రాజకీయాల్లో లోపిస్తున్న గౌరవ మర్యాదలు | Respect Less Politics Guest Column By Vanam Jwala Narasimha Rao | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో లోపిస్తున్న గౌరవ మర్యాదలు

Published Wed, Jan 13 2021 12:41 AM | Last Updated on Wed, Jan 13 2021 12:41 AM

Respect Less Politics Guest Column By Vanam Jwala Narasimha Rao - Sakshi

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులు పోషించాల్సిన పాత్ర బహుముఖమైనదనే విషయాన్ని ఇటీవల చాలామంది నాయకులు మరచిపోవడం బాధాకరం. నాయకులు హుందాగా నడచుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది. కానీ క్రమేపీ రాజకీయాల్లో మర్యాదలనేవి మంట గలుస్తు న్నాయి. దీనికి కారణం ఒకరా, ఇద్దరా, ఒక పార్టీవారా, అన్ని పార్టీలవారా అంటే జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలి పోతుంది. ‘తిలా పాపం, తలా పిడికెడు’.  ఇటీవల ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఒక సమావేశంలో రాజకీయాల్లో సభ్యత, మర్యాద, మన్నన అనేవి మూడు ప్రధానమైన సూత్రాలనీ; వీటికి కట్టుబడి రాజకీయాలు సాగిస్తేనే అవి అర్థవంతంగా, క్రియాశీలకంగా సాగుతాయనీ అన్నారు. కానీ కొందరు నాయకులు బహి రంగంగా మాట్లాడేటప్పుడు, అందునా వారికంటే ఎన్నో రెట్లు ఎక్కువ గౌరవ ప్రదమైన తమ ప్రత్యర్థుల ప్రస్తావన తెచ్చినప్పుడు కూడా అసభ్యకరమైన పదజాలాన్ని అల వోకగా ఉపయోగిస్తు న్నారు.

ఈ ధోరణి అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ తెలంగాణలో ఈమధ్య ఎక్కువ మోతాదులో కనిపిస్తున్నది. మొన్న–మొన్న దుబ్బాకలో, తదనంతరం గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో, అవి ముగిసిన తరువాతా ఒక జాతీయపార్టీ అధ్యక్షుడైన వ్యక్తి, రాష్ట్ర ముఖ్య మంత్రి మీద అనునిత్యం విషం కక్కుతున్నారు. వారి కుటుంబ సభ్యులపై కూడా తిట్లు, శాపనార్థాలతో దాడి చేశారు. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర నాయకుడెవరూ గతంలో ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవు. ప్రత్యర్థిని మాటల తూటాలతో, వాగ్బాణాలతో మట్టి కరిపించవచ్చు. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టవచ్చు. కానీ బురద జల్లడం దుర దృష్టకరం. ఇలాంటి నాయకులు చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది.  

1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత, కేంద్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో, అప్పటి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ హైదరాబాద్‌లో పర్యటించి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ వద్ద జరిగిన సభల్లో ప్రసంగించారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని ‘నిరంతర అబద్ధాలకోరు’ అని విమర్శించారు. ఇది ప్రధానమంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‌కు నిమిషాల్లో వేగుల ద్వారా తెలిసింది. దీంతో  ఫెర్నాండెజ్‌ను సుతిమెత్తగా మందలించారు. ఇలాంటి మాటల వల్ల మాజీ ప్రధానిగా ఇందిరాగాంధీ గొప్పతనాన్ని,  సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని తక్కువ చేసి మాట్లాడినట్లు అవుతుందని చెప్పారు. ‘నిరంతర అబద్ధాలకోరు’ బదులుగా ‘ఇందిరాగాంధీ చాలా అరుదుగా నిజాలు మాట్లాడతారు’ అని సభ్యతగా అంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఈ విషయం పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. ఆ రోజుల్లో రాజ కీయాలంటే అలా ఉండేవి.

గతేడాది మనదేశంలో కరోనా మొదలైనప్పుడు ప్రజలు సంఘటితమై దాన్ని ఎదుర్కోవాలని, సంఘటిత శక్తిని ప్రద ర్శించడానికి కొవ్వొత్తులు వెలిగించాలని, పళ్లాలు గరిటెలు పట్టుకొని చప్పుళ్లు చేస్తూ సంఘీభావం ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీంతో ఆయన్ను కొందరు ప్రతిపక్ష నాయకులు ఎగతాళి చేశారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు దేశ ప్రధా నిని అలా విమర్శించడం ఎవరికీ తగదని హితవు పలికారు. ప్రధానిని అపహాస్యం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని కూడా డీజీపీని కోరారు.  

ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షం అంటే, అధికారంలో ఉన్న పక్షాన్ని అందరికంటే ఎక్కువగా తిట్లుతిట్టే స్థాయికి దిగజార్చారు జాతీయ పార్టీల్లోని కొందరు నాయకులు. అధికార పార్టీపై సహజంగా ఉండే కొద్దిపాటి వ్యతిరేకతను చూసి, అదే తమ బలం అనుకుంటున్నారు. తాము ముఖ్య మంత్రిని ఇలా తిడుతుండబట్టే ప్రజలు బ్రహ్మరథం పడు తున్నారని అనుకుంటున్నారు. ఇది వారి అవివేకం. అయితే, ఈయన వాడుతున్న భాష అదే పార్టీలోని మిగతా నాయ కులను ఇబ్బంది పెడుతున్నది. అతడు ఏమాట జారినా, మీడియాకు పార్టీలోని వారంతా ఏం సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి వస్తుందో అనే సంశయం వారిలో నెలకొంది. అదే సమయంలో ఆ జాతీయపార్టీ అధినాయ కత్వం కూడా ఇలా అనైతికంగా మాట్లాడుతున్న వ్యక్తిని నిశ్శబ్దంగా చూస్తుం డటం దురదృష్టకరం. 

గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి అను నిత్యం విమర్శించేవారు. కానీ, ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్‌ సమస్యపై మాట్లాడేందుకు దేశ ప్రతినిధిగా వాజ్‌పేయినే నియమించి ఇదీ పీవీ ఠీవీ అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు పీవీ. నెహ్రూ ప్రభుత్వాన్ని కూడా ప్రతిపక్ష పార్ల మెంట్‌ సభ్యుడిగా వాజ్‌పేయి విమర్శిస్తూనే ఉండేవారు. కానీ జనతా ప్రభుత్వం హయాంలో నెహ్రూ చిత్రపటాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యాలయం నుంచి తొలగిస్తున్న పుడు, వాజ్‌పేయి అభ్యంతరం వ్యక్తం చేసి, ఆ చిత్రపటాన్ని మళ్లీ అదేచోట పెట్టించారు. అప్పటి నాయకుల్లో పరస్పర గౌరవం అలా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసన సభలో, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి వారున్నప్పటి కాలంలో ట్రెజరీ బెంచీలకు చెందిన మంత్రులు, విప్‌లు ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వెళ్లి వారడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానమిస్తే ప్రజోపయోగకరంగా వుంటుందో చర్చించిన సందర్భాలు వున్నాయి. ఈ రోజుల్లో అధికార పార్టీ ప్రయత్నించినా, ప్రతిపక్షం సరైన స్ఫూర్తితో స్పంది స్తుందా అన్నది సందేహమే.

ఒక రాజకీయ పార్టీ అస్తిత్వం దాన్ని నడిపే నాయ కత్వం, వారు పనిచేసే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. దుర్భాష వినడానికి వినోదంగా అనిపిస్తుందేమో గానీ, అందులో ప్రజా ప్రయోజనం ఉండదు. ప్రత్యర్థులు అనుసరి స్తున్న విధానాలపైగానీ, ప్రజా సమస్యలపైగానీ విమర్శిం చవచ్చు. కానీ, తిట్టడం, శరీరాకృతిని అవహేళన చేయడం ప్రజా జీవితంలో ఉండే నాయకులు ఏనాడూ చేయకూడదు. తొండి మాటలు, తిట్ల పురాణాలు తాత్కాలికంగా విజ యంగా కనిపించినా, మన స్థాయిని దిగజార్చి, మనల్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తాయనే విషయాన్ని వారు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఇంతవరకు ఎవరూ వాడని భాషను తాత్కాలికంగా ప్రజలు ఆసక్తిగా గమనిస్తారే తప్ప, ఆ భాష మాట్లాడిన వ్యక్తిని మాత్రం అభిమానించరు. దీర్ఘ కాలంలో వారిని ప్రజా నాయకుడిగా కూడా అంగీకరించరు.

-వనం జ్వాలా నరసింహారావు
వ్యాసకర్త తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాన ప్రజాసంబంధాల అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement