లో పోయినా కడుపునిండా తినే తెలుగువారి భోజనం దొరకదు. అన్నం, కూర, పప్పు, నెయ్యి, సాంబారు, రసం, గోధుమ పిండి రొట్టె, పూరీ లాంటి పదార్థాలతో భోజనం పెట్టే హోటళ్లు మచ్చుకైనా కానరావు. పేరుకు అన్నీ ఫైవ్ స్టార్, త్రీ స్టార్ హోటళ్లు. బిరియానీ, పలావ్, జింజర్ రైస్, పన్నీర్, మైదా పిండో మరేదో దానితో చేసిన బటర్ నాన్, నాన్, రోటీ, కుల్చా లాంటివి తినాల్సిందే. లేదా పస్తు ఉండాల్సిందే. ‘పేదరాసి పెద్దమ్మ’ సంస్కృతి రోజుల రుచికరమైన భోజనం, సత్రాల భోజనం, తరువాత కాలంనాటి ఉడిపి హోటళ్ళ భోజనాలు ఏమయ్యాయి? డాక్టర్ దగ్గరికి పోతే పాతరోజుల్లాగా ఒంటి మీద చేయి వేసి, స్టెతస్కోప్ పెట్టి పరీక్ష చేసి, చూడడం గత చరిత్ర అయిపోయింది. గుడికి పోతే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టనివ్వరు. తీర్థం ఒకచోట, ప్రసాదం ఇంకొక చోట ఇస్తారు. వివిధ రకాల సేవల పేరు మీద ఛార్జీలు ఉంటాయి. మొదట్లో పెద్ద గుళ్లకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు గ్రామాలకు, చిన్నచిన్న దేవాలయాలకు కూడా పాకింది. అన్నింటికీ అనవసరమైన పరిమితులు. ఇంటికి కావాల్సిన నెలవారీ సరుకులు ఒకప్పుడు హాయిగా దగ్గరలోని కొట్టుకుపోయి, స్వచ్ఛమైన, కల్తీలేని వాటిని, కొట్టువాడి ముందర పరీక్ష చేసి చూసుకుని, తూకం వేయించుకుని కొనుక్కునే వాళ్లం. ఇప్పుడు సంస్కృతి మారింది. పెద్దపెద్ద సూపర్ బజార్లలోకి పోయి, మనమే మనకు కావాల్సిన సామాన్లు వెతికి పట్టుకుని, ఒక బండిలో వేసుకుని తెచ్చుకోవాలి. అన్నీ ప్యాక్ చేసి ఉంటాయి. ఇన్ని గ్రాములు, ఇన్ని కేజీలు అని ఉంటుంది వాటిమీద. నిజంగా అంత తూకం ఉంటాయా లేదా అనేది సందేహమే! పైగా ఒక ఎక్స్పైరీ డేట్ వేస్తారు. అందులో ఎంత కల్తీనో తెలుసుకునే మానిటరింగ్ మెకానిజం లేదనాలి. సరుకు తెచ్చుకున్న తరువాత ప్యాకెట్లు విప్పిచూస్తే కొన్నిట్లో పురుగులు ఉంటాయి. ఇదేంది అని అడిగితే పాకింగ్ చేసింది మేం కాదుకదా! అని జవాబు. ఇక మెడికల్ షాప్‌కు పోతే మనకు కావాల్సింది ఒక ఐదారు టాబ్లెట్స్ అయినా... షాపువాడు మొత్తం స్ట్రిప్ కొనమంటాడు. ఏ వస్తువు కొన్నా (ఫర్నిచర్ దగ్గర నుండి, ఎలక్ట్రానిక్ పనిముట్ల వరకు) వాటికి రిపేర్ వస్తే, కొన్న చోట కాకుండా వేరే వర్క్ షాప్‌కు వెళ్లాలి. వాళ్లకు ఫోన్ చెయ్యాలంటే, టోల్ ఫ్రీ అనే నెంబర్‌కు చేయాలి. అది ఏ దేశంలో ఉంటుందో తెలియదు. వాళ్లు ‘ఒకటి నొక్కు, రెండు నొక్కు...’అంటూ డిస్కనెక్ట్ చేస్తారు. అసలు చిన్న చిన్న దుకాణాల సంస్కృతి పూర్తిగా పోవడం చాలా దురదృష్టకరం. చిన్నతనంలో తెల్ల కాగితాలు, పెన్సిల్, సిరా బుడ్డి, పిప్పరమింట్లు, చాక్లెట్లు, నువ్వుల జీడీలు, బిస్కట్లు లాంటివి కొనుక్కోవడానికి అక్కడక్కడ చాలా చిన్నచిన్న దుకాణాలు ఉండేవి. ఇప్పుడు చిన్న గుండు సూది కొనాలన్నా పెద్ద షాపునకు పోవాల్సిందే! అధిక ధరలు చెల్లించాల్సిందే. ఇంటి ముందుకు, తాజా కూరగాయలు తెచ్చి అమ్మే రోజులు పోయి కూరగాయల మార్కెట్లు వెలిశాయి. వాటిమీద బతికేవారు ఉపాధి కోల్పోయారు. ఫ్యామిలీ డాక్టర్ సంస్కృతీ పోయింది, పరాయి ఊరుకు వెళ్లినప్పుడు బంధువుల ఇళ్లలో ఉండే అలవాటు పోయింది. చక్కటి, చిక్కటి స్వచ్ఛమైన పాలను ఇంటి ముందర కొనుక్కునే ఆచారం పోయింది. ఇంటి వెనుక పెరుగు చిలికిన చల్ల కడుపు నిండా తాగే రోజులు పూర్తిగా పోయాయి. వేరు శనగపప్పుతో ఎవరికివారు శనగ నూనె చేయించుకుని ఏడాది పొడుగూతా వాడే అలవాటు పోయింది. నడక ప్రయాణం కనుమరుగైంది. కడుపు నిండా భోజనం తినే సంస్కృతి స్థానంలో పిజ్జా, బర్గర్స్ వచ్చాయి. స్వచ్చమైన వెన్న, నెయ్యి లభ్యమయ్యే ప్రదేశాలు మచ్చుకైనా లేవు. జొన్న చేలలో ఉప్పు, కారం కలుపుకున్న దోసకాయలు తినే రోజులు ఇకరావేమో! చేలల్లో పెసరకాయలు వలుచుకు తినే అదృష్టం ఇక లేనట్టేనేమో. అన్నీ ఫాస్ట్ ఫుడ్సే. పెరుగు, నెయ్యి, పాలు, తేనె, కూరలు, నూనె, ఒకటేమిటి... అన్నీ ప్యాక్ చేసిన (కల్తీ) ఆహారాలే! చివరకు సీజనల్ పండ్లు కూడా కలుషితమైనవే! కాలుతీసి కాలు బయట పెట్టకుండా, కనీస వ్యాయామం లేకుండా, ఒంటికి చెమట పట్టకుండా, నిరంతరం ఏసీ గదుల్లో ఉంటూ అన్నీ ఇంటి ముంగిటే పొందడం! బాత్రూమ్ కూడా బెడ్రూమ్కు అను బంధమే! ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇలా ఎన్నో కోల్పోతున్నాం. ఇంకా ఎన్ని కోల్పోవాలో? ఇదంతా చూస్తూ, అను భవిస్తూ ‘అభివృద్ధీ నీ పయనం ఎటువైపు?’ అని నిట్టూర్చడం కన్న చేయగలిగిందేముంది? వనం జ్వాలా నరసింహారావు వ్యాసకర్త తెలంగాణ సీఎం సీపీఆర్ఓ -
Natural Skills: సహజ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలి
ఈ మధ్యన ఒకటి–రెండు సందర్భాలలో మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఒకరిద్దరు చురుకైన విద్యార్థులను కలవడం సంభవించింది. వాళ్లతో మాటా–మాటా కలిపి, వారి–వారి ప్రొఫెషనల్ విద్యాభ్యాసంలో భాగంగా ఏం నేర్చుకుంటున్నారూ, అధ్యాపకులు ఏం నేర్పిస్తున్నారనీ ప్రశ్నిస్తే, వారిదగ్గర నుండి ఆశించిన సమాధానం రాలేదు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి అయిన తరువాత ఏరకమైన మెషిన్లమీద పనిచేస్తావని ప్రశ్నిస్తే తెలియదని అమాయకంగా వచ్చింది జవాబు. కంప్యూటర్ ఇంజనీరింగ్ తరువాత సరాసరి ఏదైనా ప్రోగ్రామింగ్ చేయగలరా అంటే దానికీ జవాబు లేదు. సివిల్ ఇంజనీరింగ్ తరువాత ఎలాంటి ప్రాజెక్టులలో పనిచేయాలని అనుకుంటున్నావని అడిగితే అసలే అర్థం కాలేదు. అందరూ విద్యార్థులూ ఇలాగేనా అంటే కావచ్చు, కాకపోవచ్చు. స్వతహాగా తెలివైన కొందరి విషయంలో మినహాయింపు ఉండవచ్చు. ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులన్నీ ఇటీవల కాలంలో ‘నాలెడ్జ్ బేస్డ్’ (అంతంత మాత్రమే) తప్ప ‘స్కిల్ బేస్డ్’ కాకపోవడమే బహుశా దీనికి కారణం కావచ్చు. ఇదిలా ఉంటే ఎలాంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా రకరకాల వృత్తి నిపుణులు మన దేశంలో, రాష్ట్రంలో కోకొల్లలు. వారంతా స్వయంశక్తితో వారి వారి వృత్తుల్లో ఎలా ప్రావీణ్యం సంపాందించుకున్నారో అనేది కోటి రూకల ప్రశ్న. వారిలో గ్రామీణ వృత్తులు మొదలుకుని, పట్టణాలలో, నగరాలలో పనిచేస్తున్న వాహనాలు, ఎయిర్ కండీషన్లు వంటి వాటిని బాగుచేసే మెకానిక్కులు చాలామందే ఉన్నారు. వీరు రిపేర్లు చేయడానికి వచ్చేటప్పుడు తమ వెంట ఒక జూనియర్ కుర్రవాడిని తీసుకు వస్తారు. అతడు కొంతకాలానికి సీనియర్ అయిపోతాడు. అందుకే ఇటువంటివారు నేర్చుకున్న విద్య భావితరాలవారికి అందుబాటులోకి తీసుకువచ్చే విధానం ప్రవేశపెట్టాలి. వీరికి సంబంధిత విద్యార్హతలు లేకపోయినా ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్స్ చెప్పేటప్పుడు ఉపయోగించుకునే విధానం రూపొందిస్తే మంచిదేమో! యాభై, అరవై ఏళ్ల అనుభవంతో చేస్తున్న సూచన ఇది. చేతి గడియారం పనిచేయకపోతే, కంపెనీ షోరూమ్‌కు పోయి ఇస్తే బాగుచేసి ఇవ్వడానికి సమయం పట్టే అవకాశాలున్నాయి కాబట్టి, ఎప్పటిలాగే, ఆలవాటున్న ఒక రిపేర్ షాప్‌కు పోయాను ఇటీవల. ఆ చిన్న షాప్‌లో ఎప్పటిలాగే ఇద్దరు నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ కూర్చున్నారు. ఆ ఇద్దరిలో సీనియర్ వ్యక్తి (బహుశా) బ్యాటరీ కొత్తది వేయాలని చెప్పి రూ. 220 అవుతుందన్నాడు. నేను సరే అనగానే ఐదు నిమిషాలలో ఆ పని కానిచ్చి నా చేతిలో పెట్టాడు. గత ఏభై ఏళ్లుగా... తన తండ్రి కాలం నుంచి అక్కడే రిపేర్లు చేస్తున్నామనీ, గడియారాలు రిపేరు చేసే విద్య ఎప్పటినుంచో తనకు వచ్చనీ, ఎలా అబ్బిందో తెలియదనీ, ఎక్కడా నేర్చుకున్నది కాదనీ అన్నాడు. ఇటీవల మనం వాడుకునే వస్తువులు చెడిపోయినప్పుడు ఎక్కువగా కంపెనీల సర్వీసింగ్ మెకానిక్‌లను పిలవకుండా స్వంతంగా నేర్చుకున్న పనితనంతో తక్కువ ధరకు సర్వీసు చేసి పోతున్న లోకల్ టాలెంట్లనే వినియోగదారులు ఆశ్రయించడం వీరికి ఉన్న విశ్వసనీయతను తెలియ జేస్తోంది. ఇటువంటి నేచురల్ టాలెంట్ ఉన్న వారు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. మా చిన్నతనంలో ఖమ్మం పట్టణంలో మేమున్న మామిళ్ళ గూడెం బజారులో (లంబాడి) రాము అని ఆర్టీసీలో మెకానిక్‌గా పని చేస్తున్న వ్యక్తి ఉండేవాడు. అతడు ఏ మెకానికల్ ఇంజనీరింగ్ చదువు కోలేదు. కాని అద్భుతమైన రీతిలో మెకానిజం తెలిసిన వ్యక్తి. ఆ రోజుల్లో ఖమ్మంలో కార్లు, జీపులు బహుశా చాలా తక్కువ. వాటికి కానీ, లారీలకు కానీ ఏ విధమైన రిపేర్ కావాలన్నా రామునే దిక్కు. రాముకు సహజ సిద్ధంగా అబ్బిన విద్య అది. అప్పట్లో హైదరాబాద్‌లో మా బంధువు లబ్బాయి ఒకడిది అద్భుతమైన మెకానికల్ బ్రెయిన్. ఇంకా కంప్యూటర్లు ప్రాముఖ్యం చెందని రోజుల్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్లలో నైపుణ్యం సంపాదించాడు. ఎట్లా నేర్చుకున్నాడో, ఎవరికీ తెలియదు. ఇంటర్మీడియేట్ చదవడానికి ప్రయత్నం చేశాడు. కుదరలేదు. స్నేహితుల సహాయంతో అమెరికా చేరుకున్నాడు. చిన్నగా హార్డ్‌వేర్ మెకానిజంలో పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో కంపెనీలు అప్పట్లో అతడి మీద ఆధారపడేవి. అంచెలంచెలుగా ఎదిగి ఫార్మల్ డిగ్రీలు లేకపోయినా నైపుణ్యం ప్రాతిపదికగా అక్కడ స్థిరపడిపోయాడు. అతడా విద్య ఎలా నేర్చుకున్నాడు? చాలా కాలం క్రితం ఆంధ్రాబ్యాంక్‌లో కొఠారి చలపతి రావు అనే ఆయన పనిచేసేవారు. అక్కడ చేరడానికి ముందర కొన్ని చిన్నచిన్న ఉద్యోగాలు కూడా చేశాడు. ఇంకా అప్పటికి కంప్యూటర్లు పూర్తి స్థాయిలో వాడకంలోకి రాలేదు. కేవలం మామూలు గ్రాడ్యుయేట్ మాత్రమే అయిన కొఠారి చలపతిరావు స్వయంగా నేర్చుకుని ఆంధ్రా బ్యాంక్ కంప్యూటర్ సిస్టం ఏర్పాటు చేశాడు. ఆయన్ని అంతా కంప్యూటర్ భీష్మ పితామహుడు అని పిల్చేవారు. ఆయన ఆ విద్య ఎలా నేర్చుకున్నాడు? వీరిలాంటి అనేకమంది సహజ నైపుణ్యం ఉన్నవారిని ప్రొఫెషనల్ కోర్సుల కాలేజీలలో క్వాలిఫికేషన్ లేకపోయినా అయినా ఉపయోగించుకోవాలి. అప్పుడే సాంకేతిక విద్య అభ్యసించే విద్యార్థులకు మంచి నైపుణ్యం అందుబాటులోకి వస్తుంది. (క్లిక్ చేయండి: గట్టివాళ్లే చట్టానికి గౌరవం) - వనం జ్వాలా నరసింహారావు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, తెలంగాణ ప్రభుత్వం -
వైద్యంలో ఒకప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా!
ఇటీవల చిన్న ఆరోగ్య సమస్య వస్తే సంప్రదించడానికి బాగా పరిచయం, వైద్య వృత్తిలో ఐదారు దశాబ్దాలకు పైగా అపారమైన అనుభవం, ఎండీ జనరల్ మెడిసిన్ డిగ్రీ ఉన్న ఒక సీనియర్ జన రల్ ఫిజీషియన్ దగ్గరికి వెళ్లాం. డాక్టర్ చాలా విపులంగా పరీక్ష చేశారు. బహుశా ఆయన స్పెషలిస్ట్ కాకపోవడం వల్లనే ఇలా పరీక్షించగలిగారు. అదే ఏ స్పెషాలిటీ ఆసుపత్రికో కన్సల్టేషన్ కు పోతే ఆ అనుభవమే వేరు. రోగి వంటిమీద ఏ స్పెషలిస్టయినా చెయ్యి వేయడం కానీ, స్టెత్ పెట్టి చూడడం కానీ సాధారణంగా ఉత్పన్నం కాదు. స్పెషలిస్టుల అప్పాయింట్మెంట్ దొరకడం, కలవడం ఒక ప్రహసనం. భారీ మొత్తంలో కన్సల్టేషన్ ఫీజ్ చెల్లించుకుని, గంటలకొద్దీ వెయిట్ చేసి, బయటనే పారా మెడికల్ వ్యక్తితో బీపీ, సాచ్యురేషన్, బరువు ఇత్యాదులు చూపించుకుని, స్పెషలిస్టును కలిసీ కలవడంతోనే సమస్య విని, తక్షణమే ఖరీదైన డయాగ్నాస్టిక్ పరీక్షలు చేయించాలి అంటారు చాలామంది. రిపోర్టులు వచ్చిన తరువాత చాలా మంది స్పెషలిస్టులు పూర్తిగా వాటి ఆధారంగా చికిత్స మొదలు పెట్టడమే కాని క్లినికల్‌గా కోరిలేట్ చేసుకోవడం ఆరుదేమో అనాలి. పెద్ద పెద్ద సూపర్ స్పెషలిస్టుల దగ్గర, వాళ్లు చూడడానికి ముందు ఒక సహాయక డాక్టర్ రోగి వివరాలు తీసుకుంటారు. ఆ వివరాల మీదా, రేడియాలజీ, పాథాలజీ పరీక్షల రిపోర్టుల మీదా ఆధారపడి సాగు తున్నది ఆధునిక వైద్యం. ఇది మంచిదా కాదా అంటే జవాబు చెప్పగలిగేవారు ఆ రంగానికి చెందిన నిపుణులే. వైద్యరంగంలో వచ్చిన, వస్తున్న పెనుమార్పులు, అభివృద్ధి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఆహ్వానించాల్సిందే కాని, వాటి మరో కోణం కొంత ఆందోళనకు దారి తీస్తుంది అనడం తప్పుకాదేమో! ఒకప్పుడు కేవలం ఎంబీబీఎస్ చదువుతో ఆపి ప్రభుత్వ ఉద్యోగమో, ప్రయివేట్ ప్రాక్టీసో చేసుకునేవారు. ఎక్కువలో ఎక్కువ జనరల్ మెడిసిన్, లేదా జనరల్ సర్జరీ చదివేవారు. వారిదగ్గరికి పోయిన రోగికి చికిత్స చేసే క్రమంలో రోగి నాడి చూడడం దగ్గరనుండి, స్టెతస్కోప్ వంటిమీద పెట్టి రోగ నిర్ధారణ చేయడంతో సహా, బీపీ చూడడం, అవసరమైన వారికి స్వయంగా ఇంజక్షన్ ఇవ్వడం, కట్టు కట్టడం లాంటి అనేకమైన వాటిని డాక్టర్ స్వయంగా చేసేవాడు. రోగికి ఎంతో తృప్తి కలిగేది. వారే అన్ని రకాల శస్త్ర చికిత్సలు చేసేవారు. ఎప్పుడైతే స్పెషలిస్టులు వైద్య రంగంలో పెరిగిపోసాగారో, ఒక్కో రుగ్మతకు ఒక్కో డాక్టర్ అవసరం పెరగసాగింది. ఈ నేపథ్యంలో, ఎంబీబీఎస్ తప్ప అదనపు స్పెషలిస్ట్ క్వాలిఫికేషన్ లేని ప్రజా వైద్యుడు, 50–60 సంవత్సరాల క్రితమే వృత్తిపరంగా రోగుల అన్నిరకాల రుగ్మతలకు తన అనుభవాన్ని ఆసాంతం రంగరించి చికిత్స చేసిన మహా మనీషి, ఖమ్మం జిల్లా వాసి, మాజీ రాజ్యసభ సభ్యుడు, స్వర్గీయ డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (వైఆర్కే) అనుభవం నుంచి ప్రతి వైద్యుడూ నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. ఖమ్మం పట్టణానికి రాధాకృష్ణమూర్తి వచ్చి ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో, ‘స్పెషలిస్టు’ డాక్టర్లంటూ ఎక్కువ మంది లేరు. అధికశాతం జనరల్ ప్రాక్టీషనర్లే. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన వారే. ప్రముఖులతో సహా పలువురికి, ఆయన అప్పటికున్న సదుపాయాల ఆధారంగానే, టాన్సిల్స్ ఆపరేషన్ చేశారు. బహుశా ఖమ్మం పట్టణంలో మొదటి టాన్సిల్ ఆపరేషన్ చేసింది ఆయనేనేమో. అలాగే వేసెక్టమీ ఆపరేషన్లు ఖమ్మంలో ప్రారంభించిది కూడా ఆయనే. డాక్టర్ రాధాకృష్ణమూర్తి చేసిన ఆపరే షన్లలో, ఈ రోజుల్లో స్పెషలిస్ట్ వైద్యులు మాత్రమే చేస్తున్న హైడ్రోసిల్, హెర్నియా, అపెండిసైటిస్, ఫ్రాక్చర్స్, ట్యూమర్ లాంటివి కూడా వున్నాయి. ఎవరూ చేపట్టని ధనుర్వాతం కేసులకూ ఆయన చికిత్స అందించేవారు. అప్పట్లో క్షయ వ్యాధి చికిత్సకు ఒక క్రమ పద్ధతి అవలంబించారు రాధాకృష్ణమూర్తి. ప్రపంచ వ్యాప్తంగా అవలంబించే ‘ఆర్టిఫీషియల్ న్యూమో థొరాక్స్’ అనే విధానం ద్వారా, ఊపిరి తిత్తులను ‘కొలాప్స్’ చేసే పద్ధతి పాటించే వారు. ఎముకలు విరిగినవారికి ప్లాస్టర్ వేసి బాగు చేయడం డాక్టర్ రాధాకృష్ణమూర్తి ఒక ప్రత్యేక నైపుణ్యంగా అలవరచుకున్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నేర్చుకున్న దానిని, మరింత పదును పెట్టడానికి, నిరంతర అధ్యయనం చేసేవారాయన. ఇంకా కొంచెం వెనక్కు పొతే, ఆర్ఎంపీల ప్రాక్టీసు చేసిన రోజులు జ్ఞప్తికి వస్తాయి. నా చిన్నతనంలో, మా గ్రామంలో ఎవరికైనా ‘సుస్తీ‘ చేస్తే, వైద్యం చేయడానికి, వూళ్లో వున్న నాటు వైద్యుడే దిక్కు. నాటు వైద్యులలో అల్లోపతి వారు, హోమియోపతి వారు. ఆయుర్వేదం వారు, పాము–తేలు మంత్రాలు వచ్చిన వాళ్లు, మూలికా వైద్యులు, ఇలా అన్ని రకాల వాళ్లు వుండేవారు. ఎవరికి ఏ సుస్తీ చేసినా వాళ్లే గతి. వారిలో కొందరికి ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేసే అలవాటుండేది. జ్వరాలకు (ఎక్కువగా ఇన్ ఫ్లుయెంజా, మలేరియా–చలి జ్వరం) ఏపీసీ ట్యాబ్లెట్లు ఇచ్చేవారు. గ్రామాలలో ‘గత్తర’ (కలరా), ‘స్పోటకం– పాటకం’ (స్మాల్ పాక్స్) వ్యాధులు తరచుగా వస్తుండేవి. వీటికి తోడు ‘దద్దులు’, ‘వంచెలు’ కూడా చిన్న పిల్లలకు పోసేవి. ఇవి రాకుండా ముందస్తు నివారణ చర్యగా కలరా ఇంజక్షన్లు చేయడానికి, ‘టీకాలు’ వేయడానికి ప్రభుత్వ వైద్యుల బృందం గ్రామంలోకి వచ్చేది. ఊళ్లో ఏవైనా సీరియస్ కేసులు వుంటే, ఎడ్ల బండిలోనో, మేనాలోనో తీసుకుని సమీపంలోని పట్టణానికి పోయే వాళ్లు. వారి వెంట (ఆర్ఎంపీ) డాక్టర్ కూడా వెళ్లేవాడు. (క్లిక్ చేయండి: ‘భావజాల’ విముక్తే ప్రత్యామ్నాయానికి దారి) ఇప్పుడైతే ప్రతిచోటా వందలాది మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు, మల్టీ సూపర్ స్పెషలిస్టులు, వందల–వేల నర్సింగ్ హోంలు, సూపర్ స్పెషాలిటీ– మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు; వాటికి ధీటుగా, మరింత మెరుగ్గా ప్రభుత్వ రంగంలో, వివిధ అంచెలలో అన్నిరకాల వైద్యసేవలు, అందరికీ ఉచి తంగా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి వైద్యం అందరికీ అందుబాటులోకి తేవడం జరుగుతున్నది. డయాగ్నాస్టిక్ పరీక్షలన్నీ ప్రభుత్వ పరంగా అన్ని స్థాయి ఆసుపత్రులలో ఉచితంగా లభ్యమవు తున్నాయి. భవిష్యత్తులో, బహుశా క్వాలిఫైడ్ డాక్టర్ లేని గ్రామం వుండదంటే అతిశయోక్తి కాదేమో! అయినా ఎక్కడో, ఎందుకో, ఏదో కానరాని వెలితి! (క్లిక్ చేయండి: కొత్త స్త్రీలు వస్తున్నారు జాగ్రత్త!) - వనం జ్వాలా నరసింహారావు తెలంగాణ ముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ -
కావాల్సింది ప్రత్యామ్నాయ ప్రణాళికే..!
పటిష్ఠ సహకార సమాఖ్యను రూపొందించే అసలు సిసలైన జాతీయ ప్రత్యామ్నాయ ప్రణాళి కను రూపొందించేందుకు తెలం గాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నడుం బిగిం చారు. అందులో భాగంగానే ప్రాంతీయ రాజకీయ పార్టీల ఏకీకరణకు అడుగు ముందుకు వేశారు. రాష్ట్రాల అధికారాలను పునర్నిర్వచించాలనీ, అన్ని రంగాల్లో సంస్కరణలు అమలు చేయాలనీ కూడా కేసీఆర్ పిలుపునిచ్చారు. ఫెడరల్ వ్యవస్థ మీద కేంద్ర ప్రభుత్వాల వ్యూహాత్మక దాడిని పలు సందర్భాలలో ఆయన దుయ్యబట్టారు. స్పష్టమైన జాతీయ ప్రత్యామ్నాయ అజెండాను రూపొందించడంలో కేసీఆర్ నిమగ్నమైనట్లు ఆయన పర్యటనలు రుజువు చేస్తున్నాయి. ఇటీవలి ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల పర్యటనలోనూ, ఢిల్లీలో ఉన్న సందర్భంలో ఆయన కలిసిన కొందరు ప్రముఖులతో జరిపిన చర్చ ల్లోనూ ఇది సూచనప్రాయంగా వెల్లడైంది. జాతీయ రాజకీయాల్లో త్వరలోనే సంచలనం చోటుచేసు కోనున్నదని కేసీఆర్ స్పష్టంగా చెబుతున్నారు. కొత్త విధానాలను అమలు చేసేటప్పుడు రాష్ట్రాలను కేంద్రం సంప్రదించాల్సిన అవసరాన్ని కేసీఆర్ నొక్కి చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించే వెసులు బాటును రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి కల్పించింది. అంతమాత్రాన ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలగాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కారణాలు ఏమైనప్పటికీ కేంద్రం ఉదాత్తమైన సహకార సమాఖ్య వైపు కాకుండా... ఏకపక్ష విధానాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్య మంత్రిగా ఉండగా భారతదేశానికి కావలసింది నిర్బంధ సమాఖ్య కాదు, సహకార సమాఖ్య అనేది తన నినా దంగా మలుచుకున్నారు. ప్రధాన మంత్రి అయిన తరవాత తన వైఖరిని మార్చుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం సైతం ఈస్ట్ ఇండియా వ్యవహా రాలను నియంత్రించేదే తప్ప, దాని అధికారాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. ‘భారత ప్రభుత్వ చట్టం–1919’ కూడా ద్వంద్వ ప్రభుత్వాలకే మొగ్గు చూపింది. సహకార సమాఖ్య అనే లక్ష్యంతోనే స్వాతంత్య్రానంతరం అప్పటి ప్రభుత్వం భారత యూనియన్ను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన వ్యవహారాలలో కేంద్ర ప్రభుత్వం విపరీతంగా జోక్యం చేసుకుంటూనే ఉంది. కేంద్రం కేవలం విదేశీ వ్యవహారాలు, రక్షణ, జాతీయ రహదారుల నిర్వహణ వంటి అంశాలకే పరిమితం కావాలి. విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి, స్థానిక సంస్థలు, తదితర అంశాల బాధ్యతలను రాష్ట్రా లకే విడిచిపెట్టాలి. స్థానిక సంస్థలకు నిధులను నేరుగా బదిలీ చేస్తూ, రాష్ట్రాలను నమ్మకుండా వ్యవహరిస్తూ వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాలు. ఇది సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన చర్య అంటూ కేసీఆర్ విమర్శిం చారు. ‘జవహర్ రోజ్‌గార్ యోజన’, ‘పీఎం గ్రామ్ సడక్ యోజన’, ‘ఎన్ఆర్ఈజీఏ’ (ఉపాధి హామీ) వంటి పథకాలకు ఢిల్లీ నుంచి నేరుగా స్థానిక సంస్థలకు నిధు లను బదలాయించడం రాష్ట్ర ప్రభుత్వాలను పక్కన పెట్టడమే అని అన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ఒక ప్రత్యామ్నాయ జాతీయ ప్రణాళికతో ప్రజల ముందుకొస్తానని ప్రకటించారు. దేశవ్యాప్తంగా భావ సారూప్యం కలిగిన రాజకీయ శక్తులను ఏకం చేయ డానికీ, దేశాన్ని అభివృద్ధి బాట పట్టించడానికీ వీలుగా ఈ అజెండా ఉంటుందనేది ఆయన ప్రకటన సారాంశం. రాజకీయ పార్టీలు, ఆర్థికవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, రైతులు... ఇలా అన్ని రంగాల వారి సహకారమూ ఈ అజెండా రూపకల్పనలో తీసుకుంటారు. స్థానిక అవస రాలు, రిజర్వేషన్లు వంటి రంగాలలో విధానపరమైన నిర్ణయాలు రాష్ట్రాల పరిధిలోనే ఉండేలా అజెండా ఉంటుందనేది నిస్సందేహం. కేంద్రం నుంచి ఎక్కువ అధికారాలు రాష్ట్రాలకు బదిలీ కావాలనేది కేసీఆర్ నిశ్చిత అభిప్రాయం. ఈ మేరకు రాజ్యాంగంలో మార్పులు చేయాలి. తెలం గాణలో అమలవుతున్న ‘రైతు బంధును’ జాతీయ స్థాయిలో చేపట్టి 40 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చవచ్చు. ‘రైతు బీమా’, ‘దళిత బంధు’ను కూడా దేశవ్యాప్తంగా అమలుచేయవచ్చు. నల్లధనాన్ని వెలికి తేవడానికి మార్గాలను అన్వేషించాలి. పన్నుల విధా నంలో మరిన్ని ప్రోత్సాహకాలుండాలి. ప్రకటిత ఆదా యాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు లేదా మౌలిక వసతుల రంగాలలో పెట్టుబడి పెట్టేలా ఒక సులభసాధ్యమైన వ్యవస్థ ఉండాలి. దీనివల్ల ప్రభుత్వ రంగాలకు పెట్టు బడులు వెల్లువలా వచ్చే అవకాశం ఉంటుంది. ‘అంతా బాగుంది’ అనే విధానమే దేశాన్ని సమస్యల కూపంలోకి నెట్టేస్తోందనే వాస్తవాన్ని గుర్తించాలి. సమర్థుడైన పరిపాలకునిగా కేసీఆర్ ప్రతిభను కనబరిచారు. ఆయన ప్రస్తుతం సూచిస్తున్న ‘ప్రత్యా మ్నాయ ప్రణాళిక’ దేశంలో సహకార సమాఖ్యను బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు. భావ సారూప్యం కలిగిన రాజకీయ పార్టీలు కేసీఆర్ ఆలో చనలను సమర్థించాల్సిన సమయమిదే. ఈ నేపథ్యంలో బహుశా దేశవ్యాప్తంగా పెరుగు తున్న ఒత్తిడి కారణంగా దేశంలో సహకార సమాఖ్యను బలోపేతం చేసేందుకు ‘అంతర్రాష్ట్ర మండలి’ని పునర్వ్య వస్థీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గమ నార్హం. ప్రధాని చైర్మన్‌గా వ్యవహరించే ఈ మండలిలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఆరుగురు కేంద్ర మంత్రులు సభ్యులుగానూ, మరో పదిమంది శాశ్వత ఆహ్వానితులుగానూ ఉంటారని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఇదెలా పనిచేస్తుందో కాలమే నిర్ణయిస్తుంది! వ్యాసకర్త: వనం జ్వాలా నరసింహారావు, తెలంగాణ ముఖ్యమంత్రి సీపీఆర్ఓ, మొబైల్: 80081 37012 -
ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎలా సాధ్యం?
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా అంటున్నారు. హైదరాబాద్ సమీపంలోని తుక్కు గూడలో ఇటీవల జరిగిన బీజేపీ బహిరంగ సభలో తన స్వప్నం సాకారమవుతుందన్న రీతిలో కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా, సీఎం కేసీఆర్‌ను ‘రేపే’ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించాలని సవాలు చేశారు. రాష్ట్రానికి సంబంధించినంతవరకూ ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ జాతీయ నాయకుడు డిమాండ్ చేసిన వెంటనే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉండదని ఆయనకు తెలియదా? రాష్ట్ర శాసనసభలో మెజారిటీ ఉన్నప్పుడు ఎప్పుడు ఎన్నికలకు పోవాలా వద్దా అన్న విషయం, ముందస్తుగా శాసనసభను రద్దు చేయాలా వద్దా అన్న విషయం, శాసనసభాపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి ఇష్టానిష్టాల మీద ఆధారపడి ఉంటుందనేది జగమెరిగిన సత్యం. తెలంగాణలో అధికార పార్టీ పూర్తి మెజారిటీని కలిగి ఉన్నప్పుడు అలా ముందస్తుకు ఎందుకు మొగ్గు చూపుతారు? చూపాల్సిన అవసరం ఉన్నదా? అసెంబ్లీ రద్దయిన మరుసటి రోజే ఎన్నికల నిర్వహణ అసాధ్యం కదా? ఎందుకంటే ఎన్నికల నిర్వహణకు ఒక సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. కాబట్టి, అసెంబ్లీ రద్దయిన మర్నాడే ఎన్నికలు నిర్వహించడమనేది కల్ల. ఇది గారడీ మాటగా భావించాల్సి ఉంటుంది. అమిత్ షా ఎప్పుడు తెలంగాణలో పర్యటించినా విచిత్రంగా మాట్లాడుతుంటారు. 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు అదెంతో ఖర్చుతో కూడుకున్న పని అంటూ విమర్శించిన ఇదే అమిత్ షా ఇప్పుడు ఆయనంతట ఆయనే రేపే ఎన్నికలు నిర్వహించాలని కోరడం వింతగా ఉంది. 2014, 2018లో నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ దక్కించుకున్న స్థానాలు అతి స్వల్పం. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఆయన వ్యాఖ్య ఎంతవరకు సమంజసమో ఆ దేవుడికే తెలియాలి. గతంలో కేసీఆర్ ఎందుకు ముందస్తుగా ఎన్నికలకు పోయారన్న ప్రశ్న తలెత్తవచ్చు. రాజ్యాంగ సభలను రద్దు చేసే అంశంలో రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. అప్పటి రాజకీయ పరిస్థితులకు చెక్ పెట్టడానికీ, ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడానికీ ఆయన ముందస్తు ఎన్నికల నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ముమ్మాటికీ సహేతుకం, రాజ్యాంగబద్ధం, చట్టబద్ధం, న్యాయం. ఆ సందర్భంలో కేసీఆర్ నిర్ణయాన్ని షా తప్పు పట్టారు. అసెంబ్లీని రద్దుచేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించిన మొట్టమొదటి సీఎం కేసీఆర్ మాత్రమేననీ, ఈ ఎన్నికల వల్ల ఎంతో ప్రజాధనం ఖర్చు వుతుందనీ విమర్శించారు. అప్పటి ఆయన మాటలు వింటే దేశంలో ఎప్పుడూ ముందస్తు ఎన్నికలు జరగనట్లే ఉంది. నడుస్తున్న చరిత్రను అమిత్ షా లాంటి స్థాయి వ్యక్తి విస్మరించి ఎలా మాట్లాడగలరు? రాష్ట్రం ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళాలో నిర్ణయించాల్సింది అమిత్ షా కాదు. ప్రత్యేకించి అధికారంలో ఉన్న పార్టీ పూర్తి మెజారిటీని అనుభవిస్తున్నప్పుడు ఇలా డిమాండ్ చేయడం అస్సలు సరికాదు. రేపే ఎన్నికలు పెడితే అధికారంలోకి వచ్చే పార్టీ మరో ఏడాదిన్నర ఆగవచ్చు కదా! ఆయనకు అంత ఉబలాటంగా ఉంటే వెంటనే ప్రధానిని కలిసి, బీజేపీ పూర్తి మెజారిటీని అనుభవిస్తున్న లోక్‌సభను రద్దు చేసి, ఎన్నికలు నిర్వహించాలని కోరాలి. గడువు పూర్తయిన తరవాత లేదా గడువుకు ముందే అసెంబ్లీ లేదా పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు జరపాలని రాష్ట్ర గవర్నర్ లేదా రాష్ట్రపతిని కోరడం కొత్త అంశమేమీ కాదు. ఐదేళ్ళ పాటు పార్లమెంటు, అసెంబ్లీలు కొనసాగడానికి అనుమతిస్తున్న రాజ్యాంగం ఆర్టికల్ 85, 174 ద్వారా రాష్ట్రపతి లేదా గవర్నర్లకు ప్రభుత్వాధినేతల సిఫార్సులపై వాటిని ముందస్తుగా రద్దుచేసే అధికారాన్నీ కట్టబెట్టింది. అది కేవలం ప్రభుత్వాధినేతల హక్కు మాత్రమే. అలాంటప్పుడు, కేసీఆర్‌ను ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని అమిత్ షా ఎలా బలవంతం చేయగలరు? దేశంలోని ప్రతిపక్షాలన్నీ పార్లమెంటును ముందే రద్దుచేసి, ఎన్నికలు నిర్వహిం చాలని కోరితే అమిత్ షాకు మింగుడుపడుతుందా? 2018 ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కేసీఆర్ నెరవేర్చలేదంటూ అమిత్ షా ఆరోపించారు. వారసత్వ రాజకీయాలను కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. 57 ఏళ్ల జీవితంలో ఇంత అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని కూడా అన్నారు. అరగంట సేపు సాగిన షా ప్రసంగంలోని విమర్శలు గతంలో మాదిరిగానే ఫక్తు అబద్ధాలు. 2014 టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో లేని పథకాలను, ఇవ్వని హామీలను కూడా ప్రభుత్వం అమలు చేసింది. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 200 శాతం ఎన్నికల హామీలను నెరవేర్చినట్ల య్యింది. తాను చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా భేషజాన్ని విడిచి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. (చదవండి: అబార్షన్లపై అమెరికాలో మళ్లీ రచ్చ) అమిత్ షా వ్యాఖ్యలను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అమిత్ షాను అబద్ధాల బాద్షాగా అభివర్ణించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డు కోవడానికి షా ఈ రకంగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్న, సృజనాత్మక కార్యక్రమాలకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల, కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రి, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుని నుంచి ప్రశంసలు అందుకున్న విషయాన్ని అమిత్ షా గుర్తుచేసుకోవాలి. యూఎన్డీపీ, నీతి ఆయోగ్ సంస్థలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులను ప్రశం సించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్‌ను గురించిన చర్చ జరుగుతున్నది కదా! తెలంగాణ ప్రభుత్వం కేవలం రాష్ట్రాలతో, కేంద్రంతోనే కాదు... ప్రపంచంలోని ఇతర దేశాలతో కూడా పోటీపడుతోంది! - వనం జ్వాలా నరసింహారావు తెలంగాణ ముఖ్యమంత్రి సీపీఆర్ఓ -
ముందుగా మేల్కొంటే విజయం తథ్యమే!
ఇటీవల ముగిసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలలో ప్రసంగిం చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు... తనకూ, టీఆర్ఎస్ పార్టీకీ రాజకీయాలంటే ఒక క్రీడ కానే కాదనీ, అదొక విద్యుక్త ధర్మమనీ వ్యాఖ్యానించారు. ఆయన చెప్పిన మాటలను లోతుగా అర్థం చేసుకుంటే అనేక భావాలు గోచరిస్తాయి. 2014 తర్వాత, మోదీ నేతృత్వంలోని బీజేపీ అజేయంగా మారిందని కొందరి భావన. దానివల్లనే పలువురు బీజేపీ యేతర రాజకీయ ప్రత్యర్థులూ, వివిధ పార్టీల నాయకులూ కొంతమేరకు అయోమయంలో పడిపోయారు. అది సహజం. అయితే 2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో మోదీ నేతృత్వంలోని బీజేపీని ఓడించాలంటే కష్టం కావచ్చేమోగానీ అసాధ్యం మాత్రం కాదు. కాకపోతే దాన్నొక టాస్క్‌లాగా తీసుకోవాలి. అదే సమయంలో ఒక గొప్ప వ్యూహాన్ని కూడా రూపొందించాలి. దాన్ని అంకిత భావంతో అమలు చేయాలి. ఇటీవల 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో సాధించిన విజయా లను విశ్లేషిస్తే, దేశంలో ఎన్నికల వ్యూహంలో గణనీయమైన మార్పులు వచ్చాయని అవగతమవుతున్నది. ఈ విషయాన్ని చాలా రాజకీయ పార్టీలు అర్థం చేసుకోలేకపోయాయి. బీఎస్పీ, ఎస్పీలతో సహా కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోవడానికి కారణం ఇదే. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ప్రాంతీయ పార్టీల సమర్థతను చాటి చెబుతోంది. 70వ దశకంలో వామపక్షాలతో సహా అన్ని రకాల మిత వాద భావజాలం ఉన్న రాజకీయ పార్టీల కన్సార్షియం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో జనతా పార్టీగా ఆవిర్భవించి విజయవంతంగా ఎన్నికలను గెలిచింది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్ట మొదటి కాంగ్రెసేతర ప్రభు త్వంగా 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వం రికార్డు సృష్టిం చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీని ఎవరు ఎదుర్కోగలరన్న ప్రశ్న ప్రజల ముందుకు పదేపదే తీసు కొచ్చినా ప్రయోజనం లేకపోయింది. అలాగే, ఇప్పుడు బీజేపీ, దాని మద్దతుదారులు కూడా మోదీని ఎవరు ఎదుర్కోగలరని అడుగుతున్నారు. జనతా పార్టీ ప్రయోగం దేశ రాజకీయ ఎజెండాలో కొత్త దృశ్యాలను ఆవిష్కరించింది. ఈ ప్రయోగమే ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, యునైటెడ్ పీపుల్స్ అల యన్స్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ తదితర ఫ్రంట్ల శ్రేణికి మార్గదర్శకత్వం వహించిందనవచ్చు. ఈసారి ప్రయోగం ఫ్రంట్ కాకపోవచ్చు. అన్ని రకాల సారూప్య రాజకీయ పార్టీల కన్సార్షియం కావచ్చు. మోదీ నాయకత్వంలో ఒకప్పుడు ప్రమాదంగా భావించిన హిందుత్వమే నేడు ప్రధాన ఎన్నికల ఎజెండాగా మారింది. అందువల్ల, ఇక్కడ సందేశం చాలా స్పష్టంగా ఉంది. తదుపరి సార్వత్రిక ఎన్నికలలో మోదీ నేతృ త్వంలోని బీజేపీ బలాన్ని ఒంటరిగా ఏ జాతీయ పార్టీ తగ్గించ లేక పోవచ్చు. కానీ కేసీఆర్ ప్రతిపాదించిన కాంగ్రెసేతర, బీజేపీ యేతర పార్టీల కన్సార్షియం కచ్చితంగా బీజేపీ విజయానికి అడ్డుకట్ట వేయగలదు. బీజేపీ హిందుత్వానికి వ్యతిరేకంగా ఈ కన్సార్టియం... లౌకికవాదం, ప్రజా సంక్షేమం అనే లక్ష్యాలను తీసుకోవాలి. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఉటంకించాలి. ప్రజా సమస్యలకు పరిష్కారాలు చూపాలి. కాంగ్రెస్ మద్దతు లేకుండా బీజేపీకి వ్యతి రేకంగా కన్సార్టియంకు ఆస్కారం లేదన్న వాదన సరైంది కాదు. నేడు దేశంలో బీజేపీకి అడ్డుకట్ట వేయగలిగేది ప్రాంతీయ పార్టీలేనన్న విషయాన్ని గుర్తెరగాలి. ఈ నేపథ్యంలో భవిష్య త్లో రూపుదిద్దుకోనున్న కన్సార్టియంలో, కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామిగా చేరాలనుకుంటే, అన్ని పార్టీలూ స్వాగతించాలి. కానీ నాయకత్వం ఇవ్వకూడదు. కేసీఆర్ చెప్పినట్లుగా ఎన్నికలను విద్యుక్త ధర్మంలాగా చూడాలి. 2024 ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలను నేటి నుంచే ఒక టాస్క్‌గా తీసుకోవాలి. తెలంగాణలో కోట్లాది మందికి లబ్ధి చేకూర్చేలా విజయవంతంగా అమలుచేస్తున్న పథకాలను, కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. దేశంలోని కాంగ్రెసేతర, బీజేపీ యేతర పార్టీలు కలిసి ఎన్నిక లకు చాలా ముందు నుంచే బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా ప్రచారాన్ని చేపట్టాలి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని నిలువరించడం పూర్తిగా సాధ్యమే. -వనం జ్వాలానరసింహారావు వ్యాసకర్త తెలంగాణ సీఎం చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ -
రాజకీయాల్లో లోపిస్తున్న గౌరవ మర్యాదలు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులు పోషించాల్సిన పాత్ర బహుముఖమైనదనే విషయాన్ని ఇటీవల చాలామంది నాయకులు మరచిపోవడం బాధాకరం. నాయకులు హుందాగా నడచుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది. కానీ క్రమేపీ రాజకీయాల్లో మర్యాదలనేవి మంట గలుస్తు న్నాయి. దీనికి కారణం ఒకరా, ఇద్దరా, ఒక పార్టీవారా, అన్ని పార్టీలవారా అంటే జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలి పోతుంది. ‘తిలా పాపం, తలా పిడికెడు’. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఒక సమావేశంలో రాజకీయాల్లో సభ్యత, మర్యాద, మన్నన అనేవి మూడు ప్రధానమైన సూత్రాలనీ; వీటికి కట్టుబడి రాజకీయాలు సాగిస్తేనే అవి అర్థవంతంగా, క్రియాశీలకంగా సాగుతాయనీ అన్నారు. కానీ కొందరు నాయకులు బహి రంగంగా మాట్లాడేటప్పుడు, అందునా వారికంటే ఎన్నో రెట్లు ఎక్కువ గౌరవ ప్రదమైన తమ ప్రత్యర్థుల ప్రస్తావన తెచ్చినప్పుడు కూడా అసభ్యకరమైన పదజాలాన్ని అల వోకగా ఉపయోగిస్తు న్నారు. ఈ ధోరణి అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ తెలంగాణలో ఈమధ్య ఎక్కువ మోతాదులో కనిపిస్తున్నది. మొన్న–మొన్న దుబ్బాకలో, తదనంతరం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో, అవి ముగిసిన తరువాతా ఒక జాతీయపార్టీ అధ్యక్షుడైన వ్యక్తి, రాష్ట్ర ముఖ్య మంత్రి మీద అనునిత్యం విషం కక్కుతున్నారు. వారి కుటుంబ సభ్యులపై కూడా తిట్లు, శాపనార్థాలతో దాడి చేశారు. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర నాయకుడెవరూ గతంలో ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవు. ప్రత్యర్థిని మాటల తూటాలతో, వాగ్బాణాలతో మట్టి కరిపించవచ్చు. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టవచ్చు. కానీ బురద జల్లడం దుర దృష్టకరం. ఇలాంటి నాయకులు చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది. 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత, కేంద్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో, అప్పటి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ హైదరాబాద్‌లో పర్యటించి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్ వద్ద జరిగిన సభల్లో ప్రసంగించారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని ‘నిరంతర అబద్ధాలకోరు’ అని విమర్శించారు. ఇది ప్రధానమంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‌కు నిమిషాల్లో వేగుల ద్వారా తెలిసింది. దీంతో ఫెర్నాండెజ్‌ను సుతిమెత్తగా మందలించారు. ఇలాంటి మాటల వల్ల మాజీ ప్రధానిగా ఇందిరాగాంధీ గొప్పతనాన్ని, సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని తక్కువ చేసి మాట్లాడినట్లు అవుతుందని చెప్పారు. ‘నిరంతర అబద్ధాలకోరు’ బదులుగా ‘ఇందిరాగాంధీ చాలా అరుదుగా నిజాలు మాట్లాడతారు’ అని సభ్యతగా అంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఈ విషయం పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. ఆ రోజుల్లో రాజ కీయాలంటే అలా ఉండేవి. గతేడాది మనదేశంలో కరోనా మొదలైనప్పుడు ప్రజలు సంఘటితమై దాన్ని ఎదుర్కోవాలని, సంఘటిత శక్తిని ప్రద ర్శించడానికి కొవ్వొత్తులు వెలిగించాలని, పళ్లాలు గరిటెలు పట్టుకొని చప్పుళ్లు చేస్తూ సంఘీభావం ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీంతో ఆయన్ను కొందరు ప్రతిపక్ష నాయకులు ఎగతాళి చేశారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశ ప్రధా నిని అలా విమర్శించడం ఎవరికీ తగదని హితవు పలికారు. ప్రధానిని అపహాస్యం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని కూడా డీజీపీని కోరారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షం అంటే, అధికారంలో ఉన్న పక్షాన్ని అందరికంటే ఎక్కువగా తిట్లుతిట్టే స్థాయికి దిగజార్చారు జాతీయ పార్టీల్లోని కొందరు నాయకులు. అధికార పార్టీపై సహజంగా ఉండే కొద్దిపాటి వ్యతిరేకతను చూసి, అదే తమ బలం అనుకుంటున్నారు. తాము ముఖ్య మంత్రిని ఇలా తిడుతుండబట్టే ప్రజలు బ్రహ్మరథం పడు తున్నారని అనుకుంటున్నారు. ఇది వారి అవివేకం. అయితే, ఈయన వాడుతున్న భాష అదే పార్టీలోని మిగతా నాయ కులను ఇబ్బంది పెడుతున్నది. అతడు ఏమాట జారినా, మీడియాకు పార్టీలోని వారంతా ఏం సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి వస్తుందో అనే సంశయం వారిలో నెలకొంది. అదే సమయంలో ఆ జాతీయపార్టీ అధినాయ కత్వం కూడా ఇలా అనైతికంగా మాట్లాడుతున్న వ్యక్తిని నిశ్శబ్దంగా చూస్తుం డటం దురదృష్టకరం. గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి అను నిత్యం విమర్శించేవారు. కానీ, ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ సమస్యపై మాట్లాడేందుకు దేశ ప్రతినిధిగా వాజ్‌పేయినే నియమించి ఇదీ పీవీ ఠీవీ అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు పీవీ. నెహ్రూ ప్రభుత్వాన్ని కూడా ప్రతిపక్ష పార్ల మెంట్ సభ్యుడిగా వాజ్‌పేయి విమర్శిస్తూనే ఉండేవారు. కానీ జనతా ప్రభుత్వం హయాంలో నెహ్రూ చిత్రపటాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యాలయం నుంచి తొలగిస్తున్న పుడు, వాజ్‌పేయి అభ్యంతరం వ్యక్తం చేసి, ఆ చిత్రపటాన్ని మళ్లీ అదేచోట పెట్టించారు. అప్పటి నాయకుల్లో పరస్పర గౌరవం అలా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి వారున్నప్పటి కాలంలో ట్రెజరీ బెంచీలకు చెందిన మంత్రులు, విప్‌లు ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వెళ్లి వారడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానమిస్తే ప్రజోపయోగకరంగా వుంటుందో చర్చించిన సందర్భాలు వున్నాయి. ఈ రోజుల్లో అధికార పార్టీ ప్రయత్నించినా, ప్రతిపక్షం సరైన స్ఫూర్తితో స్పంది స్తుందా అన్నది సందేహమే. ఒక రాజకీయ పార్టీ అస్తిత్వం దాన్ని నడిపే నాయ కత్వం, వారు పనిచేసే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. దుర్భాష వినడానికి వినోదంగా అనిపిస్తుందేమో గానీ, అందులో ప్రజా ప్రయోజనం ఉండదు. ప్రత్యర్థులు అనుసరి స్తున్న విధానాలపైగానీ, ప్రజా సమస్యలపైగానీ విమర్శిం చవచ్చు. కానీ, తిట్టడం, శరీరాకృతిని అవహేళన చేయడం ప్రజా జీవితంలో ఉండే నాయకులు ఏనాడూ చేయకూడదు. తొండి మాటలు, తిట్ల పురాణాలు తాత్కాలికంగా విజ యంగా కనిపించినా, మన స్థాయిని దిగజార్చి, మనల్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తాయనే విషయాన్ని వారు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఇంతవరకు ఎవరూ వాడని భాషను తాత్కాలికంగా ప్రజలు ఆసక్తిగా గమనిస్తారే తప్ప, ఆ భాష మాట్లాడిన వ్యక్తిని మాత్రం అభిమానించరు. దీర్ఘ కాలంలో వారిని ప్రజా నాయకుడిగా కూడా అంగీకరించరు. -వనం జ్వాలా నరసింహారావు వ్యాసకర్త తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాన ప్రజాసంబంధాల అధికారి -
ప్రాజెక్టులకు ఇక రాచబాట
విశ్లేషణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ భూసేకరణ, పునరావాసం, పునఃపరిష్కారంలో న్యాయ పరిహారం, పారదర్శకమైన హక్కు బిల్లుకు శాసనసభ పునః పరిశీలన తరువాత రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బుధవారమే గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీచేసింది. చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకోగా, రెవెన్యూ ఉన్నతాధికా రులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ కీలక పాత్ర పోషించారు. కొత్త చట్టం రావడంతో, రాష్ట్రంలో భూసేకరణకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయి, వివిధ రకాలైన ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతమౌతాయి. ఈ నేపథ్యంలో భూసేకరణ చట్టం పూర్వాపరాలు ఒక్కసారి అవలోకనం చేసుకుంటే బాగుంటుందేమో. భారత రాజ్యాంగం ఆర్టికల్ 298 ప్రకారం భూసేకరణ ద్వారా భూమిని కొనుగోలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది. జీవో నంబర్లు 123, 190, 191 ద్వారా తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. కాకపోతే కొన్ని రాజ కీయ పక్షాలు ఈ జీవోల విషయంలో, వాటి అమలు విషయంలో కొన్ని సందేహాలు లేవనెత్తాయి. అవి ప్రజల్లో అపోహకు తావు ఇచ్చాయి. వాటిని నివృత్తి చేయడానికీ, భూసేకరణ విధానానికి ఒక చట్ట రూపాన్ని తేవడానికీ డిసెంబర్ 28, 2016న భూసేకరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 2013 చట్టానికి మూడు పర్యాయాలు ఆర్డినెన్స్ తీసుకొచ్చి, తరువాత చట్ట రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మొదటి ఆర్డినెన్స్ డిసెంబర్ 31, 2014 న, రెండవది ఏప్రిల్ 3, 2015 న, మూడవసారి మే 30, 2015న తీసుకొచ్చింది కేంద్రం. కాకపోతే రాజకీయ కారణాల వల్ల ఈ ఆర్డినెన్సులు రాజ్యసభ ఆమోదం పొందలేదు. ఆ చట్టాలకు సవరణలు కొత్తకాదు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆర్డినెన్సుల ప్రస్తావన తెచ్చి, వారి వారి రాష్ట్రాలలో, రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా సొంత చట్టాలను రూపొందించుకోవాలని ముఖ్యమంత్రులకు సూచించారు. వాస్తవానికి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా అలాంటి అధికారం ఉంది. కాకపోతే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలు తమ సొంత చట్టాలను రూపొందించుకున్నాయి. ఇదేం కొత్త విషయం కాదు. గతంలో కూడా భూసేకరణ చట్టాలకు అనేక సవరణలు, రాష్ట్రపతి ఆమోదముద్ర మనం తీసుకున్నాం. ఉదాహరణలు చెప్పుకోవాలంటే: నాగార్జున సాగర్ భూసేకరణ 1956, భూసేకరణ 1959, వైజాగ్ స్టీల్ ప్రాజెక్ట్ చట్టం 1972, భూసేకరణ చట్టం 1976, భూసేకరణ చట్టం 1983 అలాంటివే. మనది కొత్త రాష్ట్రం. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు కూడా కొత్తవే. తెలంగాణ ఉద్యమమే ‘నీళ్లు’, ‘నిధులు’, ‘నియామకాలు’ నినాదాల ప్రాతి పదికగా జరిగింది. ఏ నీళ్లకైతే తెలంగాణ ఉద్యమించిందో, ఆ నీళ్లకు నీటిపారుదల ప్రాజెక్టులు కావాలి. వాటికి భూసేకరణ జరగాలి. మరీ వివరంగా చెప్పాలంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి ప«థంలో నడిపించడానికి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. శాసనసభలో బిల్లును ప్రవేశ పెట్టిన సందర్భంగా చాలా విషయాలను ప్రభుత్వం స్పష్టంగా విశదీకరించింది. భూమి సొంతదారుడు స్వఛ్చందంగా తన భూమిని భూసేకరణ కోసం ఇవ్వడానికి అంగీకరిస్తాడో, దానిని అమలు చేయడానికి 123, 190, 191 జీవోలున్నాయి. ఎక్కడైతే అలా కాకుండా 2013 చట్టం ప్రకారం కావాలని రైతులు కోరుకుంటారో అది కూడా అమలు చేసే వెసులుబాటు కలిగించింది ప్రభుత్వం. ఇంతకీ 2013 చట్టానికి సవరణ తేవాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. ఏ విధంగా చూసినా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఆ చట్టం, ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ‘తాడూ, బొంగరం లేని వారు కూర్చుని చేశారు’. వాస్తవాలు తెలియాలి భూసేకరణ చట్టం వాస్తవికతను ప్రశ్నించేవారికి కొన్ని విషయాలు స్పష్టంగా తెలియడం మంచిది. భూసేకరణ జరగకుండా ప్రాజెక్టుల నిర్మాణం జరగదనేది వాస్తవం. భూసేకరణ చేయబట్టే నాగార్జునసాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు కట్టుకున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద పునరావాసం జరిగిన ప్రాజెక్టుగా రికార్డుల్లోకి ఎక్కిన చైనా వారి ‘త్రీ గార్జెస్ డ్యాం’ మూలాన పన్నెండు లక్షల కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. అదెందుకు జరిగిందంటే...ప్రజల ప్రయోజనాల కోసమే. తరతరాలకు ఉపయోగపడే పథకాలతో, మానవాళికి బహుళ ప్రయోజనాలు సమకూర్చే పథకాలతో తప్పకుండా కొందరికి నష్టం, కష్టం జరుగుతుంది. అలా జరుగుతుంది కదా అని ప్రాజెక్టులే వద్దు, భూసేకరణే తగదు అనడం తొందరపాటు. అసలీ చట్టం తేవాలన్న ఆలోచనకు మూలం మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టుల కోసం జరుగుతున్న భూసేకరణను కొందరు రాజకీయం చేయడమే. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం 75% మంది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. మిగిలినవారి విషయానికొచ్చేసరికి రాజకీయాలు మొదలయ్యాయి. ప్రాజెక్టు పూర్తికాకూడదనీ, లిటిగేషన్ ఉండాలనీ ఆలోచన మొదలైంది. గౌరవప్రదమైన పరిహారం వాస్తవానికి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, ఏ ప్రాజెక్టుకూ చెల్లించనంత పరిహారం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఉదాహరణకు మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో వున్న తపాస్ పల్లి రిజర్వాయర్ కింద భూమి కోల్పోయిన రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో ముట్టిన పరిహారం ఎకరాకు ఎనభై వేలు! మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం ఆరున్నర లక్షలు. అయినా ఆందోళనే! ఎందుకిలా చేయాలి? ప్రాజెక్టులు కట్టినప్పుడు కొన్ని చోట్ల భూములు పూర్తిగా, కొన్ని చోట్ల పాక్షికంగా మునిగిపోతాయి. గ్రామం కూడా పూర్తిగానో, పాక్షికంగానో మునిగిపోవచ్చు. గ్రామమంతా మునగకుండా, కొంత శివారు మిగిలివుంటే, అక్కడే పునరావాస కాలనీ కట్టించే చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంది. అయినా విమర్శలే! కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇందిరా ఆవాస్ యోజన కింద ఇంటికి ఇచ్చే పరిహారం లక్ష రూపాయలు. అలాగే వారిచ్చే 200 గజాల జాగా ఖరీదు గ్రామాలలో రూ. 20,000 మించదు. మొత్తం కలిపి రూ. 1,20,000 ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్ విలువ ఎంతవుంటే అంతకు మూడు రెట్లు పెంచి పరిహారం ఇవ్వాలని ఆ చట్టంలో ఉంది. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం, మూడు రెట్లకు బదులుగా, పదిరెట్లు పైగా పెంచి ఇచ్చింది. చాలామంది రైతులు అలా లాభపడ్డారు కూడా. సీఎం ఈ విషయాన్ని శాసనసభలో ప్రకటించారు. రూ. 60,000 రిజిస్ట్రేషన్ విలువ ఉంటే రు. 6, 50,000 ఇచ్చింది ప్రభుత్వం. నిజానికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం రూ.1,20,000 ఇచ్చి చేతులు దులుపుకోవచ్చు. దీనికి అదనంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో జరుగుతున్నందున, వారికి నచ్చిన చోట ఆ తరహా ఇళ్లు కట్టుకునే వెçసులుబాటును కూడా కలిగించింది ప్రభుత్వం. నిర్వాసితులకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ఇంటి కోసం మరో రూ. 5.04 లక్షలిచ్చింది ప్రభుత్వం. ఇవన్నీ 123 జీవో ప్రకారం ఇచ్చినవే! కేంద్రం సలహా మేరకే చట్టం 123 జీవో అమలుపై కొందరు న్యాయస్థానాలకు వెళ్లారు. హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టంగా ఈ విషయాలన్నీ పేర్కొనడం జరిగింది. భూమిలేని నిర్వాసితులకు వన్ టైం పరిహారం కింద 2013 భూసేకరణ చట్టంలో ఉన్నదానికంటే మరో లక్ష రూపాయలు అదనంగా ఇస్తున్నట్లు కూడా అఫిడవిట్లో పేర్కొంది ప్రభుత్వం. ఇదంతా ప్రజల మేలుకోరి చేసిందే. ప్రజలకు నష్టం కలిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదనే వాస్తవం బోధపడుతోంది. ఇంత చేసినా రాజకీయాలు చేయడం ఆగలేదు. కొన్ని రాజ కీయ పార్టీల వైఖరిలో మార్పు రాలేదు. ప్రాజెక్టుల నిర్మాణం ఎలా ఆపుచేయాలా అన్న నిరంతర ఆలోచన కొనసాగిస్తున్నారు. అడుగడుగునా అడ్డుపడుతున్నారు. కోర్టులకు పోవడమో, లేదా గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చుకుని ఆనందించడమో చేశారు. ఇది ప్రతిపక్షాలు చేసే పని కాదు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించింది. 2013 భూసేకరణ చట్టం చాలా బాధ్యతారహితంగా చేసిన చట్టం అని కేంద్రం కూడా చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీని కూడా సీఎం చంద్రశేఖరరావు సంప్రదించారు. ఆయన సలహా తీసుకున్నారు. రాజ్యాంగబద్ధంగా రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు లాంటి ఐదారు రాష్ట్రాలు 2013 భూసేకరణ చట్టానికి సవరణ చేసుకున్న విషయం వారిద్దరిమధ్య ప్రస్తావనకొచ్చినట్లు సీఎం శాసనసభలో చెప్పారు. భూసంబంధమైన అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నం దున, ఆ రాష్ట్రాల నమూనాలో, తెలంగాణ కూడా రాష్ట్రావసరాలకు అనుగుణంగా చట్టానికి సవరణలు చేస్తే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయించుకోవచ్చని తేలింది. అంటే, కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు, సూచన మేరకు, చట్టానికి సవరణ తీసుకురావడం జరిగింది. చట్టానికి సవరణలు రూపొందించే పూర్వరంగంలో, ఏదో ఆషామాషీగా చేయకుండా, సుదీర్ఘ ప్రక్రియ ద్వారా దాన్ని తయారుచేసి సభముందుకు తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంబంధిత శాఖాధికారులు, ఢిల్లీ వెళ్లి, కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ, ల్యాండ్ రికార్డుల శాఖ వారికి చూపించి, వారు అంగీకరించిన తరువాతే, తదనుగుణంగానే కేంద్ర ఆమోదం లభిస్తుందన్న హామీ లభించిన తరువాతే, బిల్లును డ్రాఫ్ట్ చేసి శాసనసభ ముందుకు తెచ్చింది ప్రభుత్వం, డిసెంబర్ నెలలో. ప్రాజెక్టులన్నీ పూర్తికావడం తథ్యం బిల్లు ఉభయ సభల ఆమోదం పొందిన తరువాత కేంద్రం ఆమోదం కోసం పంపించడం, వారి సూచనల మేరకు కొన్ని మార్పులు చేసి మళ్లీ ఏప్రిల్ 30, 2017న మరోమారు ఉభయ సభల ఆమోదం పొందడం జరిగింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. దానికి రాజముద్ర పడింది. ఇక వందకు వంద శాతం ప్రాజెక్టులు పూర్తికావడం త«థ్యం. తెలంగాణాలో కోటి ఎకరాలకు సాగునీరు అందడం కూడా తథ్యం. వ్యాసకర్త: వనం జ్వాలా నరసింహారావు తెలంగాణ సీఎం ప్రధాన పౌర సంబంధాల అధికారి మొబైల్ : 80081 37012